You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘నాన్నా కాపాడు’.. అంటూ కొండ చరియల బురదలో కూరుకున్న ఇంటి నుంచి కేకలు
- రచయిత, మురళీధరన్ కాశీ విశ్వనాథన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
శ్రీలంకలోని బదుల్లా జిల్లాలో ఇటీవల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో చాలామంది మరణించారు. అయితే ఒక ఊరిలో చాతీ లోతు బురదలో కూరుకుపోయిన స్థానికులను కొందరు యువకులు ధైర్యసాహసాలతో రక్షించారు.
శ్రీలంకలో ఉవా ప్రావిన్స్‌లోని బదుల్లా జిల్లాలో గల బందరవేల పట్టణానికి కొద్ది దూరంలో కవరకేల ప్రాంతం ఉంది. చుట్టూ తేయాకు తోటలున్న ఈ పర్వత ప్రాంతంలోనే కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో చిక్కుకున్న పలువురిని ఊరి జనం రక్షించారు.
కవరకేల నివాసితుల్లో చాలామంది తేయాకు తోటలో పనిచేస్తుంటారు. దిత్వా తుపాను ప్రభావంతో అక్కడ భారీ వర్షాలు కురిశాయి.
నవంబర్ 27న, ఉదయం వర్షం ప్రారంభమైంది, మధ్యాహ్నంకల్లా భారీ వర్షంగా మారింది. దీంతో, కవరకేల ప్రధాన రహదారి వెంబడి ఉన్న కొండ ప్రాంతాలు మెల్లగా కిందకి జారిపోవడం మొదలైంది.
దీంతో, అక్కడి ప్రజలను వాహనంలో బయటకు తీసుకెళ్లడానికి ఆ ప్రాంత యువకులు ప్రయత్నించారు. అయితే, జనం వాహనం ఎక్కేలోపు వర్షపు నీరు పెరిగి, వాహనం ముందుకు వెళ్లలేకపోయింది.
'తాళ్లను ఉపయోగించి..'
"రెండు వైపులా మట్టి జారి నీటిలో పడటం మొదలైంది. సమీపంలోని ఆలయంలో మరమ్మతుల పనులు జరుగుతుండటంతో, మేం అక్కడి సామగ్రి, తాళ్లను ఉపయోగించి ప్రజలను ఆవలివైపు పంపడం మొదలుపెట్టాం. ఆ సమయంలోనే కొండ నుంచి పెద్ద ఎత్తున మట్టి జారడం ప్రారంభమైంది" అని సహాయక చర్యలో పాల్గొన్న యువకులలో ఒకరైన ఆర్. గజేంద్రన్ అన్నారు.
కవరకేల ప్రధాన రహదారి మీదుగా వెళితే, అక్కడ ఒకదాని పక్కన మరొకటి ఇలా కొన్ని ఇళ్లు కనిపిస్తాయి. వర్షం పడుతున్న సమయంలోనే చాలామంది అక్కడి నుంచి వెళ్లిపోయినప్పటికీ, ఓ మూడు ఇళ్లలోనివారు మాత్రం బయటికి వెళ్లలేకపోయారు. ఆ ఇళ్లల్లో పిల్లలు కూడా ఉన్నారు.
ఒక ఇంట్లో సెల్వరాజ్, రేణుకా దేవి దంపతులు నివసిస్తుంటారు. వర్షం పడుతున్న రోజున, సెల్వరాజ్ ముగ్గురు మనవలు, మనవరాళ్లు ఇంట్లోనే ఉన్నారు.
పిల్లలకు అన్నం పెడుతుండగా, పెద్ద కొండచరియలు విరిగిపడి ఇల్లు బురద, నీటితో నిండిపోయిందని సెల్వరాజ్ గుర్తుచేసుకున్నారు.
"నాకేం చేయాలో అర్థం కాలేదు. పిల్లలను తీసుకుని తప్పించుకోవడానికి ప్రయత్నించాను. బయటకు వస్తుండగా, నా భార్య చీర కొంగు దేనిలోనో చిక్కుకుంది. నేనూ బురదలో చిక్కుకుపోయా" అని సెల్వరాజ్ చెప్పారు.
ఆ సమయంలో, పక్కింటి యువకుడు వచ్చి, పిల్లలను, సెల్వరాజ్ దంపతులను రక్షించారు. సెల్వరాజ్ కుటుంబం ప్రస్తుతం కవరకేలలోని ఒక శిబిరంలో ఉంది.
"ఇప్పుడు ఆ క్షణం గురించి ఆలోచిస్తే నా తల తిరిగిపోతుంది" అని సెల్వరాజ్ చెబుతున్నప్పుడు ఆయన చేతులు వణికాయి.
సెల్వరాజ్ మనవలు, మనవరాళ్లలో కూతురు తంగేశ్వరి బిడ్డ కూడా ఉంది.
వర్షం, వరదలు వచ్చినప్పుడు తంగేశ్వరి తన తండ్రి ఇంటికి పరిగెత్తారు. అక్కడికి వెళ్లాక, ఇంటితో పాటు తన బిడ్డ కూడా కొండచరియలు, బురద మధ్య చిక్కుకున్నట్లు ఆమె గ్రహించారు.
"నేను సగం దూరం వెళ్లేసరికి మా నాన్న ఉండే ఇంటి దగ్గర కొండచరియలు జారిపడుతుండడం చూశాను. అంతే, నా బిడ్డను కాపాడుకోలేనని భయపడ్డాను. ‘‘నా పిల్లలను మా నాన్న ఇంటికి పంపించాను. వాళ్లు భూమిలోకి కూరుకుపోయారు' అంటూ అరిచాను. కొద్దిసేపటికి, పక్కింటి యువకుడు వచ్చి బురదలోంచి మా వాళ్లను బయటకు తీసినట్లు నాకు చెప్పారు" అన్నారు తంగేశ్వరి.
ఆ సంఘటనను వివరిస్తూ ఆమె కన్నీళ్లను ఆపుకోలేకపోయారు.
సెల్వరాజ్ ఇంటి పక్కనే యోగం ఇల్లు కూడా ఉంది. ప్రమాద సమయంలో ఆ ఇంట్లో యోగం, ఇద్దరు పిల్లలు, అత్తగారు ఉన్నారు. వర్షపు నీటిని మళ్లించడానికి ఆమె భర్త బయటకు వెళ్లారు. కొండచరియలు విరిగిపడుతుండటంతో పిల్లలను ఎత్తుకొని ఆమె సమీపంలోని రోడ్డుపైకి వచ్చారు. అయితే, అత్తగారు ఇంటి లోపలే చిక్కుకున్నారు.
"ఏం చేయాలో తెలియలేదు. నేను అరుస్తూ పరిగెత్తాను. అప్పుడు కొంతమంది యువకులు పైనుంచి పరిగెత్తుకుంటూ వచ్చారు. మా అత్తగారిని రక్షించలేరని అనుకున్నాను. కానీ, అందరూ కలిసి వచ్చి ఆమెను రక్షించారు" అని యోగం చెప్పారు.
'పాప గొంతు విన్నా'
యోగం ఇంటి పక్కనే కమల్‌రాజ్ ఇల్లు ఉంది. ఆయన ఇంట్లోకి కూడా బురద, కొండ రాళ్లు చేరాయి. ఆ సమయంలో ఆయన పాప కూడా ఇంటోనే ఉంది. ఇంట్లోవారిని రక్షించడానికి కమల్‌రాజ్ వచ్చినప్పుడు, ఇల్లంతా బురద, శిథిలాలలో నిండిపోయి కనిపించింది. బురద దాదాపు చాతీలోతు వరకు వచ్చేసింది.
ఆ బురదలోనే ఇంట్లోకి వెళ్లగానే ‘‘రక్షించండి'’ అనే మా అమ్మాయి కేకలు విన్నా . కానీ, అక్కడ ఎవరూ కనిపించలేదు. పాప ఎక్కడుందో అర్థం కాలేదు. నేను మరికొంచెం లోపలికి వెళ్లగానే, 'నాన్నా నువ్వు ఇక్కడే ఉన్నావా?' అని పాప అడగడం వినిపించింది. దీంతో వాళ్లు ఎక్కడున్నారో అర్ధమైంది. అంతలోతు బురదలోనే మా అమ్మాయితోపాటు ఇంట్లోవారందరినీ బయటకు ఈడ్చుకొచ్చాను" అని కమల్‌రాజ్ గుర్తుచేసుకున్నారు.
"నేను ఇంట్లోకి వెళ్లేసరికి, 'నన్ను రక్షించు' అని వినిపించిన పాప గొంతు నాకు ధైర్యాన్ని ఇచ్చింది" అని కమల్‌రాజ్ అన్నారు.
కరగహవేలలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో అక్కడి ప్రజల ధైర్యసాహసాలు ప్రదర్శించడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. బాధితులను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. ఇళ్లు, వస్తువులను కోల్పోయిన వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)