యెమెన్: రంజాన్ సందర్భంగా రాజధాని సనాలో తొక్కిసలాట... 78 మంది మృతి

    • రచయిత, జార్జ్ రైట్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

యెమెన్ రాజధాని సనాలోని ఒక స్కూల్లో బుధవారం రంజాన్ సందర్భంగా విరాళాలు అందిస్తున్న సమయంలో, తొక్కిసలాట జరిగి 78 మంది చనిపోయారు.

బాబ్-అల్-యెమెన్ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

విరాళాలు అందుకోవడానికి వందలాది జనం స్కూలు ప్రాంగణంలో గుమికూడారని, ఒక్కొక్కరికీ సుమారు రూ. 700 విరాళం అందించారని రాయిటర్స్ తెలిపింది.

యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదారులు 2015లో ప్రభుత్వాన్ని కూలగొట్టి, అధికారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

విరాళాల పంపిణీకి బాధ్యులైనవారిని అదుపులోకి తీసుకున్నామని, విచారణ జరుగుతోందని అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. 13 మంది పరిస్థితి విషమంగా ఉందని సనాలో ఆరోగ్య అధికారి ఒకరు చెప్పారు.

జనాన్ని అదుపు చేయడానికి హౌతీ మిలిటెంట్లు గాల్లో కాల్పులు జరిపారని, అవి ఒక విద్యుత్ తీగకు తగిలి పేలుడు సంభవించిందని, దాంతో భయాందోళనలకు గురైన జనం అటూ ఇటూ పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగిందని అసోసియేటెడ్ ప్రెస్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

ఇవి రంజాన్ మాసం చివరి రోజులు. ఈ సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.

2015లో హౌతీ తిరుగుబాటుదారులు యెమెన్ ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు తీవ్ర ఘర్షణలు జరిగాయి.

అధ్యక్షుడు అబ్ద్రబ్బుహ్ మన్సూర్ హదీ విదేశాలకు పారిపోయారు. పరిస్థితిని చక్కదిద్దడానికి అరబ్ దేశాల కూటమి జోక్యం చేసుకున్నప్పటికీ, హౌతీల హవా కొనసాగుతోంది.

ఈ ఘర్షణల్లో 1,50,000 కంటే ఎక్కువ మంది మరణించారు. 2.3 కోట్ల మంది సహాయం అర్థించే పరిస్థితుల్లో ఉన్నారు.

గత వారం యెమెన్‌లో రెండు పోరాట సమూహాల మధ్య ఖైదీల మార్పిడి జరిగింది. ఎనిమిదేళ్ల అంతర్గత ఘర్షణల ముగింపుకు నాందిగా దీన్ని చూస్తున్నారు.

బుధవారం నాటి తొక్కిసలాటకు దేశంలోని మానవతా సంక్షోభమే కారణమని హౌతీ సుప్రీం ఎవల్యూషనరీ కమిటీ హెడ్ మొహమ్మద్ అలీ అల్-హౌతీ ఆరోపించారు.

"జరిగిన ఘటనకు దురాక్రమణకు కారణమైన దేశాలే బాధ్యత వహించాలి. యెమెన్ ప్రజలు చీకటిలో, దిగ్బంధనంలో మగ్గిపోతున్నారన్నది చేదు వాస్తవం" అన్నారు.

ఇవి కూడా చదవండి: