వాటర్ బాటిళ్లలో బియ్యం నింపి సముద్రంలోకి విసురుతున్నారు... పదేళ్లుగా ఎందుకిలా చేస్తున్నారు?

    • రచయిత, రాచెల్ లీ
    • హోదా, బీబీసీ కొరియన్

అది ఏప్రిల్ నెల. ఎండ కాస్తోంది. కానీ, గాలి చల్లగానే వీస్తోంది. దక్షిణ కొరియాలోని సియోమోడో ద్వీపంలో సముద్ర తీరాన నిల్చున్న పార్క్ జంగ్-ఓ, బియ్యం నింపిన ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను నీళ్లలోకి విసిరేస్తున్నారు. అవి ఉత్తర కొరియాకు వెళ్లాలనే ఉద్దేశంతో ఆయన అలా విసురుతున్నారు.

పార్క్ దాదాపు పదేళ్లుగా ఇలా వాటర్ బాటిళ్లను పంపిస్తున్నారు. కానీ, ఆయన బహిరంగంగా ఇలా చేయలేరు. ఎందుకంటే, 2020 జూన్‌లో సరిహద్దుల ద్వారా ఉత్తర కొరియాకు వస్తువులను పంపడంపై దక్షిణ కొరియా నిషేధం విధించింది.

‘‘ఇదే దేశానికి చెందిన ప్రజలు ఆకలితో చనిపోతున్నారు. అందుకే మేం ఇలా బియ్యం నింపిన వాటర్ బాటిళ్లను పంపిస్తున్నాం. ఇదేమైనా తప్పా?’’ అని 56 ఏళ్ల పార్క్ జంగ్ ప్రశ్నించారు.

నిరుడు సెప్టెంబర్‌లో రాజ్యాంగబద్ధ ధర్మాసనం ఈ నిషేధాన్ని కొట్టివేసింది. అయినప్పటికీ, తాను చేస్తున్న పనితో అందరి దృష్టిలో పార్క్ అనుకోవడం లేదు.

మళ్లీ పని మొదలు పెట్టడానికి నెలల తరబడి ఎదురు చూశారు. చివరకు ఏప్రిల్ 9న మంచి పగటి సమయంలో బాటిళ్లను నీళ్లలోకి విసిరేందుకు సిద్ధమయ్యారు. ఆరోజున సముద్రపు ఆటుపోట్లు చాలా బలంగా ఉంటాయని వాతావరణ శాఖ సూచించింది. దీంతో వాటర్ బాటిళ్లు వేగంగా ఉత్తరానికి కొట్టుకుపోతాయనే ఉద్దేశంతో ఆయన ఏప్రిల్ 9న తన పనిని మొదలుపెట్టారు.

‘‘ఇది నా ఉద్యమానికి తాజా ప్రారంభం’’ అని ఆయన అన్నారు.

పార్క్ 26 ఏళ్ల క్రితం ఉత్తర కొరియాను వదిలేసి వచ్చారు. ఆయన తండ్రి ఉత్తరకొరియాకు చెందిన ఒక గూఢచారి. కానీ, ఆయన దక్షిణ కొరియాకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఫలితంగా వారి కుటుంబం మొత్తం ఉత్తర కొరియాను విడిచిపెట్టాల్సి వచ్చింది.

ఆయన ఉత్తర కొరియాలో నివసిస్తున్నప్పుడు, వీధుల్లో ఆకలితో చనిపోయిన అనేక మంది మృతదేహాలు తరచుగా ఆయనకు కనిపించేవి. హాంగే ప్రావిన్సులోకి పంటకాలంలో ఆయుధాలతో దిగే సైనికులు...పంట అంతటినీ ఎలా దోచుకొళ్లేవారో ఒక మిషనరీ ద్వారా తెలిసినప్పుడు ఆయన ఆశ్యర్యపోయారు.

పుష్కలంగా వరిని పండించే ప్రాంతంలో ఆకలి చావుల గురించి ఆయనెప్పుడూ వినలేదు.

వాటర్ బాటిళ్లతో ఉద్యమం

హాంగే ప్రావిన్సులోకి ప్లాస్టిక్ బాటిళ్ల ద్వారా సరుకులను పంపించడానికి పార్క్ 2015లో తన భార్యతో కలిసి క్యూన్ సీమ్ అనే సంస్థను ఏర్పాటు చేశారు.

సముద్రపు అధిక ఆటుపోట్ల సమాచారాన్ని తెలుసుకునేందుకు స్థానికంగా పడవలు నడిపేవారితో పాటు కొరియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ సైన్స్ అండ్ టెక్నాలజీని వారు సంప్రదించారు.

నీరు వేగంగా ప్రవహించే రోజుల్లో ఉత్తరకొరియాకు చేరుకోవడానికి కేవలం నాలుగు గంటలే పడుతుందని వారు తెలుసుకున్నారు.

రెండు లీటర్ల వాటర్‌బాటిల్‌లో కిలో బియ్యంతో పాటు కె-పాప్ సాంగ్స్‌తో కూడిన యూఎస్‌బీలను కూడా ఉంచారు.

మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ల వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అందరి దగ్గర సర్వసాధారణమైనప్పటి నుంచి ఉత్తర కొరియన్లకు కూడా ఇలాంటివి దొరకడం పెద్ద ఇబ్బందేమీ కాదని పార్క్ నమ్ముతున్నారు.

‘‘ఉత్తర కొరియాలో విద్యుత్ ఉండదని చాలామంది అనుకుంటారు. కానీ, అక్కడ చైనా నుంచి తెప్పించిన చాలా సోలార్ ప్యానెళ్లు ఉన్నట్లు నాకు తెలిసింది’’ అని ఆయన చెప్పారు.

కొన్నిసార్లు ప్రతీ బాటిల్‌లో ఒక అమెరికా డాలర్‌ను ఉంచుతారు. అది దొరికివారు దాన్ని చైనీస్ లేదా ఉత్తర కొరియా కరెన్సీలోకి మార్పిడి చేసుకుంటారనే ఉద్దేశంతో ఇలా చేస్తుంటారు. గత ఏడాది వరకు ఒక అమెరికా డాలర్‌కు అధికారిక మార్పిడి రేటు 160 ఉత్తర కొరియా వోన్‌లు.

కరోనా మహమ్మారి సమయంలో పార్క్, ఆయన భార్య నీళ్లలో విసిరేసే వాటర్ బాటిల్ లోపల పెయిన్ కిల్లర్ మందులతో పాటు మాస్క్‌లను ఉంచేవారు.

కానీ, 2020 డిసెంబర్ నుంచి అమల్లోకి వచ్చిన నిషేధం కారణంగా ఈ జంట సీక్రెట్‌గా ఇలా వాటర్ బాటిళ్లను నీళ్లలో పంపేవారు.

‘‘వాళ్లు మమల్ని నేరస్థుల్లా చూశారు. దాదాపు మూడేళ్ల పాటు పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిరిగి నేను అలసిపోయాను’’ అని పార్క్ చెప్పారు.

నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ, ఉత్తర కొరియాకు బాటిళ్లను పంపడం పార్క్‌కు చాలా కష్టంగా మారింది. గతంలో చర్చిలు, మానవ హక్కుల సంస్థల నుంచి విరాళాలు వచ్చేవి. తర్వాత అవి కూడా తగ్గిపోయాయి.

ఉత్తర కొరియాను విడిచి వచ్చిన మరికొంతమంది కూడా తమ సొంతభూమికి ఇలా బాటిళ్లను పంపాలని అనుకున్నారు. అలాగే కొంతడబ్బును కూడా వారు ప్రతిసారి పంపేవారు.

2020 నాటి చట్టం తర్వాత స్థానికులతో పార్క్‌కు ఉన్న సంబంధాలు క్షీణించాయి. పార్క్ చేసే పని వల్ల తమ భద్రతకు ముప్పు కలుగుతుందని వారిలో కొందరు అనుకున్నారు.

తర్వాత వారు నీళ్ల ద్వారా వాటర్ బాటిళ్లలో సరుకులను పంపడానికి ఆసక్తి చూపించలేదు. సమీప గ్రామపెద్ద ఒకరు ఎక్కడ బాటిళ్లు విసిరితే అవి త్వరగా ప్రయాణిస్తాయో సూచించేవారు. ఆయన కూడా పార్క్‌కు మద్దతు ఇవ్వలేదు.

కానీ, ఈసారి పార్క్ డజన్ల కొద్ది పోలీసులు, మెరైన్ కార్ప్స్, సైనికుల పర్యవేక్షణలో సముద్రంలోకి వాటర్ బాటిళ్లను విసిరేశారు. సీసాల లోపల సున్నితమైన, గోప్యమైనవి ఏమైనా ఉన్నాయా? అని వారు తరచుగా పార్క్‌ను ప్రశ్నిస్తూనే ఉన్నారు.

ఈ పనిని మానేద్దామని ఆయనెప్పుడూ అనుకోలేదు.

‘‘ఒకసారి బాటిల్‌లో ఉన్న బియ్యాన్ని చూసి ఉత్తర కొరియా మహిళ ఒకరు అనుమానించి దాన్ని వండి కుక్కకు తినిపించినట్లు నాకు తెలిసింది. ఆ కుక్క బాగానే ఉండటంతో ఆ అన్నాన్ని ఆమె తిన్నారు. బియ్యం నాణ్యత బాగుండటంతో మిగిలిన బియ్యాన్ని అధిక ధరకు అమ్మేసి వచ్చిన డబ్బుతో చౌకగా దొరికే మొక్కజొన్న వంటివి భారీగా కొని పెట్టుకున్నట్లు నాకు తెలిసింది’’ అని పార్క్ చెప్పారు.

2023లో ఉత్తర కొరియా నుంచి వచ్చేసిన 9 మంది సభ్యులతో కూడిన ఒక కుటుంబం, తాము కూడా వాటర్ బాటిళ్లను అందుకున్నామని, ప్రతిగా మరో వ్యక్తి ద్వారా పార్క్‌కు కృతజ్ఞతా సందేశం పంపించినట్లు చెప్పారు.

బాటిళ్ల ద్వారా సరుకులు పంపి తన ప్రాణాలను కాపాడినందుకు నాలుగేళ్ల క్రితం మరో మహిళ కూడా పార్క్‌కు కృతజ్ఞతలు చెప్పారు.

తాను చేసిన సాయం పొందిన వ్యక్తుల్ని పార్క్ ఎప్పుడూ వ్యక్తిగతంగా కలుసుకోలేదు. ప్రజలకు వీలైనంత సాయం చేద్దామనుకున్నానని, ప్రశంసలు కోరుకోలేదని ఆయన చెబుతున్నారు.

‘‘ఉత్తర కొరియన్లు మిగతా ప్రపంచానికి దూరమయ్యారు. వారు ప్రభుత్వం చెప్పినట్లుగానే నడుచుకుంటారు. అసమ్మతి తెలిపితే జరిగే పరిణామాలకు భయపడి వారు ప్రభుత్వానికి కట్టుబడి ఉన్నారు. ఇది వారికి నేను చేయగలిగే అతి చిన్న సహాయం’’ అని పార్క్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)