You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
50 ఏళ్లుగా స్నానం చేయని మనిషి.. స్నానం చేయించిన కొన్నాళ్లకే జబ్బు పడి మృతి
'ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషి'గా మీడియా కథనాలు పేర్కొన్న మనిషి తన 94 ఏళ్ల వయసులో గత ఏడాది అక్టోబర్ 23న మరణించారు.
ఇరాన్‌కు చెందిన అమౌ హజీ గత 50 ఏళ్లుగా స్నానం చేయకుండానే గడిపారు. నీటితో స్నానం చేసినా, సబ్బు వాడినా అది తన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని ఆయన బలంగా నమ్మేవారు.
ఇరాన్‌లోని దక్షిణాది రాష్ట్రం ఫార్స్‌లో నివసించిన ఆయనకు స్నానం చేయించి శుభ్రం చేయాలని స్థానికులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అందుకు ఆయన నిరాకరించేవారు.
అయితే, స్థానికుల ఒత్తిడితో ఆయన ఇటీవల కొద్ది నెలల కిందట స్నానం చేశారని ఇరాన్ మీడియా తెలిపింది.
స్నానం చేసిన కొన్నాళ్లకే ఆయన జబ్బు పడ్డారని, అనారోగ్యంతో మరణించారని ఇరాన్‌లోని ఐఆర్ఎన్ఏ వార్తా ఏజెన్సీ వెల్లడించింది.
2014లో టెహ్రాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన జీవనశైలి గురించి తెలిపారు. తనకు ముళ్లపంది మాంసమంటే ఇష్టమని చెప్పిన ఈ వృద్ధుడు నేలలో చిన్న కలుగులాంటి ప్రాంతంలో నివసించేవారు.
స్థానికులు ఇటుకలతో చిన్న ఇల్లు కట్టి ఇవ్వడంతో అందులో ఉండేవారు.
ఏళ్ల తరబడి స్నానం చేయకపోవడంతో ఆయన శరీరమంతా మలినాలు పేరుకుపోయి ఉండేదని ఐఆర్ఎన్ఏ వార్తాసంస్థ తెలిపింది.
పాడైపోయిన, కుళ్లిపోయిన ఆహారం తినేవారని... పాత ఆయిల్ క్యాన్‌లో దాచుకున్న మురికి నీటిని తాగేవారని ఐఆర్ఎన్ఏ రాసింది.
హజీకి పొగ తాగడమన్నా విపరీతమైన ఇష్టం. ఒకటి కంటే ఎక్కువ సిగరెట్లు వరుసపెట్టి తాగుతుండడం కనిపించేది.
స్నానం చేయించడానికి ప్రయత్నించినా, శుభ్రమైన నీరు తాగడానికి ఇచ్చినా హజీ చాలా ఇబ్బంది పడేవారని తెలిపింది.
అయితే, ప్రపంచంలో అత్యధిక కాలం స్నానం లేకుండా గడిపింది ఈయనేనా అనే చర్చ కూడా ఉంది.
భారత్‌లోనూ 2009లో ఇలాంటి వ్యక్తి గురించి మీడియాలో కథనాలు వచ్చాయి. అప్పటికి 35 ఏళ్లుగా ఆయన పళ్లు తోముకోకుండా, స్నానం చేయకుండా గడిపినట్లు మీడియా చెప్పింది.
అయితే, ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? ఏమయ్యారనేది స్పష్టంగా తెలియదు.
ఇవి కూడా చదవండి:
- రిషి సునక్: బ్రిటన్ కొత్త ప్రధాన మంత్రితో భారత్‌కు మేలు జరుగుతుందా.. ఇరు దేశాల సంబంధాలు బలపడతాయా?
- రిషి సునక్: భారత్‌ను ఏలిన బ్రిటన్‌కు ప్రధాని అయిన రిషి గురించి ప్రజలు ప్రైవేటుగా ఏమనుకుంటున్నారు?
- బ్లాక్ డెత్: 700 ఏళ్ల కిందటి ప్లేగు మహమ్మారి మన ఆరోగ్యంపై ఇంకా ప్రభావం చూపుతోందా?
- హాంకాంగ్ టూరిస్టులకు 5 లక్షల ఉచిత విమాన టికెట్లు... ఏమిటీ ఆఫర్?
- వీర్యం శరీరంపై పడితే అలర్జీ వస్తుందా, ఈ సమస్య నుంచి బయటపడటం ఎలా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)