సికింద్రాబాద్ అగ్నిప్రమాదం: గాయపడిన ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది... ఐసీయూలో ఒకరు

తెలంగాణలోని సికింద్రాబాద్‌లోని డెక్కన్ స్పోర్ట్స్ షాపింగ్ మాల్‌లో మంటలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు.

నల్లగుట్టలోని డెక్కన్ నిట్‌వేర్ స్పోర్ట్స్ షోరూంలో ఈ రోజు ఉదయం 11గంటలకు మంటలు చెలరేగాయి.

ప్రస్తుతం చుట్టుపక్కల ఉన్న నివాసాల నుంచి ప్రజలను బయటకు తరలించారు. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించిన ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.

గాయపడ్డ అగ్నిమాపక సిబ్బందిలో ఒకరు ప్రస్తుతం కిమ్స్‌లోని ఐసీయూలో ఉన్నారు.

డెక్కన్ బిల్డింగ్‌ చెలరేగిన మంటల ప్రభావం చుట్టుపక్కల భవనాల మీద పడింది. వేడికి అక్కడి ప్లాస్టిక్ ఫర్నీచర్ కరిగిపోవడం, పొగ చూరడం వంటివి చోటు చేసుకున్నాయి.

ప్రస్తుతం బిల్డింగ్ లోపలకు వెళ్లగలుగుతున్నామని, మంటలకు షార్ట్ సర్క్యూట్ కారణం కావొచ్చని అధికారులు చెబుతున్నారు. సెల్లార్ నుంచి మంటలు మొదలైనట్లు తెలుస్తోందని చెప్పారు.

ఆ బిల్డింగ్ నుంచి భారీగా పొగ బయటకు వస్తోంది. ఆ ప్రాంతంలో ఆకాశమంతా పొగ అలుముకుంది. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు ఆ వీధిలో రాకపోకలను నిలిపివేశారు.

ఆ ప్రాంతమంతా పొగ, వేడి అలుముకుంటున్నాయి.

‘భవనంలో స్టాక్ ఎక్కువగా ఉండటం వల్ల మంటలు భారీ స్థాయిలో వచ్చాయి. అందువల్లే తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. ఇద్దరు లోపల ఉన్నారనే అనుమానం ఉంది.

ప్లాస్టిక్ సరుకు ఎక్కువగా ఉంది. 80శాతం నియంత్రణలోకి వచ్చింది. మరొక రెండు మూడు గంటల్లో పరిస్థితి అదుపులోకి వస్తుంది’ అని తెలంగాణ హోంశాఖ మంత్రి ముహమ్మద్ అలీ తెలిపారు.

మరొకవైపు ఎలాంటి బిల్డంగ్ అయినా నాలుగు గంటల కంటే మంటలను తట్టుకోలేదని అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు. దాదాపుగా 5 గంటల నుంచి డెక్కన్ స్పోర్ట్స్ షాపింగ్ మాల్ భవనం కాలుతోంది.

‘అదొక కమర్షియల్ కాంప్లెక్స్. అందులో చాలా ఫ్యాబ్రిక్ మెటీరియల్ ఉంది. పోలీసులు, అగ్నిమాపకసిబ్బంది, జీహెచ్‌ఎంసీ అధికారులు, డిజాస్టర్ ఫోర్స్ అందరూ ఘటనా స్థలంలో ఉన్నారు’ అని వార్తా సంస్థ ఏఎన్‌ఐతో హైదరాబాద్ అడిషనల్ కమిషనర్ (శాంతి భద్రతలు) విక్రమ్ సింగ్ మాన్ తెలిపారు.

ప్రస్తుతం ఆ ప్రాంతం అగ్నిమాపక వాహనాలు, అంబులెన్సులతోపాటు పోలీసులు, డిజాస్టర్ ఫోర్స్ సిబ్బంది ఉన్నారు. చుట్టుపక్కల ఉండే భవనాలు, ఇళ్ల నుంచి ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు.

డెక్కన్ స్పోర్ట్స్ దుకాణంలో సులభంగా కాలిపోయే మెటీరియల్ ఉండటం వల్ల భారీగా మంటలు చెలరేగుతున్నాయని విక్రమ్ సింగ్ మాన్ అన్నారు. ముందస్తు జాగ్రత్తగా ప్రజలను ఖాళీ చేయించామని, 25 ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలంలో ఉన్నాయి అని ఆయన మీడియాతో అన్నారు.

షాపింగ్ మాల్ ఉన్న ప్రాంతంలో ఎండ ఎక్కువగా ఉండటం, గాలి వీచే దిశ తరచూ మారుతుండటం వల్ల మంటలను ఆపడం సవాలుగా మారుతోందని విక్రమ్ సింగ్ మాన్ తెలిపారు. త్వరలోనే మంటలు అదుపులోకి వస్తాయని వెల్లడించారు.

గంటలు గడుస్తున్నా మంటలు అదుపులోకి రాకపోవడానికి కారణం ఇదే అని తెలుస్తోంది.

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఆ ఘటనా స్థలాన్ని సందర్శించారు. బిల్డింగ్ లోపల ఇద్దరు చిక్కుకొని ఉండి ఉండొచ్చని, దాని మీద ఇంకా కచ్చితమైన సమాచారం లేదని ఆయన మీడియాతో అన్నారు.

మరొకవైపు భవనం చుట్టుపక్కలకు ఎవరినీ రాకుండా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చూస్తున్నారు. దూరంగా వెళ్లిపోవాలని హెచ్చరిస్తున్నారు. కవరేజీ కోసం వెళ్లిన మీడియా వాళ్లను కూడా దూరంగా వెళ్లాలని చెబుతున్నారు.