అమెజాన్ అడవిలో కూలిన విమానంలోని నలుగురు పిల్లల జాడ ఎలా తెలిసిందంటే...

అమెజాన్ అడవిలో విమానం కూలిపోయిన తర్వాత అందులోని నలుగురు పిల్లలు 40 రోజుల తరువాత ప్రాణాలతో దొరికారు.

అమెజోనాస్ ప్రావిన్స్‌లోని అరరాకురా నుంచి శాన్ జోస్ డెల్ గువావియారేకు ప్రయాణిస్తున్న సెస్నా 206 విమానంలో మే 1వ తేదీన ఈ పిల్లలు, వారి తల్లి ఎక్కారు.

విమానంలో ఇంజిన్‌ సమస్య తలెత్తడంతో, అలర్ట్ జారీ చేశారు. ఆ తర్వాత విమానం కూలిపోయింది.

ఈ విమాన ప్రమాదంలో వారి తల్లితో పాటు, ఫైలట్, కో ఫైలట్ కూడా మరణించారు.

విమాన ప్రమాద ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందానికి పిల్లలు మాత్రం కనిపించలేదు. దీంతో పిల్లల కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. పిల్లల మంచినీళ్ల బాటిల్, కత్తెర, హెయిర్ టై వంటి వస్తువులను సహాయక సిబ్బంది గుర్తించారు.

అడవిలో పిల్లల పాద ముద్రలను కూడా సహాయక సిబ్బంది కనుగొన్నారు. దీంతో ఈ పిల్లలు బతికే ఉంటారని వారు భావించారు.

స్థానిక ప్రజలు కూడా ఈ పిల్లల్ని వెతికేందుకు సహకరించారు. హుయిటోటో భాషలో రికార్డు చేసిన పిల్లల అమ్మమ్మ మెసేజ్‌ను హెలికాప్టర్ల ద్వారా బ్రాడ్‌కాస్ట్ చేశారు. ఎక్కడున్న వారు అక్కడే ఉండాలని, అప్పుడే తాము తేలికగా కనుగొనగలమని చెప్పారు.

అడవిలో అక్కడక్కడ కొన్ని పండ్లు కొరికి ఉండటంతో పిల్లలు తిన్నారని, వారు బతికే ఉన్నారని సెర్చ్ టీం నిర్ధరించుకుంది.

ఈ పిల్లలు హయిటోటో స్థానిక గ్రూప్‌కు చెందిన వారు. పిల్లలకు పండ్లపై ఉండే అవగాహన, అటవీ ప్రాంతంలో మనుగడ సాధించే నైపుణ్యాలు వీరిని బతికించేందుకు సహకరించాయని ఈ కమ్యూనిటీకి చెందిన సభ్యులు భావించారు.

తరువాత అడవిలోని మరొక ప్రదేశంలో మొబైల్ ఫోన్‌లో భాగమైన లోహపు ముక్క గుర్తించింది సహాయక బృందం.

40 రోజుల గాలింపు చర్యల అనంతరం అమెజాన్ అడవిలో పిల్లల జాడ గుర్తించింది సహాయక బృందం. ఈ విషయాన్ని కొలంబియా దేశాధ్యక్షుడు వెల్లడించారు.

పిల్లలను కొలంబియా రాజధాని బొగోటాకు తరలించారు. అక్కడ ఆసుపత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)