You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఛత్రపతి శంభాజీ మరణం తర్వాత మరాఠా సామ్రాజ్యం ఏమైంది, వారసులు ఎవరు?
- రచయిత, ఓంకార్ కరంబేల్కర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తీసిన ఛావా సినిమా ఇటీవల విడుదలైంది. ఇందులో శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ నటించారు.
ఈ సినిమా చూసిన వారిలో శంభాజీ మహారాజ్ మరణం తర్వాత మరాఠా సామ్రాజ్యం ఏమైంది, వారి వారసులు ఎక్కడున్నారు అనే అనుమానం వస్తుంది.
ఛత్రపతి శివాజీ మహరాజ్, ఛత్రపతి శంభాజీ మహరాజ్ మరణం తర్వాత రాణి తారా బాయి సాహెబ్, రాజారామ్ మహరాజ్, సతారా ఛత్రపతి షాహు చరిత్రలో కీలక పాత్ర పోషించారు.
శివాజీ, శంభాజీ మరణం తర్వాత..
శివాజీ 1680లో రాయ్‌గఢ్‌లో మరణించారు. శంభాజీ మహారాజ్, రాజారాం మహారాజ్ ఆయన కుమారులు. శంభాజీ మహారాజ్ తల్లి సాయిబాయి, రాజారాం మహారాజ్ తల్లి సోయారాబాయి.
శివాజీ మరణం తరువాత, శంభాజీ పరిపాలన బాధ్యతలు స్వీకరించారు. 1689లో ఆయన ఔరంగజేబు చెరలో మరణించారు. ఔరంగజేబు శంభాజీతో పాటు ఆయన కుమారుడు షాహును కూడా జైలులో పెట్టారు.
శంభాజీ చనిపోయాక, రాజారామ్ మహారాజ్ కొంతకాలం మహారాష్ట్రలో ఉన్నారు. ఆ తర్వాత తమిళనాడులోని జింజి వద్ద ఉన్న మరాఠా స్వరాజ్య భూమికి వెళ్ళారు.
ఆయన జింజిలోనే ఉండి రామచంద్ర పంత్ అమాత్య బావ్డేకర్, శాంతాజీ ఘోర్పడే, ధనాజీ జాదవ్ సాయంతో మహారాష్ట్ర, జింజి పాలనను పర్యవేక్షించారు.
అలా 8ఏళ్లు పాలించిన తర్వాత ఆయన 1698లో తిరిగి వచ్చారు. 1700లో చనిపోయే వరకు మహారాష్ట్రలోనే ఉన్నారు. 30ఏళ్ల వయసులో ఆయన సింహగఢ్‌లో మరణించారు.
తారా రాణి మూలాలు
రాజారామ్ మహరాజ్ మరణం తర్వాత ఆయన భార్య తారా రాణి తన కుమారుడు రెండో శివాజీని పాలకుడిగా ప్రకటించింది. తారా రాణి హంబీర్‌రావు మోహితే కుమార్తె. ఆమెను మహరాణి తారాబాయి అని కూడా పిలుస్తారు.
"షాహు మహరాజ్ మొఘులుల చెర నుంచి తప్పించుకుని వచ్చి పాలనా పగ్గాలు చేపడతారని రాజారామ్ మహరాజ్ భావించారు. అయితే తారారాణి అభిప్రాయం వేరుగా ఉంది. ఈ రాజ్యం కొత్తదని ఆమె అనుకున్నారు. అంతకు ముందు ఆ రాజ్యాన్ని రాజారామ్ మహరాజ్ స్వాధీనం చేసుకుని పాలించారు" అని చరిత్రకారుడు ఇంద్రజిత్ సావంత్ బీబీసీతో చెప్పారు.
షాహు మహరాజ్- తారా రాణి వివాదం
1707లో ఔరంగజేబ్ మరణించిన తర్వాత షాహు మహరాజ్ మొఘలుల చెర నుంచి విడుదలయ్యారు. ఆయన రాజ్యానికి చేరుకున్న తర్వాత సింహాసనం కోసం షాహు మహరాజ్, తారా రాణి మధ్య వివాదం మొదలైంది.
షాహు మహరాజ్ జైలు నుంచి వచ్చిన తర్వాత తారారాణి వైపు ఉన్న అమాత్యులంతా బయటకు వచ్చి ఆయనను కలవడం ప్రారంభించారు.
దీంతో షాహు మహరాజ్ బలం పెరిగింది. చివరకు ధనాజీ జాదవ్ కూడా షాహు వైపు రావడంతో మొత్తం పరిస్థితి మారిపోయింది. షాహు మహరాజ్ తారా రాణి నియంత్రణలో ఉన్న పన్హాలాపై దాడి చేశారు. ఆ తర్వాత తారా రాణి రంగనా కోటకు వెళ్లారు. 1708లో షాహు మహరాజ్ సతారాలో అధికారం చేపట్టారు.
కొంత కాలం తర్వాత, 1710లో తారారాణి పన్హాలా, విషాల్‌గడ్ ను జయించారు. పన్హాలా కేంద్రంగా కొల్హాపూర్ రాజ్యాన్ని స్థాపించారు. అలా కొత్త రాజ్యం ఏర్పడింది.
ఆమె తన కుమారుడు శివాజీ(రెండు)ని పన్హాలాలో సింహాసనం మీద కూర్చోబెట్టి పరిపాలన కొనసాగించారు. పన్హాలాలో వారి రాజభవనం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది.
గృహ నిర్బంధం
అయితే అంతా సజావుగా జరగలేదు. 1714 వరకూ ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉన్నప్పుడు, రాజారామ్ రెండో భార్య రాజస్‌బాయి, వారి కుమారుడు శంభాజీ( రెండో) హఠాత్తుగా తారారాణిని పక్కన పెట్టి పాలనను చేపట్టారు.
తారారాణి, రెండో శివాజీలను పన్హాలాలో గృహ నిర్బంధం చేసారు. 1727లో రెండో శివాజీ గృహ నిర్బంధంలోనే చనిపోయారు.
ఆ తర్వాత తారా రాణి సతారా వెళ్లి షాహు మహరాజ్ రక్షణ కోరారు. 1731లో షాహు మహరాజ్, రెండో శంభాజీ మధ్య కొల్హాపూర్‌లో వార్నా ఒప్పందం కుదిరింది.
వార్నా నదికి దక్షిణాన రెండు రాజ్యాలు ఏర్పడ్డాయి. అవి షాహు మహరాజ్ పాలనలో ఉన్న సతారా, దక్షిణాన శంభాజీ పాలనలోని కొల్హాపూర్ రాజ్యాలు.
సతారాలో షాహు మహరాజ్‌కు వారసులు లేకపోవడంతో రామ్‌రాజ ( రెండో రాజారామ్)కు పాలనా పగ్గాలు అప్పగించాలని తారారాణి సూచించారు. అందుకు షాహు మహరాజ్‌ను ఒప్పించారు. రామ్‌రాజ ఛత్రపతి శివాజీ ముని మనవడని, అలా ఆ రాజ్యానికి వారసుడని ఆమె చెప్పారు.
షాహు మహరాజ్ మరణం తర్వాత రామ్‌రాజ సతారా వ్యవహారాలను పర్యవేక్షించడం మొదలు పెట్టారు.
అయితే కొంతకాలం తర్వాత రామ్‌రాజ పీష్వాల సలహాల మేరకు నడుచుకుంటున్నట్లు తేలింది. దీంతో 1750లో రామ్‌రాజను జైలులో పెట్టారు తారా రాణి.
అతను నిజమైన వారసుడు కాదని చెబుతూ ఆమె అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. అయితే పీష్వాలు సైనిక బలాన్ని ఉపయోగించడంతో ఆమె అధికారాన్ని కోల్పోయారు.
1761లో తారారాణి సతారాలో మరణించారు. కొల్హాపూర్ సంస్థానం కోసం అనేక ప్రయత్నాలు చేసిన రాణి చివరకు సతారాలో ప్రాణాలు విడిచారు.
కొల్హాపూర్ సంస్థానాన్ని తన వారసులకు అప్పగించడానికి బదులు వారికి సతారా సంస్థానాన్ని అందించడంలో ఆమె విజయం సాధించారు.
"తారా రాణి దూకుడుగా ఉండే రాజకీయ నాయకురాలు. ఆమెకు రాజకీయాలు బాగా తెలుసు. అందుకే ఆమె పరిపాలించడంతో పాటు కష్ట సమయాల్లో నుంచి బయట పడేందుకు మార్గాలను కనుక్కోగలిగారు" అని రామచంద్ర పంత్ అమాత్య బావ్డేకర్ వారసుడు నీల్ పండిట్ బావ్డేకర్ బీబీసీతో చెప్పారు.
తారారాణి తర్వాత సతారా ఏమైంది?
రామ్‌రాజే 1777లో చనిపోయారు. ఆయన రెండో షాహురాజేను దత్తత తీసుకున్నారు. ఆయనకు ప్రతాప్ సింగ్ అనే కుమారుడు ఉన్నారు. 1818లో మరాఠా సామ్రాజ్యం అంతమైంది. అయితే ప్రతాప్‌సింగ్‌ను సతారాకు రాజుగా ప్రకటించారు.
డాక్టర్ ఏఆర్ కులకర్ణి తన 'జేమ్స్ కన్నింగ్ హామ్ గ్రాండ్ డఫ్" అనే పుస్తకంలో బ్రిటిషర్లకు ప్రతాప్‌సింగ్‌కు మధ్య 1819 సెప్టెంబర్‌లో ఒప్పందం కుదిరిందని రాశారు.
1839 సెప్టెంబర్‌లో ప్రతాప్‌సింగ్‌నను బ్రిటిషర్లు పదవి నుంచి తొలగించారు. ఆ తర్వాత ఆయన వారణాసి వెళ్లి అక్కడే ఉన్నారు. ఆయన తర్వాత ఆయన సోదరులు అప్పా సాహెబ్ సతారా బాధ్యతల్ని చూసుకోవడం ప్రారంభించారు.
1849లో సతారా రాజ్యం ఖల్సాగా మారింది. ఉదయన్ రాజే భోసలే, భోసలే కుటుంబానికి ప్రస్తుత వారసుడు.
కొల్హాపూర్ ఏమైంది?
కొల్హాపూర్ వ్యవహారాలను రెండో శంభాజీ రాజే పర్యవేక్షించేవారు. ఆయనకు పిల్లలు లేకపోవడంతో రెండో శివాజీని దత్తత తీసుకున్నారు. రెండో శివాజీ 1762 నుంచి 1813 వరకు కొల్హాపూర్ సంస్థానాన్ని పాలించారు. తర్వాత ఇద్దరు సోదరులు శంభాజీ, షాహాజీ 1838 వరకు కొల్హాపూర్‌ను పాలించారు.
తర్వాత షాహాజీ కుమారుడు మూడో శివాజీ 1866 వరకు కొల్హాపూర్‌ను తన ఏలుబడిలో ఉంచుకున్నారు. ఆయన రాజారామ్‌ను దత్తత తీసుకున్నారు.
రాజారామ్ మహరాజ్ 1870లో ఇటలీలో చనిపోయారు. ఆయనకు కూడా పిల్లలు లేకపోవడంతో ఆయన నాలుగో శివాజీని దత్తత తీసుకున్నారు. నాలుగో శివాజీ 1883లో మరణించారు.
రాజర్షి షాహు మహరాజ్, ఆయన తర్వాత..
నాలుగో శివాజీ మరణం తర్వాత కఘాల్కర్ ఘటే కుటుంబం నుంచి యశ్వంతరావును దత్తత చేసుకున్నారు. ఆయనకు రాజర్షి షాహు మహరాజ్‌గా గుర్తింపు ఉంది.
రాజర్షి షాహు మహరాజ్ కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. వ్యవసాయం, సామాజిక సేవ, ఆరోగ్య రక్షణకు ఆయన చేపట్టిన చర్యలు చరిత్రలో నిలిచిపోయాయి.
1922లో రాజర్షి షాహు మహరాజ్ చనిపోయారు. ఆయన తర్వాత ఆయన కుమారుడు రాజారామ్ మహరాజ్ కొల్హాపూర్ సంస్థానపు సింహాసనాన్ని అధిష్టించారు. 1940 వరకు కొల్హాపూర్‌ను పాలించారు.
ఆ తరవాత 1946లో శివాజీ కొల్హాపూర్ రాజయ్యారు. ఆయనను సతారాలోని భోసలే కుటుంబం నుంచి దత్తత తీసుకున్నారు. ఆయన తర్వాత దేవస్‌లోని పవార్ కుటుంబానికి చెందిన షాజీని దత్తత చేసుకున్నారు. ఆయన 1983లో మరణించారు. ఆ తర్వాత నాగ్‌పూర్‌లోని భోసలే కుటుంబం నుంచి దత్తత చేసుకున్న షాహు మహరాజ్ కొల్హాపూర్ బాధ్యతల్ని చేపట్టారు.
శంభాజీరాజే ఛత్రపతి
రెండో షాహు మహరాజ్‌కు శంభాజీ రాజే, మలోజి రాజే అనే ఇద్దరు పిల్లలున్నారు. వారిలో మలోజీ రాజే ఛత్రపతి 2004 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు.
శంభాజీ రాజే ఛత్రపతి 1971ఫిబ్రవరి 11న జన్మించారు. ఆయన కొల్హాపూర్, రాజ్‌కోట్‌లో చదువుకున్నారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
రాయగఢ్‌లో ఏటా జరిగే శివరాజ్యాభిషేకం దినోత్సవ వేడుకలకు ఆయన హాజరవుతారు. మరాఠాలకు రిజర్వేషన్ ఉద్యమంలోనూ కీలకంగా ఉన్నారు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)