You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తిరుమల: జగన్ ఆలయంలోకి ప్రవేశించాలంటే డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్లు, అసలు ఈ సంప్రదాయం ఎప్పుడు మొదలైంది?
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించారనే వివాదం నేపథ్యంలో వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహనరెడ్డి తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్నట్లు ప్రకటించడంతో, ఆలయంలోకి వెళ్తే డిక్లరేషన్ ఇచ్చే వెళ్లాలంటూ పలు రాజకీయ పార్టీల నేతలు డిమాండ్ చేశారు.
అయితే, దర్శనం కార్యక్రమాన్ని జగన్ రద్దు చేసుకున్నారు. డిక్లరేషన్ పేరిట చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, వెంకటేశ్వర స్వామిని ప్రేమించే వ్యక్తిగా, గౌరవించే వ్యక్తిగా అక్కడ ఇబ్బంది కలిగించకూడదని తాను తిరుమల టూర్‌ని వాయిదా వేసుకున్నాననీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు.
జగన్ తిరుమల ఆలయానికి వస్తున్నారన్న ప్రకటనతో టీటీడీ కూడా అన్యమతస్థులు ఆలయంలోకి ప్రవేశించాలనుకుంటే డిక్లరేషన్ ఇవ్వాలంటూ ఆలయ పరిసర ప్రాంతాలలో బోర్డులు ఏర్పాటు చేసింది.
జగన్ తిరుమల దర్శనం రద్దు నిర్ణయం తర్వాత టీటీడీ సిబ్బంది ఆ బోర్డులను తొలగించడం కనిపించింది.
తిరుమల శ్రీవారిపై తనకు నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇచ్చిన తరువాతే ఆయన తిరుమలేశుని దర్శించుకోవాలని అంతకు ముందు తెలుగుదేశం, జనసేన, బీజేపీ సహా కొన్ని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి.
‘‘అన్యమతస్థులు శ్రీవారిని దర్శించుకోవాలంటే 17వ కంపార్ట్‌మెంట్‌లో ఓ రిజిస్టర్ ఉంటుంది. ఆ రిజిస్టర్‌లో సంతకం పెట్టండి. ఈ దేవుడి మీద నమ్మకం ఉంది అని సంతకం పెట్టి మీ చిత్తుశద్ధిని నిరూపించుకోండి’’ అని ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖామంత్రి పయ్యావుల కేశవ్ సెప్టెంబర్ 25వ తేదీన జరిగిన ప్రెస్‌మీట్‌లో డిమాండ్ చేశారు.
బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా జగన్ డిక్లరేషన్ సమర్పించాల్సిందేనని అంతకు ముందు ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు.
‘‘జగన్ అన్యమతస్తులు కావడంతో (జీవో ఎంఎస్ నెంబర్ 311, రెవిన్యూ, ఎండోమెంట్స్ రూల్ నెంబర్ 16) ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని పురందేశ్వరి ఎక్స్‌లో పోస్టు చేశారు. దీంతోపాటు ఆమె టీటీడీ డిక్లరేషన్ ఫామ్‌ను కూడా పోస్ట్ చేశారు.
నా మతం ఏంటో చెప్పమంటున్నారు: జగన్
అయితే, జగన్ తిరుమల శ్రీవారి దర్శనం కార్యక్రమాన్ని చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. ఈ పర్యటనను రద్దు చేసుకుని తాడేపల్లిలో మీడియా సమావేశం నిర్వహించిన జగన్, తాను దేవుడి దగ్గరకు వెళ్లడాన్ని ఈ స్థాయిలో అడ్డుకునేందుకు ప్రయత్నించడం ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా ఎప్పుడూ జరిగి ఉండదని జగన్ అన్నారు.
‘‘నన్ను, వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలను శ్రీవారి ఆలయానికి రావద్దంటూ నోటీసులు పంపి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ పర్యటన చట్టవిరుద్ధమని అన్నారు. మరోవైపు నేను వస్తున్నానని తెలియడంతో చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ కార్యకర్తలను రప్పిస్తున్నారు. ఈ విషయం బీజేపీ పై నాయకత్వానికి తెలుసో తెలియదో నాకు తెలియదు. తిరుమలలో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. రాక్షస పాలన అంటే ఇదే కదా’’ అని జగన్ విమర్శించారు.
‘‘ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు తిరుమల బ్రహ్మోత్సవాలలో స్వామివారికి వస్త్రాలు సమర్పించిన నేను, ఇన్నిసార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లిన నేను, ఇప్పుడు ఈ ఆలయంలోకి ప్రవేశించకూడదట. దీనికి కారణం నా మతమట’’ అని జగన్ అన్నారు.
‘‘నా మతం మానవత్వం. డిక్లరేషన్‌లో రాసుకుంటే రాసుకోండి’’ అన్నారాయన.
అయితే, జగన్ ఆరోపణలను ముఖ్యమంత్రి చంద్రబాబు తోసిపుచ్చారు. సచివాలయంలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు, ఆలయ సంప్రదాయాలను అందరూ గౌరవించాల్సిందేనన్నారు.
‘‘తిరుమలకు వెళ్లొద్దని జగన్‌కు ఎవరూ చెప్పలేదు. తిరుమల వెళ్లకుండా ఉండడానికి జగన్‌కు ఏ సాకులు ఉన్నాయో తెలియదు. దేవుడి ఆచారాలు, సంప్రదాయాలను ఎవరైనా గౌరవించి తీరాల్సిందే. దేవుడు, ఆచారాల కంటే ఏ వ్యక్తి గొప్పకాదు’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.
డిక్లరేషన్ ఎప్పుడు తీసుకుంటారు?
సాధారణ భక్తులు దర్శనాలకు వచ్చినప్పుడు వారి వివరాలు సేకరించే యంత్రాంగం లేదు. కానీ ప్రత్యేక దర్శనాలకు వచ్చే వారి వివరాలను నమోదు చేస్తారు. ఆ సందర్భంలో వీఐపీల నుంచి సైతం డిక్లరేషన్ తీసుకున్న ఉదంతాలు ఉన్నాయి.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా 2006లో తిరుమల దర్శనానికి వచ్చినా, ఆలయంలో ప్రవేశించే ముందు డిక్లరేషన్ సమర్పించలేదు.
వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి గతంలోనూ పలుమార్లు తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వటానికి నిరాకరించారు.
రాష్ట్రపతి హోదాలో తిరుమల దర్శనానికి వచ్చిన అబ్దుల్ కలాం డిక్లరేషన్ సమర్పించి ఆలయంలో అడుగుపెట్టారు.
జగన్ 2012 మార్చిలో కడప ఎంపీ హోదాలో దర్శనానికి వెళ్లినపుడు ఈ విషయంలో వివాదం తలెత్తింది. జగన్ నుంచి డిక్లరేషన్ కోసం టీటీడీ అధికారులు ప్రయత్నించినా ఆయన నిరాకరించినట్టు అప్పట్లో ప్రచారం సాగింది.
2014 లోనూ ఆయన ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో దర్శనానికి వెళ్లినప్పుడు డిక్లరేషన్ సమర్పించిన దాఖలాలు లేవు. 2017లోనూ అలాగే చేశారు.
సీఎం హోదాలో తిరుమలకు వెళ్లినపుడు సైతం డిక్లరేషన్ సమర్పించలేదనే విమర్శలు వచ్చాయి.
ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో జనరల్ అభ్యర్థులు తమ కుల, మత అంశాలను ప్రస్తావించాల్సిన అవసరం లేదు. దాంతో జగన్ ఎన్నడూ తాను ఫలానా మతస్తుడిగా పేర్కొన లేదు.
ఆయన కుటుంబం క్రైస్తవాన్ని అనుసరించినా, రికార్డుల మేరకు హిందూవులుగానే ఉండే అవకాశం ఉందని, కాబట్టి ఆయన డిక్లరేషన్ సమర్పించాల్సిన అవసరం లేదనే వాదన ఉంది.
‘‘ఇవ్వన్నీ పవర్ పాలిటిక్స్. సోనియాగాంధీ డిక్లరేషన్ ఇవ్వలేదు. నెహ్రూకుటుంబానికి చెందిన వ్యక్తి ప్రత్యేకంగా డిక్లరేషన్ ఇవ్వాలా అని అప్పట్లో కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. అధికారంలో ఉన్న వ్యక్తులను ఎవరూ డిక్లరేషన్ అడగరు. ప్రస్తుత హోం మంత్రి వంగలపూడి అనితను గతంలో టీటీడీబోర్డు మెంబర్‌గా నియమించారు. ఆమె క్రైస్తవ సంప్రదాయాలను పాటిస్తారని ప్రచారం జరగడంతో తర్వాత ఆమె రాజీనామా చేశారు . ఇటీవల ఆమె తిరుమలకు వచ్చినప్పుడు ఎవరూ డిక్లరేషన్ అడగలేదు కదా’’ అని సీనియర్ జర్నలిస్ట్ పీవీ రవికుమార్ చెప్పారు.
2012 నాటి పరిణామాలతో నాటి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ జోక్యం చేసుకున్నారు. నిబంధనలు కఠినతరం చేసి ఖచ్చితంగా అమలు చేయాలని ఆయన టీటీడీని ఆదేశించారు. దాంతో 2014లో నాటి కాంగ్రెస్ ఎమ్మెల్యే జయసుధ దర్శనానికి వెళ్లిన సమయంలో డిక్లరేషన్ తప్పనిసరి అంటూ టీటీడీ అధికారులు ఒత్తిడి చేయడం కూడా వివాదానికి దారితీసింది.
వై.ఎస్. జగన్ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించి తనను మాత్రం ఒత్తిడి చేశారంటూ అప్పట్లో జయసుధ విమర్శలు చేయడం విశేషం. ఆ తర్వాత కూడా జగన్ విషయంలో టీటీడీ అధికారులు డిక్లరేషన్ నిబంధన అమలు చేయడానికి సిద్ధపడలేదు.
కొన్నిసార్లు టీటీడీ సిబ్బంది చొరవ తీసుకుని ఆయనను డిక్లరేషన్ కోరినప్పటికీ నిరాకరించినట్టు ప్రకటించారు.
2006లో చేసిన సవరణలతో..
ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో భక్తులు, పర్యాటకులు సందర్శించే ఆలయాల్లో తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి. ఈ ఆలయం నిర్వహణ కోసం స్వతంత్రానికి పూర్వమే తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేశారు.
1932లో ప్రత్యేక చట్టం ద్వారా టీటీడీ మనుగడలోకి వచ్చింది. తొలుత మద్రాస్ ప్రభుత్వం నియమించిన కమిషనర్ నేతృత్వంలో పాలన సాగింది. ప్రారంభంలో రెండు సలహా మండళ్లు ఏర్పాటు చేశారు. అందులో ఒకటి తిరుమల ఆలయ కార్యకలాపాల సంబంధిత అంశాల కోసం ఏర్పాటు చేస్తే, రెండోది తిరుమల ఆలయ సంబంధిత భూముల పర్యవేక్షణ కోసం సలహా మండలి రైతులతో కలిపి ఉండేది.
స్వాతంత్య్రానంతరం వచ్చిన మార్పులకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలిజియస్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్ (1969), సెక్షన్లు 85 నుండి 91 ప్రకారం టీటీడీ పాలనకు సంబంధించిన నిబంధనలు పొందుపరిచారు. దాని ప్రకారం ధర్మకర్తల సంఖ్యను 5 నుంచి 11కి పెంచారు. హిందూధర్మం ప్రచారం చేయడం ట్రస్ట్ బాధ్యతగా పేర్కొన్నారు.
ఆ తర్వాత మళ్లీ ఏపీ చారిటబుల్ & హిందూ రిలిజియస్ ఇన్‌స్టిట్యూషన్స్ & ఎండోమెంట్స్ చట్టాన్ని 1987లో సవరించారు. ట్రస్ట్ బోర్డు సభ్యుల సంఖ్యను గరిష్టంగా 11 నుంచి 15కి పెంచారు.
2006లో చేసిన సవరణలకు అనుగుణంగా ప్రస్తుతం ఈ సంఖ్య 29. హుండీ ఆదాయంలో పూజారులు, వారి వంశపారంపర్యంగా వాటా పొందే హక్కును 1987 లోనే రద్దు చేశారు. ఆ తర్వాత కూడా ఈ చట్టంలో పలుమార్పులు చేశారు.
దీంతోపాటు అన్యమతస్తులు వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం ఉందని రాతపూర్వకంగా చెప్పాలనే నిబంధన సంప్రదాయంగా ఉండేది. 2006లో చేసిన చట్ట సవరణలో భాగంగా హిందువులు కానివారు దేవాలయంలోకి ప్రవేశించే ముందు డిక్లరేషన్ ఫారమ్‌లో సంతకం చేయడం తప్పనిసరి చేశారు. వారు తమకు వెంకటేశ్వర స్వామిపై విశ్వాసం ఉందని రాతపూర్వకంగా పేర్కొనాల్సి ఉంటుంది.
ఏపీ రెవిన్యూ ఎండోమెంట్స్ -1 లోని జీఓ ఎంఎస్ నెంబర్ 311 (1990) ప్రకారం ఈ ఆదేశాలు వెలువడినట్టు టీటీడీ అధికారులు చెబుతున్నారు. దానిని టీటీడీ చట్టంలో కూడా రూల్ నెంబర్ 136గా పొందుపరిచారు.
నాటి నుంచి పలువురు డిక్లరేషన్ ఇచ్చి ఆలయంలో ప్రవేశించిన దాఖలాలు ఉన్నాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ప్రవేశించేముందు ఈ డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన పత్రాలను టీటీడీ అందిస్తుంది. అన్య మతస్తులు దానిపై సంతకం చేసి ముందుకెళ్లాల్సి ఉంటుంది.
దీనిపై టీటీడీ డిప్యూటీఈవో లోకనాథం బీబీసీతో మాట్లాడారు.
‘‘అన్య మతస్తులు తిరుమలలో దర్శనం చేసుకోవాలి అంటే డిక్లరేషన్ ఫామ్‌లో సంతకం పెట్టాలి. ఇప్పటికీ ఆ నిబంధనలు కొనసాగుతున్నాయి’’ అని తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)