You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
దిల్లీలో తీవ్ర స్థాయికి వాయు కాలుష్యం.. పాఠశాలలు బంద్
దిల్లీలో వాయు కాలుష్యం తీవ్రమవుతోంది. దీంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. దిల్లీలోని అన్ని ప్రాథమిక పాఠశాలలకు రెండు రోజులు సెలవులు ప్రకటించారు.
ఈ సీజన్‌లో గురువారం నగరంలో గాలి నాణ్యత మరీ తీవ్ర స్థాయికి పడిపోయింది. మరో రెండు వారాల్లో ఇది ఇంకా దిగజారుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పరిస్థితిని సమీక్షించేందుకు దిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల్లో దిల్లీ ఒకటి. పంట వ్యర్థాలను రైతులు తగులబెట్టడం, తక్కువ గాలి వేగం, పండగల సమయంలో టపాకాయలు పేల్చడం లాంటి కారణాల వల్ల శీతాకాలంలో దిల్లీ గాలి విషపూరితంగా మారుతోంది.
పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హరియాణాల్లో పంట వ్యర్థాలు తగులబెట్టడం పెరిగినప్పుడు నవంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు దిల్లీలో వాయు కాలుష్యం గరిష్ఠ స్థాయికి చేరుకుంటోందని దిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ అధ్యయనాలు తెలిపాయి.
అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దు
ప్రభుత్వ గణాంకాల ప్రకారం గురువారం సాయంత్రం పీఎం 2.5 స్థాయి దిల్లీ, దాని శివార్లలోని అనేక ప్రాంతాల్లో సురక్షిత పరిమితి (క్యూబిక్ మీటర్‌కు 60 మైక్రోగ్రాముల)ని దాటి ఏడెనిమిది రెట్లు పెరిగిపోయింది.
దీంతో ముందుజాగ్రత్త చర్యగా నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాథమిక పాఠశాలలకు రెండు రోజులు సెలవు ప్రకటించారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.
నగరంలో అనవసరమైన నిర్మాణ పనులను వెంటనే నిషేధించాలని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ ప్యానెల్ ఆదేశించింది.
కార్ల వంటి వ్యక్తిగత వాహనాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు, దిల్లీ మెట్రో, ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు సహా అన్ని ప్రజా రవాణా సేవల ఫ్రీక్వెన్సీని పెంచాలని ఆదేశించారు.
నగరంలో బాణాసంచా తయారీ, అమ్మకం, వినియోగంపై గత నెలలో నిషేధం విధించింది దిల్లీ ప్రభుత్వం. గత మూడేళ్లుగా ఈ విధానం అమల్లో ఉంది.
కలుషితమైన గాలి ఏటా దిల్లీ వాసులకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తోంది.
అధ్వానమైన గాలి వల్ల పిల్లలు, వృద్ధులలో ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యల కేసులు పెరుగుతున్నట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇరిటేటివ్ బ్రాంకైటిస్ ఇన్ఫెక్షన్ల సంఖ్య పెరుగుతోందని దిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో మెడిసిన్ విభాగం అధిపతి జుగల్ కిషోర్ పీటీఐ వార్తా సంస్థతో అన్నారు.
శ్వాసకోశ సమస్యలతో బాధపడే వారు అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లవద్దని ఆయన సూచించారు.
ఇవి కూడా చదవండి
- ఎలక్షన్ కోడ్: రూ.50 వేలకు మించి తీసుకెళ్లలేకపోతున్నారా? సీజ్ చేసిన డబ్బు తిరిగి పొందడం ఎలా?
- మొహమ్మద్ షమీ: మా బౌలింగ్ తుపానుకు కారణమదే
- అఫ్గానిస్తాన్: అంతర్యుద్ధం, పేదరికంతో అల్లాడుతున్న తాలిబాన్ల పాలనలో క్రికెట్ ఎలా వికసించింది?
- చిత్తూరు: భార్యతో ఉన్నప్పుడు పురుషుడు.. బాయ్‌ఫ్రెండ్‌ను కలిస్తే మహిళ
- ఐఫోన్ హ్యాకింగ్ ఆరోపణలు: యాపిల్ వివరణపై కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఏమన్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)