ఆదివారం రాత్రి లాస్ లాస్ ఏంజెలెస్‌లో జరిగిన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో స్టాండ్-అప్ కమెడియన్ క్రిస్ రాక్‌పై హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ చేయి చేసుకున్నారు.
వేదికపై తన భార్య జాడా పింకెట్ స్మిత్ గురించి క్రిస్ రాక్ జోక్ చేయడంతో విల్ స్మిత్, రాక్ చెంప మీద కొట్టారు.
జాడా స్మిత్ హెయిర్ స్టైల్ గురించి రాక్ కామెంట్ చేస్తూ, "జాడా, GI Jane 2 కోసం వెయిట్ చేయలేకపోతున్నారు" అని అన్నారు.
వెంటనే విల్ స్మిత్ స్టేజీ పైకి ఎక్కి రాక్ చెంప మీద కొట్టి, "నా భార్య పేరు నీ... నోటి నుంచి రానివ్వకు" అని అరిచారు.
విల్ స్మిత్ ఉత్తమ నటుడిగా 2022 ఆస్కార్ అవార్డు అందుకున్నారు.
అవార్డు అందుకుంటూ స్మిత్ కన్నీళ్లపర్యంతమయ్యారు.
"అకాడమీకి క్షమాపణలు తెలియజేస్తున్నాను. నా తోటి నామినీలందరికీ నేను క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను" అని స్మిత్ అన్నారు.
స్మిత్ చెంపపై కొట్టగానే రాక్ షాక్ అయ్యారు.
"ఇది టెలివిజన్ చరిత్రలో గొప్ప రాత్రి" అని ప్రేక్షకులతో అన్నారు.
ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు రాక్ నిరాకరించారని లాస్ ఏంజెలెస్ పోలీసులు తెలిపారు.
"హింస ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించేది లేదు" అని ఆస్కార్ అవార్డులను నిర్వహించే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ట్వీట్ చేసింది.
ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం అవార్డు అందించడానికి క్రిస్ రాక్ స్టేజీ పైకి వచ్చారు. ఆ తరువాత ఈ హంగామా అంతా జరిగింది.
GI Jane, 1997లో విడుదలైన చిత్రం. అందులో డెమి మోరే ఒక వింత హెయిర్ స్టైల్‌తో కనిపిస్తారు. ఆ చిత్రాన్ని ఉద్దేశిస్తూ రాక్, జాడా స్మిత్ గురించి జోక్ చేశారు.
జాడా స్మిత్ తనకు జుట్టు ఊడిపోవడం గురించి 2018లో ఒక ఫేస్‌బుక్ చాట్‌లో మాట్లాడారు. "జుట్టు ఊడిపోవడం సమస్యతో పోరాడుతున్నాను. మొదటిసారి ఎక్కువగా ఊడినప్పుడు చాలా భయమేసింది. గుండు అయిపోతుందేమోనని భయపడ్డా" అని ఆమె అన్నారు.
కాగా, ఆస్కార్ వేదికపై జరిగినదంతా ముందే ప్లాన్ చేసుకున్న స్టంట్ అని పలువురు అభిప్రాయపడ్డారు.