యుక్రెయిన్: ఇప్పటివరకు ఏం జరిగింది?

ఫొటో సోర్స్, EPA
రష్యా, యుక్రెయిన్‌ల మధ్య జరుగుతున్న శాంతి చర్చల నుంచి ఇప్పట్లో పరిష్కారం లభించకపోవచ్చనే సంకేతాలను రష్యా అధికార ప్రతినిధి దిమిత్రి పెక్సోవ్ ఇచ్చారు.
ఇప్పటివరకు తమకు ఎలాంటి పరిష్కారమూ కనిపించలేదని మీడియాతో ఆయన చెప్పారు. అయితే, ఈ విషయంపై రష్యా తరఫున చర్చలు జరుపుతున్న ప్రతినిధులు ప్రకటన చేస్తారని అన్నారు.
మరోవైపు రష్యా, యుక్రెయిన్‌లను విభజించే సరిహద్దుల వెంబడి ఉన్న యుక్రెయిన్‌లోని ప్రాంతాలపై రష్యా వైపు నుంచి కాల్పులు జరుగుతున్నట్లు దోన్సస్క్‌లోని యుక్రేనియన్ గవర్నర్ వెల్లడించారు.
లూహాన్స్క్‌లో కూడా కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. గత 24 గంటల్లో 35 దాడులు జరిగాయని చెప్పారు.
రాజధాని కీయెవ్ సిటీ సెంటర్ నుంచి కూడా బుధవారం ఉదయం కాల్పుల శబ్దాలు వినిపించాయి.
ఇప్పటివరకు 40 లక్షల మందికిపైగా ప్రజలు యుక్రెయిన్‌ను విడిచి వెళ్లిపోయినట్లు ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ తెలిపింది.
యుక్రెయిన్ నుంచి బ్రిటన్‌కు వచ్చిన 2700 మంది శరణార్థులకు వీసాలు ఇచ్చినట్లు బ్రిటన్ తెలిపింది.తాజా సమాచారం కోసం బీబీసీ న్యూస్ లైవ్ పేజీ చూడండి. ధన్యవాదాలు.













