You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అమెజాన్ అడవిలో తప్పిపోయి 31 రోజుల తరువాత ప్రాణాలతో బయటపడ్డారు... తిండి లేక, క్రూర మృగాల మధ్య అన్ని రోజులు ఎలా బతికారు?
- రచయిత, రెడేషియన్
- హోదా, బీబీసీ ముండో
దక్షిణ అమెరికాలోని బొలీవియాకు చెందిన 30 ఏళ్ల వ్యక్తి అమెజాన్ అడవిలో తప్పిపోయారు. 31 రోజులపాటు అడవిలోనే ఎటు వెళ్లాలో తెలియక గందరగోళానికి గురైన ఆ వ్యక్తి ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడ్డారు.
నలుగురు స్నేహితులతో కలిసి జోనథన్ అకోస్టా అడవిలో వేటకు వెళ్లారు. అయితే, అనుకోకుండా ఆయన స్నేహితుల బృందం నుంచి ఆయన తప్పిపోయారు.
ఆ తరువాత వారాలపాటు ఆయనకు వర్షం నీరే ఆధారమైంది. ఆ నీటిని తన షూస్‌లో పట్టుకొని ఆయన తాగేవారు. ఆకలి వేసినప్పుడు తనకు కనిపించిన కీటకాలు, పురుగులను తినేవారు.
జాగ్వార్లు, అడవి పందులు లాంటి ప్రమాదకర జంతువుల నుంచి తప్పించుకుంటూ ఆయన ప్రాణభయంతో అడవిలో ముందుకు వెళ్లారు.
ఎలా బయటపడ్డారు?
అకోస్టా జాడను కనిపెట్టేందుకు తన స్నేహితులు, స్థానికులు కలిసి బృందాలుగా ఏర్పడ్డారు. మొత్తంగా నెల రోజుల తర్వాత వీటిలో ఒక బృందమే అకోస్టాను గుర్తించింది.
‘‘ఇంత కాలంపాటు నా కోసం వెతుకుతూనే ఉన్నారు. అది మామూలు విషయం కాదు’’ అని కన్నీటితో ఆయన చెప్పారు.
‘‘నేను పురుగులు, కీటకాలను తింటూ బతికాను. ప్రాణాలు నిలబెట్టుకోవడానికి అడవిలో ఏమేం చేశానో చెబితే మీరు నమ్మకపోవచ్చు’’అని ఆయన వివరించారు.
గార్గటేస్‌గా పిలిచే అడవి బొప్పాయి పళ్లను కూడా ఆయన తిన్నారు.
‘‘నేను దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఆయన నాకు కొత్త జీవితం ప్రసాదించాడు’’ అని అన్నారు.
అసలు ఆయన ఎలా తప్పిపోయారు? అన్ని రోజులు అడవిలో ఎలా గడిపారు? లాంటి విషయాలు తలుచుకుంటే ఇప్పటికీ చాలా భయంగా అనిపిస్తోందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆయన అడవిలో ఎలా గడిపారో తెలుసుకునేందుకు కుటుంబ సభ్యులు, స్నేహితులు ప్రశ్నలు అడుగుతున్నారు. అయితే, ఆ భయానక అనుభవం నుంచి ఇంకా ఆయన పూర్తిగా కోలుకోలేదు.
ఆయన ఎలా ఉన్నారు?
మొత్తంగా ఆయన ఈ నెల రోజుల్లో 17 కేజీల బరువు తగ్గిపోయారు. ఆయన కాలి ఎముకకు గాయమైంది.
ఆయనను కనిపెట్టినప్పుడు తీవ్రమైన డీహైడ్రేషన్‌తో కుంటుకుంటూ వస్తున్నారని గాలింపు బృందాలు వెల్లడించాయి.
‘‘నాలుగో రోజు కాలికి దెబ్బ తగిలినప్పుడే, ఇక చనిపోతానేమోనని ఆయన భయపడ్డారు’’ అని అకోస్టా తమ్ముడు హోరాసియో అకోస్టా బొలీవియా వార్తాపత్రిక పేజినా సీట్‌కు చెప్పారు.
‘‘ఆయన షాట్‌గన్‌లో కేవలం ఒక క్యాట్రిడ్జ్ మాత్రమే మిగులుంది. మరోవైపు ఆయన నడవలేకపోయారు. తనకు ఎలాంటి సాయమూ ఇక అందదని ఆయన డీలాపడ్డారు’’అని హోరాసియో వివరించారు.
తప్పిపోయినప్పుడు అకోస్టా దగ్గర అగ్గిపెట్టే లేదా ఫ్లాష్‌లైట్ లేవు. మంచినీటి సీసా కూడా లేదు. బూట్లలోనే మంచినీరు పట్టుకొని ఆయన తాగేవారు.
అడవిలో జాగ్వార్‌తోపాటు మరికొన్ని ప్రమాదకర జంతువులను కూడా చూశానని ఆయన చెప్పినట్లు బంధువులు వివరించారు.
అడవి పందిని భయపెట్టేందుకు...
దక్షిణ అమెరికా అడవుల్లో ఎక్కువగా కనిపించే అడవి పందుల గుంపు తన వైపుగా రాకుండా బెదిరించేందుకు జోనథన్ అకోస్టా తన చివరి క్యాట్రిడ్జ్‌ను ఉపయోగించారు.
31 రోజుల తర్వాత 300 మీటర్ల దూరంలో తన కోసం వెతుకుతున్న బృందం జాడలను ఆయన గుర్తించారు. వారి అరుపులు వినిపిస్తున్న దిశగా నెమ్మదిగా కుంటుకుంటూ ఆయన వెళ్లారు.
నలుగురు స్థానికులు తన అన్నయ్యను కనిపెట్టినట్లు హోరాసియో తెలిపారు.
‘‘మా అన్నయ్య దొరికాడని ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పాడు. నిజంగా అది అద్భుతంగా అనిపించింది’’ అని ఆయన వివరించారు.
ఆ భయానక అనుభవం తర్వాత, ఇకపై ఎప్పటికీ వేటకు వెళ్లనని జోనథన్ చెప్పినట్లు హోరాసియో చెప్పారు.
మరోవైపు అసలు అకోస్టా ఎలా తప్పిపోయారో కనుక్కునేందుకు ఆయన నలుగురు స్నేహితులను ప్రశ్నిస్తామని పోలీసులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
- త్రిపురలో బీజేపీ లీడింగ్, నాగాలాండ్‌లో ఎన్డీపీపీ, మేఘాలయలో ఎన్పీపీ ఆధిక్యం
- టిక్ టాక్ మీద పశ్చిమ దేశాలకు ఎందుకంత కోపం?
- వివేక్ రామస్వామి: అమెరికా అధ్యక్ష పదవికి బరిలో దిగనున్న ఈ భారతీయ-అమెరికన్ ఎవరు?
- పేదల కోసం కరెంట్ లేకుండా నడిచే వాషింగ్ మెషీన్ తయారు చేశారు...
- మనీష్ సిసోడియా: అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న ఒకనాటి అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)