ఆస్కార్ 2022: ఆస్కార్ ప్రతిమ విలువ ఎంత? 10 ఆసక్తికర విషయాలు

హాలీవుడ్ అత్యంత ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల వేడుక కాలిఫోర్నియాలోని లాస్‌ఏంజెల్స్‌లో ఆదివారం జరిగింది.

ఈ అవార్డులపై ప్రజలకు అధిక ఆసక్తి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అత్యధికంగా వీక్షించే టెలివిజన్ ఈవెంట్లలో దీనికి ప్రత్యేకమైన స్థానం ఉంది.

1929 నుంచి హాలీవుడ్‌లో 'అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్' అందజేస్తోన్న ఈ అవార్డులకు సంబంధించిన కొన్ని అంశాల గురించి తెలుసుకుందాం.

1. ఆస్కార్ చరిత్రలో ఇప్పటివరకు ఎక్కువ అవార్డులు గెలుచుకున్న వ్యక్తి ఎవరు?

వాల్ట్ డిస్నీ. యానిమేషన్ సినిమాల్లో తనదైన ముద్ర వేసిన వాల్ట్ డిస్నీ 59 సార్లు ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు. 22 సార్లు విజేతగా నిలిచారు.

2. ఆస్కార్ ప్రతిమ విలువ ఎంత?

ఆస్కార్ అవార్డు ప్రతిమ పసిడి వర్ణంలో మిలమిల మెరిసిపోతున్నప్పటికీ, అందులో ఉండేదంతా బంగారం కాదు. దీనిని కాంస్యంతో తయారు చేసి, 24 క్యారట్ బంగారంతో పూత పూస్తారు.

50 ఆస్కార్ ప్రతిమలు తయారుచేయాలంటే సాధారణంగా మూడు నెలలు పడుతుంది.

మీరు నమ్మరు కానీ దాని విలువ కేవలం ఒక అమెరికా డాలర్ మాత్రమే.

అంతేకాకుండా అవార్డు గ్రహీతలు దీన్ని అమ్మడానికి వీల్లేదు. 1950 నుంచి అవార్డు గెలుచుకున్నవారు ఒక కాంట్రాక్టుపై సంతకం చేయాలి.

ఈ కాంట్రాక్టు ప్రకారం మొదట అకాడమీని సంప్రదించకుండా ఈ అవార్డును అమ్మకూడదు.

3.తొలిసారి ఎప్పుడు టెలివిజన్‌లో ఈ వేడుకలు ప్రసారం అయ్యాయి?

1953 మార్చి 19న బ్లాక్ అండ్ వైట్ టీవీల్లో తొలిసారి ఈ వేడుకలు ప్రసారం అయ్యాయి.

4.మరణించిన తర్వాత ఆస్కార్ అందుకున్న కళాకారులు ఎవరు?

ఆస్కార్ చరిత్రలో కేవలం ఇద్దరు కళాకారులకు మాత్రమే మరణం తర్వాత ఆస్కార్ లభించింది.

1976లో బ్రిటిష్ నటుడు పీటర్ ఫించ్, నెట్‌వర్క్ సినిమాకు గానూ 'ఉత్తమ నటుడు' కేటగిరీలో విజేతగా నిలిచారు. ఇది జరిగిన మూడు దశాబ్దాల తర్వాత ఆస్ట్రేలియన్ నటుడు హీత్ లెడ్జర్‌కు, బ్యాట్‌మన్: ది డార్క్ నైట్ చిత్రానికి గానూ ఉత్తమ సహాయ నటుడు కేటగిరీలో అవార్డు వరించింది.

60 ఏళ్ల వయస్సులో గుండె నొప్పితో ఫించ్ మరణించగా, డ్రగ్ పాయిజన్ కారణంగా లెడ్జర్ 28 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు.

5.ఏ సినిమాకు ఎక్కువ సార్లు ఆస్కార్ వచ్చింది?

సినిమా కేటగిరీలో మూడు సినిమాలు సంయుక్తంగా అత్యధిక సార్లు ఈ అవార్డును గెలుచుకున్నాయి.

బెన్-హర్ (1959), టైటానిక్ (1997), ది లార్డ్ ఆఫ్ ద రింగ్స్: ది రిటర్న్ ఆఫ్ ద కింగ్ (2003) సినిమాలు 11 చొప్పున ఆస్కార్లను తమ ఖాతాలో వేసుకున్నాయి.

వీటి తర్వాత గాన్ విత్ ద విండ్ (1939), వెస్ట్ సైడ్ స్టోరీ (1961) సినిమాలకు 10 చొప్పున అవార్డులు లభించాయి.

6.ఆస్కార్ గెలుచుకున్న మహిళా డైరెక్టర్లు ఎవరు?

ఇప్పటివరకు ముగ్గురు మహిళలు 'బెస్ట్ డైరెక్షన్' కేటగిరీలో అవార్డు అందుకున్నారు.

'ఫియర్ జోన్' సినిమాకు అమెరికా డైరెక్టర్ బిగ్లో, నోమ్యాడ్‌ల్యాండ్ సినిమాకు చైనాకు చెదిన చో జావో, 'ది పవర్ ఆఫ్ గాడ్' సినిమాకు జాన్ కాంపియాన్ ఈ అవార్డును అందుకున్నారు.

7.నాన్ ఇంగ్లిష్ సినిమా కేటగిరీలో అత్యధిక సార్లు అవార్డు గెలుచుకున్న దేశం ఏది?

ఇటలీ. నాన్ ఇంగ్లిష్ కేటగిరీలో ఇటలీ ఇప్పటివరకు 14 సార్లు ఈ అవార్డు అందుకుంది.

8.'ఆస్కార్' అనే పేరు గల వ్యక్తులు ఎవరైనా ఈ అవార్డును గెలుపొందారా?

ఆస్కార్ అనే పేరున్న వ్యక్తి రెండుసార్లు ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు. కంపోజర్ ఆస్కార్ హ్యామర్‌స్టీన్ 2 తొలుత 1942లో, ఆ తర్వాత 1946లో ఈ అవార్డును అందుకున్నారు.

9. ఎక్కువసార్లు ఆస్కార్ పొందిన నటి ఎవరు?

అమెరికాకు చెందిన కేథరీన్ హాప్‌బర్న్, 1934-1982 మధ్య నాలుగుసార్లు 'బెస్ట్ లీడింగ్ యాక్ట్రెస్' కేటగిరీలో ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

10.ఎక్కువ సార్లు ఆస్కార్ పొందిన నటుడు ఎవరు?

అమెరికా నటుడు జాక్ నికోల్‌సన్, యూకేకు చెందిన డేనియల్ డే లూయిస్ ఇద్దరూ చెరో 3 సార్లు ఈ అవార్డును గెలుపొందారు.

ఆస్కార్ 2022: విజేతలు వీరే

ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఈ ఏడాది లాస్ ఏంజిల్స్‌లో జరిగింది.

94వ అకాడమీ విజేతలు వీరే..

ఉత్తమ చిత్రం: కోడా

ఉత్తమ నటి: జెస్సికా చాస్టెయిన్ (ది ఐస్ ఆఫ్ టామీ ఫేయ్)

ఉత్తమ నటుడు: విల్ స్మిత్ (కింగ్ రిచర్డ్)

ఉత్తమ దర్శకుడు: జాన్ కాంపియన్ (ది పవర్ ఆఫ్ ది డాగ్)

ఉత్తమ సహయ నటి: అరియానా డిబోస్ (వెస్ట్ సైడ్ స్టోరీ)

ఉత్తమ సహాయ నటుడు: ట్రాయ్ కాట్సర్ (కోడా)

ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: కెన్నెత్ బ్రనాగ్ (బెల్‌ఫాస్ట్)

ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: సియాన్ హెడర్ (కోడా)

ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్: ఎన్‌కాంటో

ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్: సమ్మర్ ఆఫ్ సోల్

ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్: డ్రైవె మై కార్ (జపాన్)

ఉత్తమ ఒరిజినల్ సాంగ్: నో టైం టు డై (బిల్లీ ఎలిష్, ఫిన్నియాస్ ఓ'కానెల్)

ఉత్తమ కాస్ట్యూం డిజైన్: జెన్నీ బేవన్ (క్యుయెల్లా)

ఉత్తమ సినిమాటోగ్రఫీ: గ్రేగ్ ఫ్రేజర్ (డ్యూన్)

ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: పాల్ లాంబెర్ట్, ట్రిస్తాన్ మైల్స్, బ్రియాన్ కానర్, గెర్డ్ నెఫ్‌జర్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)