ఐపీఎల్ ఫైనల్: ఆర్‌సీబీ, పంజాబ్ కింగ్స్‌లో కప్ కొట్టేదెవరు?

    • రచయిత, అక్షయ్ హెగ్డే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

చండీగఢ్ వేదికగా మే 29న పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. బెంగళూరు ఈ విజయాన్ని అందుకున్న తర్వాత ముల్లన్‌పూర్ మైదానంలో రెండు ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి.

18 ఏళ్లుగా ఐపీఎల్ టైటిల్ కోసం పోరాడుతోన్న విరాట్ కోహ్లీ, ప్రేక్షకుల మధ్యలో కూర్చున్న అనుష్క శర్మను చూస్తూ.. గెలిచేందుకు మరో మ్యాచ్ ఉందంటూ సంకేతాలు ఇచ్చాడు.

మరో సంఘటన.. ఓటమిపై స్పందించిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ''ఈ పోరాటంలో ఓడిపోయాం. కానీ, యుద్ధంలో కాదు.'' అని అన్నాడు.

ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకునేందుకు జరిగిన క్వాలిఫయర్-2లో బలమైన ముంబయి ఇండియన్స్‌ జట్టును ఓడించి అయ్యర్ తన ఈ మాటలను రుజువు చేశాడు.

ఈరోజు (జూన్ 3) రాత్రి అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) మధ్యలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

దీంతో, ఈ ఏడాది ఐపీఎల్‌ టైటిల్ కొత్త విజేతను వరించబోతోంది. 18 ఏళ్లుగా ఆడుతోన్న విరాట్ కోహ్లీ, నెంబర్ 18 జెర్సీని వేసుకుంటున్నాడు. ఇప్పటి వరకు కోహ్లీ జట్టు ఐపీఎల్ టైటిల్‌ను పొందలేకపోయింది.

మరోవైపు, వరుసగా రెండో ఏడాది రెండు వేర్వేరు జట్లను ఐపీఎల్ ఫైనల్‌కు తీసుకెళ్లిన ఘనతను శ్రేయస్ అయ్యర్ సాధించాడు.

గత ఏడాది ఐపీఎల్‌లో విజయం సాధించిన కోల్‌కతా నైట్ రైడర్స్‌కు శ్రేయస్ అయ్యార్ నేతృత్వం వహించాడు.

కానీ, తదుపరి వేలంలో శ్రేయాస్ అయ్యర్‌ను పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు ఐపీఎల్‌ టైటిల్‌‌ను గెలుచుకోని పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్స్‌కు తీసుకొచ్చాడు శ్రేయస్.

పంజాబ్, ఆర్సీబీ టీమ్‌ల ప్రదర్శనలో అటు విరాట్ కోహ్లీ, ఇటు శ్రేయస్ అయ్యర్ కీలక పాత్ర పోషించారు.

లీగ్ స్టేజీలో రెండు జట్లను ఒకటి, రెండో స్థానాలలో నిలిపారు.

ఈ రెండు జట్లలో కూడా ఎంతో ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లు ఉన్నారు.

క్వాలిఫయర్ 1లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు అయితే బెంగళూరు బౌలింగ్‌కు ముళ్ల కంచెలు వేశారు. ఫైనల్ మ్యాచ్‌లో ఈ రెండు జట్లు ఇప్పటి వరకు సాగిన తమ ప్రయాణంలో ఎదురైన వైఫల్యాలను లెక్కచేయకుండా, ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకునేందుకు సర్వశక్తులా పోరాడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

'ఈ సాల కప్ నమ్ దే’ నిజమవుతుందా?

ఆర్‌సీబీ ఇప్పటి వరకు మూడు ఐపీఎల్ ఫైనల్స్‌ను ఆడింది.

2009, 2011, 2016లలో జరిగిన మూడు ఐపీఎల్ ఫైనల్స్‌లో బెంగళూరు ఓడిపోయింది.

గత 18 ఏళ్లుగా అత్యుత్తమ క్రీడాకారులతో బరిలోకి దిగుతోన్న ఈ జట్టు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీని గెలవలేకపోయింది.

కీలక సమయాల్లో ఓటమి పాలైన తర్వాత బెంగళూరు ఆటగాళ్లు భావోద్వేగానికి గురి కావడం చాలామంది క్రికెట్ అభిమానులు చూసే ఉంటారు.

అయినప్పటికీ, విరాట్ కోహ్లీ, బెంగళూరు అభిమానులు మాత్రం రోజురోజుకి పెరుగుతూనే ఉన్నారు.

ఐపీఎల్‌ ట్రోఫీని గెలుచుకోవాలనే ఆశతో 'ఈ సాల కప్ నమ్ దే' అనే పాటను క్రియేట్ చేశారు. ఈ పాట అర్థం 'ఈ సంవత్సరం కప్ మనదే' అని.

ప్రస్తుతం తొమ్మిదేళ్ల తర్వాత ఎట్టకేలకు రజత్ పాటిదార్ నాయకత్వంలో, విరాట్ కోహ్లీ సమక్షంలో బెంగళూరు జట్టు ఫైనల్‌కు చేరుకుంది.

క్వాలిఫయర్ 1లో పంజాబ్‌ కింగ్స్‌ను ఓడించిన తర్వాత బెంగళూరు జట్టుకు ఆత్మవిశ్వాసం మరోస్థాయికి చేరి ఉంటుంది.

కానీ, ముంబయి ఇండియన్స్‌ను ఓడించి ఫైనల్‌కు వచ్చిన పంజాబ్ కింగ్స్ జట్టును మాత్రం తక్కువ అంచనావేసే తప్పును బెంగళూరు చేయదు.

బెంగళూరు జట్టులో విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, జితేష్ శర్మ, లియామ్ లివింగ్‌స్టోన్, రోమారియో షెఫెర్డ్‌ వంటి బలమైన బ్యాటర్లు ఉన్నారు.

కృనాల్ పాండ్యా, యష్ దయాల్, సుయాష్ శర్మ వంటి బౌలర్లు కూడా ఉన్నారు. వీరందరూ ఐపీఎల్ టైటిల్ గెలుచుకునేందుకు తమ శక్తిమేర ప్రయత్నిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.

అయ్యర్ రికార్డు సృష్టిస్తాడా?

ఈ ఏడాది పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ ప్రయాణంలో ఇద్దరు వ్యక్తులు కీలక పాత్ర పోషించారు. ఒకరు టీమ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, మరోకరు కోచ్ రికీ పాంటింగ్. ఆస్ట్రేలియా క్రికెటర్లు చివరి వరకు పట్టు వదలరనే వైఖరిని పంజాబ్ కింగ్స్ యువ ఆటగాళ్లలో చొప్పించడంలో రికీ పాంటింగ్ విజయవంతమయ్యారనేది జట్టు ప్రదర్శన బట్టి స్పష్టమవుతోంది.

పంజాబ్‌ కింగ్స్‌కు దూకుడైన ఆరంభాలను ఇచ్చిన ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్యా, నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, విజయ్‌కుమార్ విశాక్ వంటి యువ బౌలర్లు కీలక సమయాల్లో జట్టును అద్భుతంగా నడిపించడంలో విజయం సాధించారు. వీరితో పాటు జోష్ ఇంగ్లిష్, మార్కస్ స్టోయినిస్ వంటి విదేశీ ఆటగాళ్లు కూడా బాగా ఆడారు.

తమ యువ జట్టును ముందుకు తీసుకెళ్లడంలో శ్రేయస్ అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నమెంట్‌లో 16 మ్యాచులలో సగటు 54.82, స్ట్రయిక్ రేటు 175.80తో 603 పరుగులు చేశాడు.

క్వాలిఫయర్ 2లో శక్తిమంతమైన ముంబయి బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో అయ్యర్ చాలా ప్రశాంతంగా కనిపించాడు. 41 బంతులకు 87 పరుగులు చేశాడు. 8 సిక్సులను బాదాడు.

కానీ, ఈ గెలుపు తర్వాత అత్యంత ఆసక్తికర విషయం ఏంటంటే.. అతనిలో ఎక్కడా దూకుడు స్వభావం కనిపించలేదు.

చాలా కూల్‌గా చేతి గ్లౌజులను తీసేసి, ఇతర ఆటగాళ్లకు కరచాలనం చేసి, 'సగం పని పూర్తయింది.' అని తెలిపాడు. (అంటే మరో సగం పని పూర్తి చేయాల్సి ఉంది.) 2014లో పంజాబ్ ఐపీఎల్ ఫైనల్స్‌కు వెళ్లింది. ఆ తర్వాత ఏడాదికి అంటే 2015లో ముంబయి ఇండియన్స్ తరఫున శ్రేయస్ అయ్యర్ తన తొలి ఐపీఎల్ మ్యాచ్‌ను ఆడాడు.

పంజాబ్ జట్టులో కేవలం ఇద్దరు ఆటగాళ్లకు మాత్రమే ఐపీఎల్ ఫైనల్‌లో ఆడిన అనుభవం ఉంది. వారిలో ఒకరు శ్రేయస్ అయ్యర్, మరొకరు యుజ్వేంద్ర చాహల్.

చాహల్ అంతకుముందు బెంగళూరు కోసం ఫైనల్‌ ఆడాడు. ఈ సమయంలో ఇతర ఆటగాళ్లు ఫైనల్‌లో ఎలా ఆడతారన్నది అత్యంత ముఖ్యం.

ఓ శకం ముగిసిందా?

ఐపీఎల్ ముగియనుండటంతో, ఈ ఏడాది టోర్నమెంట్‌లో ఓ శకం ముగిసినట్లేనని తెలుస్తోంది.

మహేంద్ర సింగ్ ధోని తన పదవీ విరమణపై ఎలాంటి స్పష్టత ఇవ్వనప్పటికీ, ఈ టోర్నమెంట్‌లో అతని ప్రదర్శన తన కెరీర్ ముగింపు దగ్గర్లో ఉందని అర్థమవుతోంది.

మరోవైపు నాలుగుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న ముంబయి ఇండియన్స్‌కు నేతృత్వం వహించిన రోహిత్ శర్మ గత ఏడాదే కెప్టెన్‌గా దిగిపోయారు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ముంబయి కోసం ఆయన ఆడుతున్నాడు. ఐపీఎల్ జరుగుతుండగానే టెస్ట్ క్రికెట్‌కు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించారు.

ఐపీఎల్ మ్యాచులను కనుక మీరు నిశితంగా పరిశీలిస్తే, ప్రతి జట్టు ప్రస్తుతం తమ జట్టు బాధ్యతలను యువ ఆటగాళ్ల భుజాలపై పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు అనిపిస్తోంది.

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీని రితురాజ్ గైక్వాడ్‌కు, ఆర్‌సీబీ కెప్టెన్సీ బాధ్యతను రజత్ పాటిదార్‌కు, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్సీని రిషబ్ పంత్‌కు, దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ బాధ్యతలను అక్షర్ పటేల్‌కు, రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్సీని సంజూ శాంసన్‌కు, ముంబయి ఇండియన్స్ కెప్టెన్సీని హార్దిక్ పాండ్యాకు, గుజరాత్ టైటాన్స్‌ కెప్టెన్సీని శుభ్‌మన్ గిల్‌కు అప్పజెప్పాయి.

2025 ఐపీఎల్ టోర్నమెంట్ నిజంగా పరివర్తన టోర్నమెంట్ కానుందని చెప్పొచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)