You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘ఇరాన్ క్షిపణులను కూల్చేయడంలో ఇజ్రాయెల్‌కు సాయపడ్డాం’ - అమెరికా
- రచయిత, అలైస్ డేవిస్, టామ్ బేట్‌మన్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
ఇరాన్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు అవసరమైన సాయం చేస్తున్నామని అమెరికా వెల్లడించింది. ఇజ్రాయెల్ మీదకు వస్తున్న క్షిపణులను అడ్డుకోవడానికి డజన్ల కొద్దీ ఇంటర్‌సెప్టర్‌లను ప్రయోగించినట్లు పెంటగాన్ తెలిపింది.
ఇజ్రాయెల్‌కు తగు సాయం చేయాల్సిందిగా తాను సూచించానని అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. ఈ మేరకు అవసరమైన సాయాన్ని పెంటగాన్ అందించిందని ఆయన తెలిపారు.
జాతీయ భద్రతకు సంబంధించి సీరియస్ అంశాలను చర్చించే వైట్‌హౌస్‌లోని సిచ్యువేషన్ రూమ్‌లో తాను కొంతసేపు గడిపినట్లు బైడెన్ వెల్లడించారు.
ఇరాన్ దాదాపు 180 క్షిపణులను ప్రయోగించిందని, వాటిలో చాలా మిసైళ్లను అడ్డుకున్నామని ఇజ్రాయెల్ తెలిపింది.
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఈ దాడిని సమర్థించుకున్నారు.
"ఇరాన్ ప్రయోజనాలు, పౌరుల రక్షణ విషయంలో ఇది నిర్ణయాత్మకమైన ప్రతిస్పందన’’ అని పెజెష్కియాన్ వ్యాఖ్యానించారు.
గతంకన్నా తీవ్రమైన దాడులు..
ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడుల గురించి ప్రస్తావిస్తూ, తమ రెండు నేవీ డిస్ట్రాయర్‌లు ఇరాన్ నుంచి వస్తున్నవిగా భావిస్తున్న క్షిపణులపై ఇంటర్‌సెప్టర్లను ప్రయోగించాయని అమెరికా వెల్లడించింది. మేజర్ జనరల్ పాట్రిక్ రైడర్ ఈ విషయాలను చెప్పారు.
అయితే, ఇరాన్ క్షిపణుల్లో వేటినైనా అడ్డుకోగలిగారా లేదా అన్నది మాత్రం ఆయన ధ్రువీకరించలేదు. దీనిని ఇంకా నిర్ధరించాల్సి ఉందని మాత్రం ఆయన తెలిపారు.
ఇజ్రాయెల్ వెల్లడించిన సమాచారం ప్రకారం, ఈసారి ఇరాన్ సుమారు 180 మిసైళ్లను ప్రయోగించింది. ఏప్రిల్‌లో 110 బాలిస్టిక్ క్షిపణులను, 30 క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది ఇరాన్. దీనినిబట్టి చూస్తే గతంకంటే ఈ దాడి తీవ్రంగానే ఉంది.
ఈ దాడికి సంబంధించి పెంటగాన్‌కు ఎలాంటి హెచ్చరికలు అందలేదని మేజర్ జనరల్ రైడర్ తెలిపారు.
ఇజ్రాయెల్‌కు అమెరికా పూర్తిగా మద్దతిస్తుందని అధ్యక్షుడు బైడెన్ అన్నారు.
"నా సూచన మేరకు అమెరికా స్టేట్ మిలిటరీ ఇజ్రాయెల్ రక్షణకు అవసరమైన సహకారం అందించింది. మేం ఈ దాడుల తీవ్రతను అంచనా వేస్తున్నాం’’ అని బైడెన్ అన్నారు.
‘‘మాకు అర్ధమైనంత వరకు ఇరాన్ చేసిన ఈ దాడులు విఫలమయ్యాయి. వాటి ప్రభావం ఏమంత లేదు. ఇది ఇజ్రాయెల్, అమెరికా సైనిక సామర్థ్యానికి పరీక్ష’’ అని బైడెన్ అన్నారు.
ఇరాన్ పట్ల మీరు ఎలా వ్యవహరించబోతున్నారని విలేఖరులు అడిగిన ప్రశ్నకు.. ‘‘ప్రస్తుతం మేం దీనిపై సీరియస్‌గా చర్చిస్తున్నాం. ఏం జరుగుతుందో చూడాలి’’ అని బైడెన్ అన్నారు.
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడతానని బైడెన్ చెప్పారు. తాజా పరిస్థితులపై చర్చించి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటామన్నారు.
అంతకుముందు, వైట్‌హౌస్ జాతీయ భద్రత విభాగం ప్రతినిధి జేక్ సలివాన్ ఈ దాడిని ‘చాలా తీవ్రమైన విషయం’గా అభివర్ణించారు.
‘ఈ దాడికి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మేం చెప్పదలుచుకున్నాం. ఈ విషయంలో మేం ఇజ్రాయెల్‌తో కలిసి పని చేస్తున్నాం’’ అని మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. అయితే, ఆ పరిణామాలు ఏంటో మాత్రం సలివాన్ చెప్పలేదు.
అయితే, ఏప్రిల్‌లో జరిగిన దాడుల సమయంలో మాదిరిగా, ఇజ్రాయెల్‌ను సంయమనం పాటించాల్సిందిగా కోరే ఉద్దేశంలో అమెరికా కనిపించలేదు.
ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించడానికి అమెరికా గతంలో ప్రతిఘటన, దౌత్యం-ఈ రెండు విధానాలను అనుసరించిందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అభిప్రాయపడ్డారు.
ఇప్పుడు కూడా అదే విధానాన్ని కొనసాగిస్తారా? అన్న బీబీసీ ప్రశ్నకు ఆయన ‘అవును’ అని సమాధానమిచ్చారు.
మరోవైపు, ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా సైన్యం ప్రత్యక్ష జోక్యాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని ఇరాన్ మిలిటరీ స్పష్టం చేసింది.
తమ అత్యున్నత నాయకుడిని, ఈ ప్రాంతంలోని ఇరాన్ మద్దతు ఉన్న మిలీషియా నాయకులను ఇజ్రాయెల్ చంపినందుకు ప్రతిస్పందనగా ఈ దాడులు చేసినట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ఒక ప్రకటనలో తెలిపింది.
గత వారాంతంలో లెబనాన్‌లో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా, ఐఆర్‌జీసీ కమాండర్ అబ్బాస్ నిల్ఫోరోషన్ హత్యలను ఈ ప్రకటనలతో ప్రస్తావించింది. అలాగే జులైలో తెహ్రాన్‌లో హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియే హత్యను కూడా ఈ ప్రకటనలో పేర్కొంది.
అయితే, హనియే హత్యలో తన ప్రమేయాన్ని ఇజ్రాయెల్ ధ్రువీకరించలేదు. కానీ, దీనికి ఇజ్రాయెలే కారణమని చాలామంది నమ్ముతున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)