You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చైనా వార్నింగ్‌ను లెక్క చేయకుండా తైవాన్‌లో అడుగుపెట్టిన అమెరికా స్పీకర్ పెలోసీ
అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్‌లో అడుగుపెట్టబోతున్నవేళ, ఆ దేశంపై చైనా బలప్రదర్శనకు దిగుతున్నట్లు, ఒత్తిడి పెంచుతున్నట్లు కనిపిస్తోంది.
వైట్‌హౌస్ నుంచి అధికారికంగా కాకుండా, నాన్సీ పెలోసీ వ్యక్తిగతంగా తైవాన్ పర్యటనకు వచ్చారు. ఇలా అమెరికా అధికారి ఒకరు ఇక్కడకు రావడం కొన్ని దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి.
అమెరికా అధికార వర్గాలలో మూడో స్థానంలో ఉన్న పెలోసీకి మొదటి నుంచి చైనా వ్యతిరేకిగా ముద్ర ఉంది. ఆమె తైవాన్‌లో అడుగుపెడితే అమెరికా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చైనా హెచ్చరిస్తూ వస్తోంది. ఈ హెచ్చరికల నడుమ ఆమె తైవాన్‌లో అడుగుపెట్టారు.
తైవాన్ అడుగు పెట్టిన కాసేపటికే ఆమె ట్వీట్ చేశారు. ఈ ప్రపంచం నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి మధ్య ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన పరిస్థితిలో పడిందని ఆమె తన అన్నారు.
తైవాన్ ఒక స్వతంత్ర ద్వీపం కాగా, చైనా ఇది తమ దేశంలో భాగమని వాదిస్తోంది.
ఈ పర్యటన సున్నితత్వంపై అమెరికాకు నిత్యం సమాచారం పంపుతూనే ఉన్నామని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చున్యింగ్ అన్నారు. ''చైనా సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే చర్యలకు దిగినందుకు అమెరికా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది'' అని ఆమె అన్నారు.
ఈ పర్యటన నేపథ్యంలో మంగళవారం నాడు యుద్ధ విమానాలను తైవాన్ సరిహద్దులకు పంపించింది చైనా
మరోవైపు చైనా సైన్యాలు లైవ్ ఫైర్ డ్రిల్స్ నిర్వహిస్తూ తైవాన్‌ను భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. ‘‘మేం సిద్ధంగా ఉన్నాం’’ అని పేర్కొంటూ చైనా తూర్పు కమాండ్ ఈ డ్రిల్స్ కు సంబంధించిన ఓ వీడియోను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసింది.
తమ ద్వీపం దగ్గర సైనిక విన్యాసాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయని, అయితే, వాటిని ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని చైనా కదలికలను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించింది.
చైనాతో అధికారిక సంబంధాలు కొనసాగిస్తున్న అమెరికా, ఇప్పటి వరకు తైవాన్‌ను ప్రత్యేక దేశంగా గుర్తించి అధికారికంగా విదేశీ సంబంధాలను ఏర్పరుచుకోలేదు. కానీ, తైవాన్‌తో సత్సంబంధాలను మాత్రం కొనసాగిస్తోంది.
తైవాన్ సమీపంలో చైనా సైనిక చర్యలకు దిగవచ్చని, కవ్వింపు చర్యలు చేపట్టవచ్చని అమెరికా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధి జాన్ కిర్బీ ఇంతకు ముందే హెచ్చరించారు.
ఆదివారం నాడు ఆసియా పర్యటనకు బయలుదేరిన నాన్సీ పెలోసీ, తన పర్యటన షెడ్యూల్ లో తైవాన్ పేరును పేర్కొన లేదు. సింగపూర్, మలేషియాలను సందర్శించిన ఆమె, దక్షిణ కొరియా, జపాన్‌లలో పర్యటించనున్నారు. మంగళవారం సాయంత్రం తైవాన్‌లో దిగారు.
విదేశీ అతిథులు ఎవరైనా తాము హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతామని, అవసరమైన ఏర్పాట్లు చేస్తామని తైవాన్ ప్రధానమంత్రి సు సెంగ్ ఆమె రాకకు ముందే వ్యాఖ్యానించారు.
ఈ పర్యటన వైట్‌హౌస్‌కు తలనొప్పిగా మారిందన్న వాదన అమెరికా అధికారిక వర్గాల్లో వినిపిస్తోంది. నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన అమెరికన్ మిలిటరీ విషయంలో అంత గుడ్ ఐడియా కాదని అధ్యక్షుడు బైడెన్ గతవారం వ్యాఖ్యానించారు.
అయితే, నాన్సీ పెలోసీకి తైవాన్‌ను సందర్శించే హక్కు ఉందని, అది ఆమె వ్యక్తిగత నిర్ణయమని, దీనిని వైట్‌హౌస్ గౌరవిస్తుందని జాన్ కిర్బీ అన్నారు
తైవాన్‌కు మద్ధతిచ్చే విషయంలో అమెరికా ప్రజల్లోనూ, కాంగ్రెస్‌లోనూ భిన్నాభిప్రాయాలున్నాయి.
డెమొక్రాటిక్ పార్టీలో సీనియర్ నేత అయిన పెలోసీ, చైనాకు తీవ్ర వ్యతిరేకి. మానవ హక్కుల ఉల్లంఘన అంశంలో ఆ దేశపు నేతలపై ఆమె తరచూ విమర్శలు చేస్తుంటారు.
గతంలో ఆమె చైనా ప్రజాస్వామ్యవాదులకు మద్దతివ్వడమే కాకుండా, 1989 నాటి తియనాన్మెన్ ఘటన బాధితులకు మద్దతు పలికేందుకు ఆమె తియనాన్మెన్ స్క్వేర్‌ను సందర్శించారు.
నాన్సీ పెలోసీ ఏప్రిల్ లోనే తైవాన్ పర్యటనకు వెళ్లాలని భావించినప్పటికీ, కోవిడ్ సోకడంతో తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ''మనం తైవాన్‌కు మద్ధతివ్వడం చాలా అవసరం'' అని ఆమె ఈ నెల ఆరంభంలో వ్యాఖ్యానించారు.
1997లో రిపబ్లికన్ పార్టీకి చెందిన మాజీ స్పీకర్, ఈ ఏడాది ఆరంభంలో అమెరికా చట్ట సభ సభ్యుడొకరు తైవాన్ పర్యటించారని జాన్ కిర్బీ గుర్తు చేశారు.
''ఇక్కడ ఎలాంటి సందేహాలు అవసరం లేదు. డ్రామా లేదు. ఇది ప్రెసిడెంట్ లేకుండా, స్పీకర్ ఒక్కరే తైవాన్ వెళ్లడం కాదు''అన్నారు జాన్ కిర్బీ.
స్పీకర్ పెలోసీ అమెరికా మిలిటరీ విమానంలో ఆసియా పర్యటన చేస్తున్నారని కిర్బీ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్: ‘‘రోజుకు ఒక పూటే భోజనం, పిల్లలు రెండో పూట ఆకలితో పడుకుంటున్నారు’’
- ఇండియా హిందూ దేశంగా మారుతోందా
- గే జంటల ముద్దుల పోటీ: పార్కులో ముద్దు పెట్టుకుంటే తిట్టారు... అందుకే
- అవిభక్త కవలలకు వీఆర్ హెడ్‌సెట్స్ పెట్టుకుని సర్జరీ చేసిన డాక్టర్లు... ఆపరేషన్ సక్సెస్
- ఆహారం: నెయ్యి తింటే కొవ్వు పెరుగుతుందా... ఈ ప్రచారంలో నిజమెంత?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)