కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌: ఈ ప్రమాదం ఎలా జరిగిందంటే...

కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఘోర రైలు ప్రమాదానికి గురైంది.

ఒడిషాలోని బాలాసోర్ స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న గూడ్స్ రైలును కోరమండల్ ఎక్స్‌ప్రెస్ (12841) ఢీకొట్టింది.

ఈ ఘటనలో 30 మందికి పైగా మరణించారని ఒడిశా అధికారులను ఉటంకిస్తూ ఎన్డీటీవీ చెప్పింది.

సంఘటనా స్థలానికి 50 అంబులెన్సులు పంపామని, ఒడిశా ప్రధాన కార్యదర్శి ప్రదీప్ జెనా తెలిపారు.

ఈ ప్రమాదంలో 50 మంది మృతి చెందారని, వందలమంది గాయపడ్డారని పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది.

ఈ సంఘటన బాలాసోర్ సమీపంలోని బహనాగ బజార్ స్టేషన్ సమీపంలో జరిగింది. గాయపడిన వారిని బాలాసోర్ ఆసుపత్రిలో చేర్చారని ఏఎన్ఐ, పీటీఐ వార్తా సంస్థలు వెల్లడించాయి.

ఏం జరిగిందంటే...

అయితే, ఈ ప్రమాదం రెండు పాసింజర్ రైళ్లు, ఒక గూడ్సు రైలు మధ్య జరిగిందని భువనేశ్వర్‌కు చెందిన బీబీసీ ప్రతినిధి సుబ్రతా పతి తెలిపారు.

ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారి అమితాబ్ శర్మ, సుబ్రతా పతితో మాట్లాడారు.

" జూన్ 2వ తేదీ రాత్రి 7 గంటలకు, బహనాగా బజార్ స్టేషన్ దగ్గర ఒక గూడ్స్ రైలును ఢీకొట్టడంతో షాలిమార్ నుంచి చెన్నై వెళ్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 10-12 కోచ్‌లు పట్టాలు తప్పాయి.

దీంతో ఆ బోగీలు ఇంకో ట్రాక్‌పై పడిపోయాయి.

కొంత సమయం తరువాత యశ్వంత్‌పూర్ నుంచి హౌరాకు వెళ్లే మరో రైలు... పట్టాలు తప్పిన కోరమండల్ కోచ్‌ల మీదకు దూసుకెళ్లింది.

ఫలితంగా యశ్వంత్‌పూర్ రైలుకు చెందిన 3-4 కోచ్‌లు పట్టాలు తప్పాయని’’ రైల్వే ప్రతినిధి అమితాబ్ శర్మ చెప్పారు. ఘటనా స్థలానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకుని సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి.

ఈ ప్రమాదంలో గాయాల పాలైన 132 మంది ప్రయాణీకులను గోపాల్‌పూర్‌లోని ఒక ఆసుపత్రిలో చేర్చినట్లు ఒడిషా చీఫ్ సెక్రటరీ ప్రదీప్ జెనా చెప్పారు.

మరో 47 మంది క్షతగాత్రులకు బాలాసోర్‌లోని మెడికల్ కాలేజీలో చికిత్స అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గాయపడిన వారిని గుర్తించడానికి తమ ప్రభుత్వం ఒడిశా ప్రభుత్వంతో టచ్‌లో ఉందని చెప్పారు.

రెండు హెల్ప్‌లైన్ నంబర్‌లను విడుదల చేసిన ఆమె, సహాయ కార్యకలాపాలను వేగవంతం చేయడానికి తమ ప్రభుత్వం తన వంతు కృషి చేస్తోందన్నారు.

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఐదుగురు సభ్యుల బృందాన్ని ప్రమాద స్థలానికి పంపింది. ఈ బృందం ఒడిశా ప్రభుత్వం, రైల్వేలతో సమన్వయం చేస్తుంది.

ఈ ఘటనపై ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నానని ఆమె తెలిపారు.

ఈ ప్రమాదం కారణంగా ఈ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేసినట్లు, మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు రైల్వే శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

బహనాగ బజార్ రైలు ప్రమాదానికి సంబంధించి హెల్ప్ లైన్ నంబర్లను దక్షిణ మధ్య రైల్వే ట్వీట్ ద్వారా ప్రకటించింది.

విజయవాడ స్టేషన్ హెల్ప్‌లైన్, రాజమండ్రి స్టేషన్ హెల్ప్‌ లైన్, రేణిగుంట స్టేషన్ హెల్ప్‌లైన్ నంబర్లను ప్రకటించింది.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)