You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
డీకే శివకుమార్: కర్ణాటక ముఖ్యమంత్రి రేసులో ఉన్న ఈ కాంగ్రెస్ నేతను ‘ట్రబుల్ షూటర్’ అని ఎందుకంటారు?
‘‘ట్రబుల్ షూటర్’’...
కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు దొడ్డలహళ్లి కెంపెగౌడ శివకుమార్ అలియాస్ డీకే శివకుమార్‌కు రాజకీయవర్గాల్లో ఉన్న పేరు అది.
ప్రస్తుతం ఆయన కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి గట్టిగా ప్రయత్నిస్తున్న నేత. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి శాయాశక్తులా కృషి చేశారని, ఆయనకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని శివకుమార్ అనుచరులు వాదిస్తున్నారు.
మరోవైపు, ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇవ్వాలనే విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే మరొక సీఎం అభ్యర్ధి సిద్ధరామయ్య సోమవారమే దిల్లీ చేరుకున్నారు.
ఆరోగ్య సమస్యల కారణంగా శివకుమార్ ఒక రోజు ఆలస్యంగా దిల్లీ బయలుదేరారు. ముఖ్యమంత్రి పదవి విషయంలో అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తానని ఆయన అన్నారు.
బలమైన సామాజిక వర్గం
డీకే శివకుమార్ ‘ఒక్కలిగ’ సామాజికవర్గానికి చెందిన వారు. కర్ణాటకలో ‘లింగాయతుల’ తరువాత బలమైన సామాజికవర్గం ఒక్కలిగులే. వ్యవసాయం వీరి ప్రధానవృత్తి.
1989 నుంచి ఇప్పటి వరకు ఆయన 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సాతనూరు నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు, కనకపుర నుంచి నాలుగు సార్లు ఆయన గెలిచారు. 1999 ఎన్నికల్లో జేడీ(ఎస్) పార్టీ నేత హెచ్‌డీ కుమారస్వామిని ఆయన ఓడించారు.
ఆయన అనేక మంత్రి పదవులు కూడా నిర్వహించారు. 2013-18 మధ్య సిద్ధరామయ్య ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ తరువాత 2018-23 మధ్య జేడీ(ఎస్)-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేశారు.
2020 నుంచి కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు.
1962లో కనకపురలో జన్మించిన డీకే శివకుమార్, కాంగ్రెస్ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్‌ఎస్‌యూఐ)లో చేరడం ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1989లో 27 ఏళ్ల వయసులో తొలిసారి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు.
కర్ణాటక స్టేట్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఆయన పొలిటికల్ సైన్స్‌లో ఎంఏ చేశారు.
కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, చిక్కుల్లో పడినప్పుడు డీకే శివకుమార్ ఆదుకుంటారనే పేరు ఉంది. 2002లో మహారాష్ట్రలోని విలాస్ రావ్ దేశ్‌ముఖ్ ప్రభుత్వం, డీకే శివకుమార్ సాయంతోనే అవిశ్వాస తీర్మానం వీగిపోయేలా చేయగలిగారని చెబుతారు.
నాడు సుమారు 40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరుకు తరలించి అవిశ్వాస తీర్మానంలో ఎన్నిక జరిగే రోజు వరకు రిసార్ట్స్‌లో ఉంచారు డీకే శివకుమార్.
ఇక 2017లో గుజరాత్ నుంచి అహ్మద్ పటేల్ రాజ్యసభకు ఎన్నిక కావడంలోనూ డీకే శివకుమార్ పాత్ర ఉందని వార్తలు వచ్చాయి. బీజేపీ వైపు వెళ్లకుండా అడ్డుకునేందుకు సుమారు 41 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరు శివారులోని రిసార్టులో ఉంచారు. ఇదంతా డీకే శివకుమార్ పర్యవేక్షణలోనే జరిగినట్లు కథనాలు వచ్చాయి.
కాంగ్రెస్ పార్టీకి విధేయునిగా ఉంటారనే పేరు కూడా డీకే శివకుమార్‌కు ఉంది. తొలి నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీతోనే ఉంటూ వస్తున్నారు.
మనీలాండరింగ్ కేసు
డీకే శివకుమార్ మీద అవినీతి ఆరోపణలు, మనీలాండరింగ్ కేసులున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో సీబీఐ విచారణ చేపట్టింది. రూ.34 కోట్ల పన్నులు ఎగవేసినట్లు డీకే శివకుమార్ మీద 2017లో ఆరోపణలు వచ్చాయి.
2019 సెప్టెంబరులో మనీలాండరింగ్ కేసులో ఈడీ ఆయనను అరెస్టు చేసింది. సుమారు నెల తరువాత ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు.
కర్ణాటక ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో రూ.1,400 కోట్ల ఆస్తులను డీకే శివకుమార్ ప్రకటించారు. 2018లో ఆయన ఆస్తుల విలువ రూ.840 కోట్లుగా ఉంది.
రియల్ ఎస్టేట్, షేర్ల్ మార్కెట్‌లో పెట్టుబడులు, లీజులు, వ్యవసాయం వంటి మార్గాల ద్వారా ఆదాయం వస్తున్నట్లు అఫిడవిట్‌లో ఆయన పేర్కొన్నారు.
మళ్లీ ఎన్నికల రాజకీయాలలో ఉండను అంటూ ప్రకటన చేసిన సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారు.
డీకే శివకుమార్, సిద్ధరామయ్యల మధ్య సీఎం పదవి విషయంలో తీవ్రమైన పోటీ నెలకొన్న ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్ హైకమాండ్ ఎవరిని నిర్ణయిస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చూడండి:
- కర్ణాటక: ఈ 10 ఆసక్తికర అంశాలు మీకు తెలుసా?
- బజరంగ్ దళ్‌ను పీవీ నరసింహారావు ప్రభుత్వం ఎందుకు నిషేధించింది? దీని చరిత్ర ఏమిటి?
- ఇంటి పెద్ద మరణిస్తే రూ.20 వేలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వ పథకం గురించి మీకు తెలుసా?
- ఆంధ్రప్రదేశ్: బూతులు తిడుతూ చేసుకునే జాతర ఇది
- పోఖ్రాన్ II: అమెరికా కళ్లుగప్పి వాజ్‌పేయి అణు పరీక్షలు ఎలా నిర్వహించారు?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)