You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
యూఎస్ కాంగ్రెస్ జాయింట్ సెషన్: 'భారత్ నుంచి అమెరికాకు దిగుమతయ్యే ఉత్పత్తులపై పన్నులు పెంచుతాం'..స్పష్టం చేసిన ట్రంప్
భారత్ సహా మరికొన్ని దేశాలపై ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార పన్నుల్ని విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చెప్పారు. అమెరికన్ కాంగ్రెస్ (పార్లమెంట్) జాయింట్ సెషన్‌లో ఆయన ప్రసంగించారు.
'చైనా, ఇండియా, బ్రెజిల్, మెక్సికో, కెనడాతో పాటు అనేక దేశాలు దిగుమతుల మీద మన కంటే ఎక్కువ పన్నులు విధిస్తున్నాయి" అని ట్రంప్ అన్నారు.
‘‘ఆటోమొబైల్ ఉత్పత్తులపై ఇండియా 100 శాతానికి పైగా పన్ను విధిస్తోంది’’ అని అన్నారు.
"ఆటోమొబైల్స్ ఉత్పత్తులపై చైనా మనతో పోలిస్తే రెండు రెట్లు, దక్షిణ కొరియా నాలుగు రెట్లు ఎక్కువ పన్ను వసూలు చేస్తున్నాయి. దక్షిణ కొరియాకు అమెరికా సైనిక, ఇతర వస్తువుల విషయంలో చాలా సాయం చేస్తోంది" అని ట్రంప్ తన ప్రసంగంలో ప్రస్తావించారు.
"అమెరికాతో సన్నిహితంగా ఉంటున్న వారితో పాటు అమెరికాను వ్యతిరేకిస్తున్న దేశాలు కూడా మన ఉత్పత్తుల మీద పన్నులు విధిస్తున్నాయి. ఇది సరైనది కాదు. అందుకే మేము ఏప్రిల్ 2 నుండి రెసిప్రోకల్ టాక్సెస్ (ప్రతిగా విధించే పన్నులు) విధిస్తున్నాం. అమెరికా ఉత్పత్తుల మీద వివిధ దేశాలు ఎంత మేరకు పన్నులు వసూలు చేస్తున్నాయో, మేము కూడా అలాగే చేస్తాం" అని ట్రంప్ చెప్పారు.
"వాస్తవానికి ఏప్రిల్ 1 నుంచి ఈ పన్నుల్ని అమల్లోకి తేవాలని అనుకున్నాం. అయితే ఆ రోజు ఏప్రిల్ ఫూల్ అనే నిందను భరించాల్సి ఉంటుంది. అందుకే ఏప్రిల్ 2ను ఎంచుకున్నాం" అని ట్రంప్ అన్నారు.
రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికన్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో దాదాపు రెండు గంటల పాటు ప్రసంగించిన ట్రంప్, టారిఫ్‌లతోపాటు అనేక అంశాలను ప్రస్తావించారు.
తాను వైట్‌హౌస్‌లోకి వచ్చిన ఆరు వారాల్లో సుడిగాలిలా పనులు చేస్తూ వస్తున్నానని అన్నారు.
యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియన్‌స్కీ నుంచి తనకు లేఖ అందిందని, అందులో ఆయన శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించినట్లు తెలిపారు.
'ఒకటి కాకపోతే మరొకటి' ఏదో ఒక మార్గంలో గ్రీన్‌ల్యాండ్ అమెరికాలో భాగం అవుతుంది’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
వివిధ సంస్థలకు నిధుల నిలిపివేత, వలస విధానంలో మార్పులు, సరిహద్దుల్ని కట్టడి చేయడంతోపాటు గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చాలన్న తన నిర్ణయాన్ని సాహసోపేతమైన చర్యలుగా అభివర్ణించుకున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా వివిధ స్వచ్ఛంద సంస్థలు చేపడుతున్న కార్యక్రమాలకు ఇస్తున్న నిధులను నిలిపివేస్తూ ఎలాన్ మస్క్ తీసుకున్న నిర్ణయాలను ట్రంప్ ప్రశంసించారు. ఈ సంస్థలన్నీ మోసపూరితమైనవని అన్నారు.
డెమోక్రాట్ల నినాదాలు
అమెరికన్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ట్రంప్ ప్రసంగిస్తున్నప్పుడు రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మధ్య ఉద్రిక్త వాతావరణం కనిపించింది.
ఎన్నికల్లో తన గెలుపు గురించి గొప్పగా చెప్పుకున్న డోనల్డ్ ట్రంప్, డెమోక్రాట్లపై విమర్శలు చేశారు. ట్రంప్ వ్యాఖ్యలపై డెమోక్రాట్లు నిరసన తెలిపారు.
దీంతో ట్రంప్ తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపాల్సి వచ్చింది. ప్రసంగాన్ని ఆటంకపరుస్తూ కేకలు పెడుతున్న సెనేటర్ అల్ గ్రీన్‌ను బయటకు పంపించాలని స్పీకర్ ఆదేశించారు.
సభ నుంచి గ్రీన్ వెళ్లిపోయిన తర్వాత ట్రంప్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.
హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్ సభలో డెమోక్రాట్ సభ్యులు తమ టీ షర్టులు, కోటు మీద రెసిస్ట్ అనే పదం రాసుకుని కనిపించారు. ట్రంప్ ప్రసంగాన్ని బహిష్కరిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.
యుక్రెయిన్‌పై ఎలాంటి స్పష్టత ఇవ్వని ట్రంప్
ట్రంప్ ప్రసంగంలో యుక్రేనియన్లకు ఎలాంటి సమాధానాలు లేవని యుక్రెయిన్ బీబీసీ ప్రతినిధి జహన్నా బెజ్‌పియాచుక్ అన్నారు.
ట్రంప్ ప్రతిపాదిస్తున్న శాంతి గురించిగానీ, యుక్రెయిన్‌కు భద్రత హమీల గురించి కానీ, సైనిక సాయాన్ని పునరుద్ధరించే విషయంలో ఎలాంటి స్పష్టమైన ప్రతిపాదనలు లేవని తాను భావిస్తున్నట్లు ఆమె చెప్పారు.
"ఇది యుక్రెయిన్‌కు చాలా కఠినమైన సమయం" అని ఆమె అన్నారు.
ట్రంప్ ప్రసంగం ప్రారంభించగానే డెమోక్రాట్ సభ్యుడు అల్ గ్రీన్ నిలబడ్డారు.
"ప్రజల్లో భయాన్ని పెంచేలా తొలి రోజే వంద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు, 400 అడ్మినిస్ట్రేటివ్ నిర్ణయాలు తీసుకున్నారు" అని ఆయన గట్టిగా కేకలు వేశారు.
అయితే ట్రంప్ తాను రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి రోజును అమెరికా అధ్యక్షుల చరిత్రలో అత్యంత విజయవంతమైన రోజుగా అభివర్ణించారు.
పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే దక్షిణ సరిహద్దులో అత్యవసర పరిస్థితిని ప్రకటించానని, నెల రోజుల్లోనే అక్రమ వలసలు తక్కువ స్థాయికి చేరుకున్నాయని ట్రంప్ చెప్పారు.
తాను అందరితో కలిసి పని చేయాలని భావిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)