గౌతమ్ గంభీర్: 'రోహిత్, విరాట్ కోహ్లీ వరల్డ్ క్లాస్ ఆటగాళ్లు.. ప్రపంచ కప్‌కు ఇంకా రెండేళ్ల సమయం ఉంది'.. టీమ్ ఇండియా కోచ్ మాటలను ఎలా అర్థం చేసుకోవాలి?

దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే క్రికెట్ సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో గెలుచుకుంది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ ఇంకా తనలో చాలా సామర్థ్యం ఉందని నిరూపించాడు.

రోహిత్ శర్మ ఆటతీరు కూడా అతని ఫిట్‌నెస్, వయసు గురించి వస్తున్న ప్రశ్నలకు సమాధానమిచ్చింది.

అయినప్పటికీ రెండేళ్లలో జరగనున్న 50 ఓవర్ల ప్రపంచ కప్ దృష్టిలో ఈ ప్రదర్శనలను అతిగా విశ్లేషించకూడదని ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డారు.

"వారు ప్రపంచ స్థాయి ఆటగాళ్లు. డ్రెస్సింగ్ రూమ్‌లో వారి అనుభవం చాలా ముఖ్యం. వారు చాలా కాలంగా ఆడుతున్నారు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఇది చాలా ముఖ్యమైనది. వారు దానిని కొనసాగిస్తారని ఆశిస్తున్నాను" అని మూడో వన్డేలో దక్షిణాఫ్రికాపై భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించిన తర్వాత గంభీర్ అన్నారు.

శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ వన్డే జట్టులోకి తిరిగి వచ్చినప్పటికీ, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్‌లకు సాధ్యమైన చోట అవకాశాలు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.

‘యువ ఆటగాళ్లు అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి’

2027 ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్ల (కోహ్లీ, రోహిత్) పరిస్థితి గురించి గంభీర్‌ను అడిగినప్పుడు "మొదట ఓ విషయం అర్థం చేసుకోవాలి. వన్డే ప్రపంచ కప్ ఇంకా రెండేళ్ల దూరంలో ఉంది. వర్తమానంలో ఉండటం ముఖ్యం. జట్టులోకి వచ్చే యువ ఆటగాళ్లు తమ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి" అని బదులిచ్చారు.

జట్టు అవసరాలకు అనుగుణంగా రుతురాజ్ గైక్వాడ్ తన బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చుకున్నాడని గంభీర్ అన్నారు.

"గైక్వాడ్ ఎప్పటిలాకాకుండా మరో స్థానంలో వచ్చి బ్యాటింగ్ చేశాడు. అతను నాణ్యమైన ఆటగాడు. ఇండియా ఎ తరపున ఆడుతున్నప్పుడు అతను అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు కాబట్టి మేం అతనికి ఈ అవకాశం ఇవ్వాలనుకున్నాం. ఒత్తిడిలో రెండు చేతులతో ఆ అవకాశాన్ని అతను అందిపుచ్చుకున్నాడు. అతను సాధించిన సెంచరీ నిజంగా ఉన్నత ప్రమాణాలతో కూడుకున్నది. యశస్వి కూడా. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్‌లో అతని నాణ్యత అందరికీ తెలుసు. ఇది అతని కెరీర్ ప్రారంభం. ప్రత్యేకించీ వైట్-బాల్ క్రికెట్‌లో. అతనికి, గైక్వాడ్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నాం" అని గంభీర్ చెప్పారు.

టెస్టు, టీ 20 క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా కోహ్లీ, రోహిత్ రాణిస్తున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఇద్దరూ మెరుగైన ఫామ్ సంకేతాలను చూపించారు. స్వదేశంలో ఆటతీరును ఎంపికకు షరతుగా చేసిన తర్వాత దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో ఇద్దరూ బలమైన ప్రదర్శనలతో స్పందించారు. కోహ్లీ రెండు సెంచరీలు చేయడంతోపాటు 45 బంతుల్లో 65 పరుగులతో అజేయంగా నిలవగా, రోహిత్ రెండు అర్ధ సెంచరీలు సాధించాడు.

రోహిత్, విరాట్ ప్రదర్శనపై చర్చ

దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ విజయం సాధించిన తర్వాత, ఇర్ఫాన్ పఠాన్ సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ గురించి రాశాడు. "విరాట్ కోహ్లీ ఒక లక్ష్యంతో వన్డే క్రికెట్‌లోకి వచ్చాడు. హై క్లాస్ బ్యాటింగ్" అని ప్రశంసించాడు.

ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లలో 151 సగటుతో బ్యాటింగ్ చేయడం ద్వారా విరాట్ కోహ్లీ తనపై వస్తున్న అన్ని ప్రశ్నలకు సమాధానమివ్వడమే కాకుండా 2027 వన్డే ప్రపంచ కప్‌పై తన ఉద్దేశాలను కూడా వ్యక్తం చేశాడు.

రోహిత్ శర్మ వరుసగా రెండో సిరీస్‌లో కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. సెలెక్టర్లు ఇప్పుడు తనను విస్మరించడం అంత సులభం కాదని చూపించాడు.

ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ ఓడిపోయిన తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మపై విమర్శలు వచ్చాయి. ఫిబ్రవరి-మార్చిలో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్ భారత విజయంలో కీలక పాత్ర పోషించారు.

కానీ ఇంగ్లాండ్ పర్యటనకు ముందు రోహిత్ శర్మ, ఆ తర్వాత విరాట్ కోహ్లీ రిటైర్మెంట్లు ప్రకటించారు. ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందు రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తొలగించారు.

అయితే, రోహిత్ శర్మ ఆస్ట్రేలియా సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకోవడం ద్వారా తన ఫామ్, ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు అర్ధ సెంచరీలు సాధించడం ద్వారా రోహిత్ శర్మ తన ఫామ్‌ను కొనసాగించాడు.

"రెండు,మూడేళ్లుగా నేనిలా ఆడలేకపోయా"

ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి, రెండు మ్యాచ్‌లలో పరుగులు చేయలేకపోయిన విరాట్ కోహ్లీకి ఈ సిరీస్ చాలా కీలకం.

ఈ సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లలో విరాట్ కోహ్లీ సెంచరీలు సాధించాడు. వన్డేల్లో తన సెంచరీల సంఖ్యను 53కి తీసుకెళ్లడం ద్వారా ఈ ఫార్మాట్‌లో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించాడు.

మూడో మ్యాచ్‌లో భారత్ ముందు 271 పరుగుల లక్ష్యం మాత్రమే ఉంది. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ అద్భుతమైన బ్యాటింగ్ కారణంగా సెంచరీ చేయడానికి విరాట్ కోహ్లీకి అవకాశం లభించలేదు. కానీ అతను 45 బంతుల్లో 65 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 12 సిక్సర్లతో 302 పరుగులు చేసిన తర్వాత, విరాట్ కోహ్లీ కూడా కొన్నేళ్లగా తన శైలిలో బ్యాటింగ్ చేయలేకపోయానని అంగీకరించాడు.

ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ టైటిల్ అందుకున్నప్పుడు సిరీస్‌లో తన అద్భుతమైన ప్రదర్శనపై సంతృప్తి అతని ముఖంలో కనిపించింది.

"నిజాయితీగా చెప్పాలంటే ఈ సిరీస్ నాకు చాలా సంతృప్తికరంగా ఉంది. నాకు చాలా ఉపశమనం కలుగుతోంది. రెండుమూడేళ్లగా నేనిలా ఆడలేకపోయాను" అని విరాట్ కోహ్లీ అన్నాడు.

"15-16 సంవత్సరాలు ఆడినప్పుడు, మన గురించి మనం సందేహించడం ప్రారంభిస్తాం. తప్పులు చేస్తాం. నేను ఇప్పటికీ జట్టు విజయానికి దోహదపడగలుగుతున్నందుకు సంతోషంగా ఉన్నాను. ఒత్తిడి లేకుండా ఆడినప్పుడు నేను సిక్సర్లు కొట్టగలను. మనం చేరుకోగల స్థాయి ఎప్పుడూ మన ముందు ఉంటుంది" అని కోహ్లీ వ్యాఖ్యానించాడు.

'సోషల్ మీడియాలో కోహ్లీపై ప్రశంసలు'

విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ కారణంగానే సిరీస్ ముగిసిన తర్వాత సోషల్ మీడియాలో అందరూ అతని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.

"దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్. సిరీస్ అంతటా అతనిలా బ్యాటింగ్‌ చేసిన వాళ్లు లేరు. అతను అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు" అని సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీని ప్రశంసిస్తూ నితీష్ యాదవ్ అనే యూజర్ పోస్టుచేశారు.

"విరాట్ కోహ్లీ ఈ సిరీస్‌లో 302 పరుగులు చేశాడు. అతను ఎంత అద్భుతమైన ప్రదర్శన చేశాడు? తన సెంచరీలతో జట్టు విజయంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు" అని హర్షిత్ అనే యూజర్ 'ఎక్స్' లో రాశారు.

'మా ఇద్దరి విషయంలో నేను సంతోషంగా ఉన్నా'

ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ ఒక్క సెంచరీ కూడా చేయనప్పటికీ, రెండు ప్రధాన మైలురాళ్లను సాధించాడు. వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు నమోదుచేసిన క్రికెటర్‌గా మాత్రమే కాకుండా, భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో 20,000 కంటే ఎక్కువ పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా కూడా నిలిచాడు.

"38 ఏళ్ల వయసులో రోహిత్ శర్మ అద్భుతమైన స్థిరత్వాన్ని కలిగి ఉన్నాడు. అతను పూర్తి నియంత్రణలో ఉన్నట్టు కనిపిస్తున్నాడు" అని ఇర్ఫాన్ పఠాన్ 'ఎక్స్'లో పోస్టు చేశాడు.

ఈ ఏడాది వన్డే క్రికెట్‌లో భారత్ తరఫున విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అత్యధిక పరుగులు చేశారు.

ఈ ఏడాది విరాట్ కోహ్లీ 13 ఇన్నింగ్స్‌ల్లో 651 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 14 ఇన్నింగ్స్‌ల్లో 650 పరుగులు చేశాడు.

" జట్టు కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలని నేననుకున్నాను. మేం చాలా సంవత్సరాలుగా జట్టు కోసం అదే చేస్తున్నాం. ఎందుకంటే మేం జట్టు అవసరాలకు అనుగుణంగా ఆడుతున్నాం" అని రోహిత్‌శర్మ ఆటతీరును, తన ఆటను ప్రస్తావిస్తూ విరాట్ కోహ్లీ స్పందించాడు.

"పరిస్థితికి అనుగుణంగా మేం ఆ విధంగా ఆడగలం. మా ఇద్దరి విషయంలో నేను సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే మేం జట్టు విజయానికి సాయం చేయగలిగాం... అలా చేస్తూనే ఉంటాం" అని విరాట్ కోహ్లీ చెప్పాడు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)