Oscor-Sacheen Littlefeather: ఆస్కార్ వేదిక మీదనే ఆమెను అవమానించారు, 50 ఏళ్ల తర్వాత సారీ చెప్పారు

సుమారు 50 ఏళ్ల కిందట ఆస్కార్ వేదిక మీద అమెరికాలోని ఒక ఆదివాసీ నటికి జరిగిన అవమానానికి నేడు అకాడమీ క్షమాపణలు చెప్పింది.

అమెరికా నేటివ్ ఇండియన్ అయిన సషీన్ లిటిల్‌ఫెదర్ 1973 ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు. 'ది గాడ్‌ఫాదర్' నటుడు మార్లోన్ బ్రాండో తరపున ఆస్కార్ అవార్డు తీసుకోవడానికి ఆమె వచ్చారు.

వేదిక మీదకు వెళ్లిన సషీన్ లిటిల్‌ఫెదర్ అవార్డు తీసుకోవడానికి నిరాకరించారు.

'మార్లోన్ బ్రాండో తరపున నేను ఇక్కడకు వచ్చాను. ఆయన మీ కోసం ఒక సుదీర్ఘమైన సందేశం పంపారు. కానీ సమయం లేకపోవడం వల్ల అదంతా ఇప్పుడు చదవలేను. ఈ అవార్డును తిరస్కరిస్తున్నందుకు బ్రాండో చింతిస్తున్నారు. హాలీవుడ్ సినిమాల్లో అమెరికా ఆదివాసీలను చిత్రీకరిస్తున్న తీరుకు నిరసనగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు’’ అని ఆమె అన్నారు.

'ఊండెడ్ నీ' వద్ద జరిగిన ఘటన కూడా ఇందుకు మరొక కారణం' అని సషీన్ ప్రసంగిస్తుండగా కింద ఉన్నవారిలో కొందరు ఆమెను గేలి చేశారు.

స్టేజ్ వద్ద ఉన్న హాలీవుడ్ నటుడు జాన్ వేనీ కోపంతో రగిలిపోగా ఆయన్ను సెక్యూరిటీ గార్డ్స్ ఆపారు.

చివరకు ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ సాయంతో ఆస్కార్ వేదిక నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చిందని 2020లో బీబీసీతో మాట్లాడుతూ సషీన్ తెలిపారు.

'నా మీద, బ్రాండో మీద జాన్ వేనీకి విపరీతమైన కోపం వచ్చింది. నన్ను అక్కడే స్టేజీ మీద నుంచి లాగి వేయాలని అనుకున్నాడు. కానీ సెక్యూరిటీ గార్డ్స్ ఆపారు' అని ఆమె చెప్పారు.

'ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఎన్నడూ అనుకోలేదు' అని ఆమె ఓ రిపోర్టర్‌తో అన్నారు. నాడు అలా జరిగి ఉండకూడని ఆస్కార్ అకాడమీ తెలిపింది.

'మీరు చేసిన వ్యాఖ్యలకు బదులుగా మీరు ఎదుర్కొన్న వేధింపులు సమర్థనీయమైనవి కావు. మీకు కలిగిన మానసిక వేదన, మీ కెరియర్‌కు కలిగిన నష్టం ఎవరూ పూడ్చలేనివి. అయినా ఇంత కాలం మీరు చాలా ధైర్యంగా ఉన్నారు. మీకు జరిగిన నష్టానికి క్షమాపణలు చెబుతూ మీ ధైర్యాన్ని అభినందిస్తున్నాం' అంటూ నాటి అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ప్రెసిడెంట్ డేవిడ్ రూబిన్ జూన్ 18న సషీన్‌కు లేఖ రాశారు.

నాడు జరిగిన తప్పును దిద్దుకునే క్రమంలో భాగంగా సెప్టెంబరులో సషీన్ లిటిల్‌ఫెదర్ కోసం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)