బ్రిటన్ రాణి ఎలిజబెత్‌ 2 కన్నుమూత-ప్రకటించిన బకింగ్‌హమ్ ప్యాలెస్

బ్రిటన్‌కు 70 సంవత్సరాలపాటు రాణిగా వ్యవహరించిన క్వీన్ ఎలిజబెత్-2 కన్నుమూశారు. ఆమె వయసు 96 సంవత్సరాలు.

ఆమె ఆరోగ్య పరిస్థితి బాగా లేదని తెలియగానే కుటుంబ సభ్యులు గురువారం బల్మోరల్ క్యాసిల్ చేరుకున్నారు.

1952లో సింహాసనాన్ని అధిష్టించిన క్వీన్ ఎలిజబెత్-2 అనేక సామాజిక మార్పులకు సాక్షిగా నిలిచారు.

రాణి మరణించడంతో ఆమె కుమారుడు మాజీ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ చార్లెస్ వారసుడిగా పదవీ బాధ్యతలు చేపడతారు.

''రాణి ఈ మధ్యాహ్నం బల్మోరల్ క్యాసిల్ లో ప్రశాంతంగా కన్నుమూశారు'' అని బకింగ్‌హమ్ ప్యాలెస్ ఒక ప్రకటనలో తెలిపింది.

సుదీర్ఘ కాలంగా రాణి

బ్రిటన్ మహారాణిగా ఎలిజబెత్ 2 పదవీకాలం యుద్ధానంతరం కఠిన పరిస్థితులు, సామ్రాజ్యం నుంచి కామన్‌వెల్త్‌గా మారడం, ప్రచ్ఛన్న యుద్ధం ముగింపు, యూరోపియన్ యూనియన్‌ నుంచి బ్రిటన్ ఉపసంహరించుకోవడం వరకూ విస్తరించింది.

ఆమె పదవీకాలం 1874లో జన్మించిన విన్‌స్టన్ చర్చిల్‌ ప్రధాని కావడం నుంచి, ఆయన పుట్టిన 101 ఏళ్ల తర్వాత అంటే 1975లో పుట్టి, ఈ వారం మొదట్లో రాణి ద్వారా నియమితులైన లిజ్ ట్రస్ వరకూ 15 మంది ప్రధానుల దాకా కొనసాగింది.

రాణి తన పదవీకాలం అంతటా తమ దేశ ప్రధానితో, వారం వారం చర్చలు నిర్వహించేవారు.

క్వీన్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోడానికి లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్‌ ఎదుట వేచిచూస్తున్న ప్రజలు, ఆమె మరణవార్త వినగానే కన్నీరు పెట్టారు.

ప్యాలెస్ పైనున్న యూనియన్ పతాకాన్ని బ్రిటన్ కాలమానం ప్రకారం సాయంత్రం 6.30కు సగానికి అవనతం చేశారు.

బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ 2 మృతికి భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ ద్వారా తన సంతాపం తెలిపారు.

2015, 2018 బ్రిటన్‌ పర్యటనల్లో క్వీన్ ఎలిజబెత్ 2తో చిరస్మరణీయమైన సమావేశాల్లో పాల్గొన్నానని మోదీ గుర్తు చేసుకున్నారు.

ఇటు ప్రపంచ దేశాధినేతలు క్వీన్ ఎలిజబెత్ 2 మృతికి నివాళులు అర్పిస్తున్నారు.

1982లో రాణితో జరిగిన తన మొదటి సమావేశాన్ని, ఇటీవల 2021లో తన విదేశీ పర్యటన సందర్భంగా ఆమె ఇచ్చిన ఆతిథ్యం గురించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ట్విటర్‌ ద్వారా విడుదల చేసిన ఒక ప్రకటనలో గుర్తు చేసుకున్నారు.

"ఆమె తన తెలివితేటలతో మమ్మల్ని ఆకర్షించారు. ఆమె దయ మమ్మల్ని కదిలించింది. 9/11 సమయంలో ఆమె అమెరికాకు సంఘీభావం ప్రకటించారు. ప్రేమకు మనం చెల్లించే మూల్యమే దుఃఖం అని మాకు గుర్తుచేశారు" అన్నారు.