You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సెక్స్ సామర్థ్యం కోసం మందులు వాడే వారి మరణాలు పెరుగుతున్నాయి... ఎందుకు?
- రచయిత, మబ్రూక్
- హోదా, బీబీసీ తమిళ్ కోసం
సెక్స్ కోరికలు, లైంగిక సామర్థ్యం పెంచేందుకు మందులు తీసుకోవడం వల్ల సంభవిస్తున్న మరణాలు శ్రీలంకలో పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
గత కొంతకాలంగా లైంగిక సామర్థ్యం పెంచే మందుల వల్ల చనిపోయే వారి సంఖ్య పెరుగుతోందని కొలంబో నేషనల్ హాస్పిటల్‌లో పని చేస్తున్న ఐరేషా దెషానీ సమరవీర తెలిపారు.
'డాక్టర్ల సలహా తీసుకోకుండా మందులు వాడటం, నాణ్యత తక్కువగా ఉన్న వాటిని కొనుగోలు చేయడం, సరైన మోతాదులో మందు వేసుకోక పోవడం' వంటివి ఇందుకు కారణాలు అని సమరవీర వెల్లడించారు.
చాలా మంది యువత వీటిని వాడుతున్నట్లు ఆయన చెబుతున్నారు.
లైంగిక సామర్థ్యం పెంచే మందులు వాడే వారిలో ప్రతి నెలా ఇద్దరు లేదా ముగ్గురు చనిపోతున్నట్లు సమరవీర తెలిపారు.
'ఇది చాలా పెద్ద సంఖ్య. దీని మీద వెంటనే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది' అని ఆయన హెచ్చరించారు.
లైంగిక విజ్ఞానం లేకపోవడంతో ఆన్‌లైన్‌లో చూసే వాటిని నమ్మి ఇబ్బందులకు లోనవుతున్నారని సైకాలజిస్ట్ సరబ్దీన్ అన్నారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే...
పోర్న్ వీడియోలతో తప్పుడు సమాచారం
సరైన లైంగిక అవగాహన లేకపోవడం ఈ సమాజంలో పెద్ద సమస్యగా మారుతోంది. అందువల్లే కొందరు లైంగిక సామర్థ్యం పెంచుకునేందుకు తమకు నచ్చిన రీతిలో మందులు తీసుకుంటున్నారు.
సెక్స్‌లో పాల్గొనే వారిలో అవగాహన, జ్ఞానం లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. అందువల్లే సెక్స్ కోరికలు పెంచుకునేందుకు వారు మందులను ఆశ్రయిస్తున్నారు.
నేడు చాలా సులభంగా పోర్న్ వీడియోలు అందుబాటులో ఉంటున్నాయి. చాలా మంది వాటిని చూస్తున్నారు. పోర్న్ వీడియోలలో చూపించినట్లుగా ఎక్కువ సేపు సెక్స్ చేయాలంటే పురుషాంగం పొడవుగా ఉండాలని భావిస్తారు.
కానీ ఇది అబద్ధం.
పొడవైన పురుషాంగం ఉన్న వారు మాత్రమే సెక్స్‌లో మహిళలను సంతృప్తి పరుస్తారనేది తప్పుడు అభిప్రాయం.
అలాగే ఎక్కువ సేపు సెక్స్ చేయాలంటే 'మా మందులు వాడండి' అంటూ వచ్చే ప్రకటనలు కూడా యువతను తప్పుదారి పట్టిస్తున్నాయి.
అంగం సరిగ్గా స్తంభించని వారు అలాంటి ప్రకటనలు చూసి మోసపోతున్నారు.
కొందరి మగవారిలో అంగం స్తంభన సరిగ్గా ఉండదు. అందుకు శారీరక లోపాలు కారణం కానక్కర్లేదు. భయం వంటి మానసిక సమస్యలు కూడా కారణమవుతాయి.
అంగం సరిగ్గా స్తంభించాలంటే రక్తప్రసరణ బాగా జరగాలి. నాడీ వ్యవస్థ కూడా సరిగ్గా పని చేయాలి. ఈ రెండింటిలో లోపాలు తలెత్తితే అంగ స్తంభన సమస్య తలెత్తుతుంది.
అందువల్ల ఇటువంటి సమస్యలతో బాధపడేవారు డాక్టర్లను కలిసి చికిత్స తీసుకోవాలి. రోగిని పరిశీలించిన తరువాత లక్షణాల ఆధారంగా అవసరం అనుకుంటే డాక్టర్లు సరైన మందులు రాస్తారు.
ఆడవారికి, మగవారికి ఒకేలా కాదు
మరికొందరి పురుషుల్లో శీఘ్ర స్ఖలన సమస్య ఉంటుంది. ఎక్కువ సేపు వారు సెక్స్ చేయలేరు. ఇలాంటి వారు మెడికల్ షాపుల నుంచి మందులను కొంటూ ఉంటారు.
కొందరిలో ఎటువంటి లైంగిక సమస్యలు ఉండవు. కానీ కొందరు మరింత ఎక్కువ సమయం సెక్స్ చేయాలనే ఉద్దేశంతో మందులు కొంటూ ఉంటారు.
అలాంటి వారు ఒక విషయం తెలుసుకోవాలి.
సెక్స్‌లో మగవారు, ఆడవారు ఒకేలా ఉండరు. మగవాళ్లు తక్కువ సమయంలోనే క్లైమాక్స్ చేరుకుంటే ఆడవాళ్లకు మరింత సమయం పడుతుంది. అంటే మగవాళ్ల కంటే ఆలస్యంగా ఆడవారు భావప్రాప్తి పొందుతారు.
ఈ విషయం మీద మగవాళ్లకు అవగాహన ఉండాలి. అందుకు తగినట్లుగా సెక్స్‌లో నడుచుకుంటే ఇద్దరు ఒకేసారి భావప్రాప్తి పొందవచ్చు.
స్ఖలనం జరిగి భావప్రాప్తి పొందిన తరువాత మళ్లీ మరొక సారి సెక్స్‌లో పాల్గొనాలంటే మగవారికి ఎక్కువ సమయం పడుతుంది. కానీ ఆడవారు వరుసగా రెండు మూడు సార్లు భావప్రాప్తి పొందగలరు.
సెక్స్‌లో భావప్రాప్తి పొందడానికి పట్టే సమయం అందరిలో ఒకలా ఉండదు. వ్యక్తికి వ్యక్తికి అది మారిపోతుంది. తక్కువ సమయంలో స్ఖలనం అయ్యే వారు తమలో ఏదో లోపం ఉందని భావిస్తుంటారు. ఇలాంటి వారు డాక్టర్ల వద్దకు వెళ్లకుండానే మెడికల్ షాప్ నుంచి మందులు కొని తెచ్చుకుంటారు.
లైంగిక ఉత్పేరకాలు అనేవి రక్తనాళాలను పెద్దగా చేసి రక్తప్రసరణను పెంచుతాయి. అందువల్ల పురుషాంగంలోకి రక్తప్రసరణ బాగా జరిగి స్తంభిస్తుంది.
గుండె సమస్యలు ఉన్నవారు ఇలాంటి డ్రగ్స్ తీసుకుంటే వారికి గుండె పోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అది చివరకు మరణానికి దారి తీయొచ్చు.
డాక్టర్ల సలహా లేకుండా మందులు తీసుకోవడం వల్ల ఇతర చెడు ప్రభావాలు కలగొచ్చు.
మానసిక కారణాలు
అంగ స్తంభన సమస్యకు మానసిక కారణాలు కూడా ఉంటాయి.
భయం, ఎక్కువగా ఊహించుకోవడం, ఒత్తిడి వంటి మానసిక సమస్యలు లైంగిక సామర్థ్యం మీద ప్రభావం చూపుతాయి. బలవంతంగా లేదా ఇష్టం లేని పెళ్లి చేసినప్పుడు కూడా సెక్స్‌లో పాల్గొనాలంటే సమస్యలు ఎదురవుతాయి.
కాబట్టి ముందుగా సమస్య శారీరకపరమైనదా? లేక మానసికమైనదా? అనేది తెలుసుకోవడం ముఖ్యమని సైకాలజిస్ట్ సరబ్దీన్ అన్నారు.
చెప్పాలంటే సిగ్గు
సెక్స్ సమస్యల గురించి డాక్టర్లతో మాట్లాడటానికి సిగ్గు పడటం వలనే చాలా మంది మెడికల్ షాపులను ఆశ్రయిస్తున్నారని ఫార్మాసిస్టులు అంటున్నారు.
శ్రీలంకలోని అంపారా జిల్లాకు చెందిన ఒక ఫార్మాసిస్ట్ బీబీసీ తమిళ్‌తో మాట్లాడారు. కానీ తన వివరాలను గోప్యంగా ఉంచమని కోరారు.
'లైంగిక ఉత్పేరకాల మందులు తీసుకునే వారు డాక్టర్లకు చూపించుకోవాలంటే సిగ్గుపడతారు.
మా వద్దకు వచ్చే వారు తాము ఎదుర్కొంటున్న సమస్య, లక్షణాలు చెబుతారు. వాటికి తగినట్లు మేం మందులు ఇస్తాం.
మా వద్ద లైంగిక సామర్థ్యానికి సంబంధించిన 15-20 రకాల బ్రాండ్ల మందులున్నాయి.
వీటి ధరలు రూ.100 నుంచి రూ.283 (శ్రీలకం కరెన్సీ) మధ్య ఉంటాయి.
మా వద్ద కొనేవారి వయసు ఎక్కువగా 45 నుంచి 50 మధ్య ఉంటుంది' అని ఆ వ్యక్తి తెలిపారు.
డాక్టర్ సలహా లేకుండా సొంతగా మందులు కొనుక్కుని వాడే వారు తల నొప్పి వంటి సమస్యలను చవి చూసినట్లుగా మరికొందరు ఫార్మాసిస్టులు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ‘జూ’లో మనుషులను ఉంచి ప్రదర్శించేవారు.. ఐరోపా దేశాల ‘అమానుషం’
- జాన్వీ కపూర్: ‘నేను వేసుకునే బట్టలు నా ఇష్టం.. మా నాన్నకే సమస్య లేనపుడు, అడగడానికి మీరెవరు?’
- సమంత: ‘నేను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నా’
- డిజిటల్ గోల్డ్ అంటే ఏంటి? దీపావళి సమయంలో దీనికి ఎందుకు గిరాకీ పెరుగుతుంది?
- వీర్యం శరీరంపై పడితే అలర్జీ వస్తుందా, ఈ సమస్య నుంచి బయటపడటం ఎలా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)