కంగనా రనౌత్: ఈ ఎంపీకి బీజేపీ నాయకత్వం ఎందుకు వార్నింగ్ ఇచ్చింది?

హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న నటి కంగనా రనౌత్, ఒక న్యూస్‌పేపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రైతుల ఉద్యమాన్ని బంగ్లాదేశ్‌తో ముడిపెడుతూ వ్యాఖ్యలు చేశారు.

చైనా, అమెరికా వంటి విదేశీ శక్తులు భారత్‌లో పనిచేస్తున్నాయని కూడా వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ హైకమాండ్, భవిష్యత్‌లో ఇలాంటి ప్రకటనలు చేయవద్దంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

రైతుల ఉద్యమం గురించి కంగనా చేసిన వ్యాఖ్యలు పార్టీ అభిప్రాయం కాదని బీజేపీ కేంద్ర మీడియా విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.

కంగనా ఏమన్నారు?

“మా అగ్రనాయకత్వం బలంగా లేకుంటే బంగ్లాదేశ్‌లో ఏం జరిగిందో ఇక్కడ (భారతదేశంలో) కూడా అదే జరగడానికి ఎక్కువ సమయం పట్టదు.” అని కంగనా రనౌత్ ఇటీవల ఓ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

బంగ్లాదేశ్‌లో ఇటీవల జరిగిన విద్యార్థుల ఆందోళనలు, అధికార మార్పిడిని భారతదేశంలో రైతుల ఉద్యమంతో ముడిపెట్టారామె.

"ఇక్కడ రైతుల ఉద్యమాలు ఉన్నాయి. అక్కడ మృతదేహాలు వేలాడుతున్నాయి. అత్యాచారాలు జరుగుతున్నాయి." అని అన్నారు.

"బంగ్లాదేశ్‌ అల్లర్ల మాదిరిగా రైతుల దగ్గర పెద్ద ప్లాన్ ఉంది. ఇలాంటి కుట్రలా? రైతులంతా ఏమనుకుంటున్నారు? చైనా, అమెరికాలాంటి విదేశీ శక్తులు ఇక్కడ పనిచేస్తున్నాయి." అని ఆమె ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

కంగనా వ్యాఖ్యలపై బీజేపీ ఒక ప్రకటన విడుదల చేసింది. “కంగనా వ్యాఖ్యలను పార్టీ వ్యతిరేకిస్తోంది. పార్టీ తరపున, పార్టీ విధానాల తరపున ప్రకటనలు, వ్యాఖ్యలు చేసేందుకు ఆమెకు ఎలాంటి అధికారం లేదు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యవద్దని కంగనా రనౌత్‌ను పార్టీ ఆదేశిస్తోంది.” అని అందులో పేర్కొంది.

సామాజిక ఐక్యత కోసం "సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్” అనే విధానాన్ని అనుసరిస్తున్నాం.” అని బీజేపీ తన ప్రకటనలో తెలిపింది.

మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమానికి సంబంధించి గతంలోనూ కంగనా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

కంగనా రనౌత్ వివాదాలు

లోక్‌సభ ఎంపీ అయిన తర్వాత దిల్లీకి వస్తుండగా, మొహాలీ విమానాశ్రయంలో సీఐఎస్‌ఎఫ్‌కి చెందిన ఓ మహిళా కానిస్టేబుల్ తనను చెంపదెబ్బ కొట్టారని కంగనా రనౌత్ గతంలో ఆరోపించారు.

రైతుల ఉద్యమ సమయంలో కంగనా చేసిన ప్రకటనలపై తాను ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కుల్వీందర్ కౌర్ అనే మహిళా కానిస్టేబుల్ చెప్పారు.

రైతుల ఉద్యమంతో పాటు అనేక ఇతర అంశాల మీద గతంలో కంగనా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అందులో కొన్ని...

1. రైతుల ఆందోళన గురించి..

డిసెంబర్ 2020లో, 88 ఏళ్ల మహిళా రైతు మహిందర్ కౌర్ మీద బీబీసీ ఒక వీడియోను పోస్ట్ చేసింది. వంగిన నడముతోనూ మహిందర్ కౌర్ పంజాబ్ రైతులతో కలిసి జెండాను పట్టుకుని కవాతు చేస్తూ అందులో కనిపిస్తారు.

బీబీసీ పోస్ట్ చేసిన మహిందర్ కౌర్ చిత్రాన్ని షహీన్ బాగ్ ధర్నాల్లో పాల్గొన్న బిల్కిస్ దాదీతో పోలుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వచ్చాయి.

ఆ సమయంలో, కంగనా రనౌత్ బిల్కిస్ దాదీ, మహిందర్ కౌర్ కలిసి ఉన్న ఫోటోలను ట్విట్టర్‌లో(ఎక్స్) పోస్ట్ చేస్తూ కామెంట్లు చేశారు.

"టైమ్ మ్యాగజైన్ 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ఉన్న ఈ అమ్మమ్మ, ఇప్పుడు వంద రూపాయల కోసం ఉద్యమానికి అందుబాటులో ఉన్నారు." అని కామెంట్ చేశారు.

కంగనా చేసిన ఈ ప్రకటన వల్ల తనకు కోపం వచ్చిందని, తన తల్లి కూడా రైతుల ఉద్యమంలో పాల్గొన్నారని సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్ అన్నారు.

2. రాహుల్ గాంధీపై వ్యాఖ్యలు

జులైలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శివుడు, చక్రవ్యూహం, మహాభారత కథ గురించి ప్రస్తావించారు.

రాహుల్ గాంధీ గురించి మాట్లాడిన కంగనా “ఆయన మాట్లాడుతున్న పిచ్చి మాటలు చూస్తే, ఆయన ఏవైనా డ్రగ్స్ తీసుకున్నాడేమో పరీక్షించాలనిపిస్తోంది.” అని అన్నారు.

కంగనా తన సోషల్ మీడియా ఖాతాలో ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను రీపోస్ట్ చేశారు.

3. శంకరాచార్యపై ప్రశ్నలు

శంకరాచార్య గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

మహారాష్ట్రలో శివసేన నుంచి విడిపోయి ఏక్‌నాథ్ శిందే ముఖ్యమంత్రి అయిన తర్వాత “రాజకీయ నాయకుడు రాజకీయాలు చేయకపోతే, పానీ పూరి అమ్ముతాడా?' అని తన సోషల్ మీడియా అకౌంట్‌లో పేర్కొన్నారు.

“మహారాష్ట్ర ముఖ్యమంత్రిని ద్రోహి, మోసగాడు అంటూ అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన శంకరాచార్య మనందరి మనోభావాలను గాయపరిచారు. ఇలాంటి చిన్న చిన్న అంశాల గురించి మాట్లాడి ఆయన హిందువుల గౌరవాన్ని మంటగలుపుతున్నారు.” అంటూ ఎక్స్‌లో మెసేజ్ చేశారు.

ఈ వ్యాఖ్యలపై కంగనా మద్దతుదారులు, వ్యతిరేకులు సోషల్ మీడియాలో వాదనలకు దిగారు.

4. 2014లో నిజమైన స్వాతంత్ర్యం వచ్చింది

2021లో కంగనా రనౌత్ ఒక టీవీ చానల్ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘‘1947లో యాచించడం వల్ల భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. 2014 సంవత్సరంలో దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చింది’’ అని అన్నారు.

2014లో నరేంద్ర మోదీ తొలిసారి భారత ప్రధాని అయ్యారు.

కంగనా చేసిన ఈ ప్రకటనపైనా పెద్ద వివాదం చెలరేగింది.

5. తాప్సీ, స్వర భాస్కర్‌లతో గొడవ

సినీ నటి తాప్సీ పన్ను, స్వర భాస్కర్‌లపై కంగనా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

ఒక టీవీ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా ఈ ఇద్దరినీ బి-గ్రేడ్ యాక్టర్‌లుగా అభివర్ణించారు.

రైతులపై కంగనా వ్యాఖ్యలను కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ ఖండించాయి. ఈ వ్యాఖ్యల ఆధారంగా ఆ రెండు పార్టీలు బీజేపీపైనా విమర్శలు చేశాయి.

బీజేపీపై ప్రతిపక్షాల దాడి

రైతుల ఉద్యమంలో పంజాబ్, హరియాణా నుంచి ఎక్కువ మంది రైతులు పాల్గొన్నారు. పంజాబ్‌లో ప్రస్తుతం ఆమ్‌ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. హరియాణాలోనూ త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

బీజేపీ నాయకత్వం తమ పార్టీ ఎంపీ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని, భారతదేశంలో అమెరికా, చైనా పాత్ర ఏంటో వివరించాలని లేని పక్షంలో ఆ ఎంపీని తమ పార్టీ నుంచి బహిష్కరించాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనెత్ డిమాండ్ చేశారు.

భారతదేశంలో రైతులపై ఎవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని, కేవలం 'ఇది పార్టీ ప్రకటన కాదు' అని చెప్పడం ద్వారా బీజేపీ తప్పించుకోలేదని ఆమె అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)