ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న వై.శ్రీలక్ష్మికి ఊరట లభించింది.
ఓబులాపురం మైనింగ్ కేసులో ఆమెను నిర్దోషిగా ప్రకటిస్తూ తెలంగాణ హై కోర్టు తీర్పు ఇచ్చింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల సెక్రటరీగా ఉన్న సమయంలో అక్రమాలకు పాల్పడినట్టు ఆమెపై అభియోగాలు నమోదయ్యాయి. ఆమెతో పాటుగా నాటి గనుల శాఖ డైరెక్టర్ వి.డి.రాజగోపాల్ మీద కూడా కేసు పెట్టారు.
గనుల లీజు కోసం రూ. 80 లక్షలు లంచం కోరారన్నది ప్రధాన ఆరోపణ. ఈ కేసులో సీబీఐ ఆమెను అరెస్ట్ చేసింది. కొద్దికాలం పాటు ఆమె జైలులో ఉన్నారు. ఆ సమయంలో తీవ్ర అనారోగ్యానికి కూడా గురయ్యారు. ఆ తరువాత బెయిల్ మీద విడుదలయ్యారు.
గాలి జనార్థన్ రెడ్డికి చెందిన ఓబులాపురం మైనింగ్ కంపెనీకి లీజులు కట్టబెట్టడంలో భారీగా ముడుపులు స్వీకరించినట్టు ఆమె మీద ఉన్న ప్రధాన ఆరోపణ.
అయితే శ్రీలక్ష్మి తప్పు చేసినట్లుగా తగిన ఆధారాలతో నిరూపించ లేకపోయినందున ఆమెను నిర్దోషిగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అక్రమాలకు శ్రీలక్ష్మి అండగా నిలిచినట్లు సీబీఐ ఆరోపించింది.
1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన యర్రా శ్రీలక్ష్మి ప్రస్తుతం ఏపీ క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్‌లలో ఒకరు.
ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఉన్న సమీర్ శర్మ పదవీ కాలం గతంలో పొడిగించారు. ఇది త్వరలోనే ముగియనుంది. దాంతో సీనియర్ అయిన శ్రీలక్ష్మి, చీఫ్ సెక్రటరీ రేసులో ఉండే అవకాశం ఉంది.