You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
యూపీఐ పేమెంట్స్: ఎంత సులభమో, అంత మోసం కూడా, స్కామ్‌లు ఎందుకు పెరుగుతున్నాయంటే....
- రచయిత, ప్రీతి గుప్తా
- హోదా, టెక్నాలజీ రిపోర్టర్
ముంబయిలోని రద్దీగా ఉండే వీధిలో గత ఏడేళ్ళుగా ప్రతిరోజూ అరుణ్ కుమార్ తన పండ్ల దుకాణాన్ని నడుపుతున్నారు. ఇక్కడ జీవనోపాధి అంత సులభం కాదంటారు ఆయన.
“వీధి వ్యాపారం చాలా కష్టమైనపని. దొంగల భయం ఎక్కువ. నా దగ్గర లైసెన్స్ కూడా లేదు. అధికారులు ఎప్పుడైనా వచ్చి నా దుకాణాన్ని ఎత్తివేసే ప్రమాదం ఉంది." అని ఆయన అన్నారు.
అయితే గత నాలుగేళ్లుగా ఆయనకు ఒక విషయం సానుకూలంగా మారింది.
కోవిడ్‌కి ముందు పండ్లు కొనుకునే వారిలో చాలామంది డబ్బులు చేతికిచ్చేవారు. కానీ, ఇప్పుడు ఎక్కువమంది యూపీఐ ద్వారానే పేమెంట్ చేస్తున్నారు. స్కాన్ చేయగానే సెకన్లలో ఆయన అకౌంట్‌లో డబ్బులు పడిపోతున్నాయి.
"కస్టమర్లకు చిల్లర ఇచ్చే విషయంలో ఇబ్బందిపడాల్సిన అవసరం లేదు. ఇది నా వ్యాపారం సాఫీగా సాగేలా చేస్తోంది." అని ఆయన అన్నారు.
యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) చెల్లింపు విధానం 2016లో ప్రారంభమైంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దేశీయ బ్యాంకింగ్ పరిశ్రమ సంయుక్తంగా భాగస్వామ్యంతో ప్రారంభమైంది.
యూపీఐ అనేది యాప్ ఆధారంగా తక్షణం చెల్లింపులు చేసే వ్యవస్థ. ఎవరికైనా డబ్బు పంపడం, స్వీకరించడం దీనితో చేసేయచ్చు.
వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ వివరాలు ఏమీ ఇవ్వాల్సిన పని లేకుండానే బిల్లులు, చెల్లింపులను చిటికెలో చెయ్యవచ్చు. పైగా ఇది పూర్తిగా ఉచితంగా లభించే సర్వీసు.
భారతదేశంలో ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ వ్యవస్థ జోరుగా నడుస్తోంది. కోవిడ్ తర్వాత బాగా పాపులర్ అయ్యింది.
గత ఏడాది రూ.900 కోట్ల విలువైన లావాదేవీలు జరిపిన యూపీఐ, ఈ ఏడాది మే నాటికి రూ.1400 కోట్ల లావాదేవీలను నిర్వహించగలిగింది. కానీ, ఇంత పాపులర్ కావడం మోసగాళ్లకు కూడా వరంగా మారుతోంది.
‘‘డిజిటల్ పేమెంట్లు సులభమే. కానీ, దీని వెనక సమస్యలు కూడా పొంచి ఉంటాయి.’’ అని దిల్లీకి చెందిన ఫ్యూచర్ క్రైమ్ రీసెర్చ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శశాంక్ శేఖర్ అన్నారు.
మోసగాళ్లు ప్రజలను మభ్యపెట్టి, డబ్బులు కొట్టేయడానికి అనేక మార్గాలను ఉపయోగిస్తారని శేఖర్ చెప్పారు. అందులో ముఖ్యమైనది పిన్ నంబర్ చెప్పమని అడగటం.
కొంతమంది స్కామర్లు నకిలీ యూపీఐ యాప్‌లను కూడా సృష్టించారు. అవి అచ్చుగుద్దినట్టు అసలైన బ్యాంకింగ్ యాప్స్‌లాగే ఉంటాయి. వాటి ద్వారా లాగిన్ వివరాలు, ఇతర విలువైన సమాచారాన్ని దొంగిలిస్తారు.
“దేశంలో డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ వేగంగా జరిగినప్పటికీ, అంతేవేగంగా దానిని సురక్షితంగా వాడే నైపుణ్యం, విజ్ఞానం అభివృద్ధి చెందలేదు." అని శేఖర్ అన్నారు.
జనవరి 2020, జూన్ 2023 మధ్య మొత్తం ఆర్థిక మోసాలలో దాదాపు సగం మోసాలు యూపీఐ వ్యవస్థను ఉపయోగించడం ద్వారా జరిగాయని శేఖర్ చెప్పారు.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఏప్రిల్‌తో ముగిసిన 2023 ఆర్థిక సంవత్సరంలో యూపీఐ మోసాలకు సంబంధించిన 95,000 కంటే ఎక్కువ కేసులు, అంతకుముందు సంవత్సరంలో 77,000 కేసులు నమోదయ్యాయి.
‘‘తేలికగా నమ్మిస్తారు’’
యూపీఐ బాధితుల్లో శివ్‌కాళీ ఒకరు. ఆమె ఎప్పటినుంచో స్కూటీ కొనుక్కోవాలనుకున్నారు. కానీ ధర ఆమె బడ్జెట్‌కి మించి ఉంది.
ఈ ఏడాది మొదట్లో ఫేస్‌బుక్‌లో అమ్మకానికి పెట్టిన ఒక స్కూటీని చూశారామె.
"నేనేమీ ఆలోచించకుండా ఆ స్కూటీని కొనేద్దాం అనుకున్నా. కొన్ని క్లిక్‌ల తర్వాత యజమానితో మాట్లాడా. 1920 రూపాయలు పంపిస్తే వాహన పత్రాలను పంపిస్తానని ఆయన అన్నారు.’’అని శివ్‌కాళీ చెప్పారు.
అంతా సజావుగా ఉందనుకొని శివ్‌కాళీ యూపీఐ ద్వారా యజమానికి డబ్బు పంపించడం మొదలు పెట్టారు. అలా దాదాపు రూ.16,800 వరకూ పంపించారు. కానీ ఆ స్కూటీ డెలివరీ కాలేదు. తాను మోసపోయానని ఆమెకు అర్ధమైంది.
"నేను మోసపోతానని అనుకోలేదు. చదువుకున్నాను. ప్రపంచంలో ఏం జరుగుతుందో నాకు తెలుసు. కానీ స్కామర్లు చాలా తెలివైనవారు. ఎదుటి వ్యక్తిని ఏమార్చేలా మాట్లాడే కళ వారికి ఉంది.” అని ఆమె అన్నారు.
యూపీఐ యూజర్లను మోసగాళ్ల బారి నుంచి రక్షించడానికి ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గాలను అన్వేషిస్తున్నాయి.
అయితే ప్రస్తుతానికి బాధితులు పరిహారం కావాలనుకుంటే తమ బ్యాంకును మాత్రమే అడగాల్సి ఉంటుంది.
"ఈ సమస్య చాలా లోతుగా పాతుకుపోయింది." అని ఆర్థిక నేరాల నిపుణుడు డాక్టర్ దుర్గేష్ పాండే చెప్పారు.
‘‘బ్యాంకులు, టెలికం కంపెనీలపై ఎక్కువ బాధ్యత ఉంది. గుర్తింపు తనిఖీలు చేయడంలో ఈ కంపెనీలు అలసత్వం వహిస్తున్నాయి. అందుకే మోసగాళ్లను కనుక్కోలేకపోతున్నారు.’’ అని ఆయన అన్నారు.
అయితే, ఇటువంటి మోసాలకి సంబంధించి కేవలం బ్యాంక్‌ని మాత్రమే నిందించలేమని డాక్టర్ పాండే తెలిపారు.
"బ్యాంకులకు సంబంధించి ఇది సంక్లిష్టమైన సమస్యే . కానీ చాలా సందర్భాలలో తన వివరాలన్నీ ఇచ్చేది బాధితుడే. బాధితులు, బ్యాంక్ సమాన నష్టాన్ని భరించాలని నేను అంటాను” అని పాండే అభిప్రాయపడ్డారు.
విదేశాలకూ యూపీఐ
సమస్యలు ఉన్నప్పటికీ, బ్యాంకింగ్ సేవలను పొందడం కష్టంగా ఉండే గ్రామీణ ప్రాంతాలకు కూడా యూపీఐ చెల్లింపులు విస్తరిస్తున్నాయి.
రాజస్థాన్‌కు చెందిన పూనమ్ ఇంటర్నెట్, డిజిటల్ బ్యాంకింగ్‌ను ఉపయోగించడంలో ప్రజలకు సహాయపడే గైడెన్స్ సెంటర్‌ని నడుపుతున్నారు.
"చాలామంది చదువుకోలేదు. వారికి స్మార్ట్ ఫోన్ వాడడం తెలియదు. ఫోన్ అంటే మాట్లాడే పరికరం మాత్రమే కాదని, బ్యాంక్ పనులు కూడా చిటికెలో చేయవచ్చని నేను వారికి నేర్పిస్తున్నాను." అని ఆమె చెప్పారు.
స్థానిక ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి యూపీఐ సహాయపడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
"నాలాంటి చాలామంది మహిళలకు ఇంటి నుంచి చేసే చిన్నచిన్న వ్యాపారాలు ఉన్నాయి. మేము యూపీఐ ద్వారా డబ్బులు తీసుకోవచ్చు, పంపించవచ్చు. స్మార్ట్ ఫోన్‌లు లేనివారు పేమెంట్ల కోసం మా సెంటర్‌కి వస్తారు." అని ఆమె చెప్పారు.
గ్రామీణ ప్రాంతాలతో పాటు యూపీఐ ఓవర్సీస్‌లోనూ విస్తరిస్తోంది.
భూటాన్, మారిషస్, నేపాల్, సింగపూర్, శ్రీలంక, యూఏఈ లోని రిటైలర్లు యూపీఐ చెల్లింపులను అంగీకరిస్తారు.
ఈ ఏడాది ఈఫిల్ టవర్‌కి టిక్కెట్ కొనుగోలుకు యూపీఐ చెల్లింపులను ఆమోదించిన మొదటి యూరోపియన్ దేశంగా ఫ్రాన్స్ నిలిచింది.
మళ్ళీ ముంబయికి వస్తే...కుమార్ ఇకపై నగదు ఉపయోగించాల్సిన అవసరం లేదని సంతోషంగా ఉన్నారు. అలాగే జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
కాకపోతే మంచి ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోతే, వినియోగదారులు పొరపాటున డబ్బు చెల్లించకుండా వెళ్ళే ప్రమాదం ఉంది.
"నాలాంటి చిన్నవ్యాపారులకు డబ్బును చేర్చడంలో యూపీఐ బాగా సహాయకారిగా ఉంది. కానీ ఎవరైనా మోసం చేస్తారని ఎప్పుడూ భయపడుతూనే ఉంటాను. యూపీఐ మోసాలు ఎలా పెరుగుతున్నాయో నేను వార్తల్లో చూస్తూనే ఉన్నా. నాలాంటి చిన్న వ్యాపారులు నష్టపోకుండా ఏదైనా పరిష్కారం కనుక్కుంటారని అనుకుంటున్నా.” అని కుమార్ అన్నారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)