You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
శ్రీకాకుళం: కాశీబుగ్గ శ్రీవేంకటేశ్వరాలయంలో తొక్కిసలాట, 9 మంది మృతి
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 9మంది చనిపోయారని పోలీసు సిబ్బంది బీబీసీకి చెప్పారు.
ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఉంటకిస్తూ ఎక్స్‌లో పోస్టు చేసిన వివరాల మేరకు
ఏకాదశి సందర్భంగా ఆలయంలో పెద్ద సంఖ్యలో జనం గుమిగూడడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో అకస్మాత్తుగా తొక్కిసలాట జరిగింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై ఆలయ అధికారులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఘటనా స్థలంలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు.
ఆలయంలో తొక్కిసలాట జరిగి 9మంది చనిపోవడంపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఎక్స్‌లో సంతాపం వ్యక్తం చేశారు.
ప్రధాని సంతాపం, మృతులకు పరిహారం
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో జరిగిన తొక్కిసలాటపై ప్రధాని మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50వేలరూపాయలు పరిహారంగా ప్రకటించారు.
చంద్రబాబు సంతాపం
ఈ సంఘటన తనను కలచివేసిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
భక్తులు మరణించడం అత్యంత విషాదకరమని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
గాయాల పాలైన వారికి మెరుగైన చికిత్స అందించాలని చంద్రబాబు ఆదేశించారు.
ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా స్థానిక అధికారులను, ప్రజాప్రతినిధులను కోరినట్లు ఎక్స్‌లో పోస్ట్ చేసిన మెసేజ్‌లో తెలిపారు.
కాశీబుగ్గ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాటలో పలువురు భక్తుల ప్రాణాలు కోల్పోవడంపై రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత సంతాపం వ్యక్తం చేశారు.
తిరుమల శ్రీవారి దర్శనం కాలేదని...
ప్రస్తుతం తొక్కిసలాట చోటుచేసుకున్న ఆలయం నిర్మాణం వెనుక ఓ భక్తుడి బాధ ఉంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళితే తనకు దర్శనం కాలేదని, ఆ బాధతోనే తన సొంత స్థలం 12 ఎకరాల 40 సెంట్లలో కాశీబుగ్గలో తిరుమల శ్రీవారిని పొలిన 9 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటుచేసి ఆలయాన్ని నిర్మించినట్టు హరిముకుంద పండా గతంలో బీబీసీతో చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)