Lottery-Maths : అదృష్టాన్ని కాదు.. గణితాన్ని నమ్ముకున్నారు.. లాటరీల్లో రూ. 140 కోట్లు సంపాదించారు.. ఎలాగంటే..

లాటరీ కొట్టాలంటే అదృష్టం ఉండాలా?

అవసరం లేదు కొంచెం లెక్కలు తెలిస్తే చాలు అంటారు ఒక పెద్దాయన.

మేం లెక్కల్లో డిగ్రీలు చేశాం... అంతమాత్రాన లాటరీలు తగిలేస్తాయా? అని మీరు అనొచ్చు.

డిగ్రీలు చేస్తే కాదు లెక్కలను అప్లై చేయడం తెలిస్తే డబ్బులొస్తాయంటారు ఆ పెద్దాయన. అనడమే కాదు 26 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.140 కోట్లు సంపాదించారు. ఒకటి రెండు సార్లు కాదు 2003 నుంచి 2012 మధ్య లెక్కలేనన్ని లాటరీలను లెక్కల సాయంతో గెలిచారు.

ఎవరు గురూ ఆ పెద్దాయన? జీవితంలో ఒక్కసారి లాటరీ తగిలానా చాలని మేం అనుకుంటుంటే... సచిన్ సెంచరీలు కొట్టినట్లు... అలా లాటరీలు కొట్టేస్తూ పోతున్నాడు అంటారా?

ఆ పెద్దాయన పేరు జెర్రీ సెల్బీ. ఆయన భార్య పేరు మార్జ్ సెల్బీ. రిటైర్మెంట్ జీవితం గడుపుతున్న ఈ కపుల్స్, సింపుల్ మ్యాథ్స్ టెక్నిక్స్‌తో లాటరీలు గెలుస్తూ పోయారు. ఆ టెక్నిక్ పట్టుకోవడానికి వాళ్లేమీ నెలలు, సంవత్సరాలు పరిశోధించలేదు. 'కేవలం రెండు నిమిషాల్లో లాటరీ కచ్చితంగా తగిలే ఫార్ములాను పట్టుకున్నా' అంటారు జెర్రీ సెల్బీ.

ఈ కపుల్ కథ విని థ్రిల్ అయిన హాలీవుడ్, 'జెర్రీ & మార్జ్ గో లార్జ్' అంటూ ఏకంగా సినిమానే తీసేసింది. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ అయింది. బ్రయాన్ క్రానస్టన్, అనెటీ బెనింగ్ ఈ సినిమాలో నటించారు.

'బేసిక్ లెక్కలు తెలిస్తే చాలు'

అమెరికాలోని మిషిగన్‌కు చెందిన సెల్బీ దంపతులు, తమ జీవితంలో అధిక భాగం ఎవెరెట్ట్‌ అనే చిన్న పట్టణంలో గడిపారు. 2003 వరకు వారి జీవితంలో పెద్ద మార్పేమీ రాలేదు. ఆ తరువాతే వారి జీవితంలో అసలైన మ్యాజిక్ జరిగింది.

ఒకరోజు వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న జెర్రీ సెల్బీ, మిషిగన్‌ స్టేట్ విన్‌ఫాల్ లాటరీ ప్రకటన చూశారు. ఆ యాడ్‌ను క్షుణ్నంగా చదివిన తరువాత సెల్బీలోని మ్యాథ్స్ జీనియస్ బయటకు వచ్చారు. తాను వేసుకున్న లెక్కలతో ఈ లాటరీలో గెలిచే అవకాశాలు కచ్చితంగా ఉన్నట్లు గుర్తించారు.

ముందుగా విన్‌ఫాల్ లాటరీ ఎలా పని చేస్తుందో చూద్దాం. ఒక్కో లాటరీ టికెట్ మీద 1 నుంచి 49 మధ్య నెంబర్లు ఉంటాయి. టికెట్ కొన్న వ్యక్తి 1 నుంచ 49 మధ్య 6 నెంబర్లను చూజ్ చేసుకోవాలి. మిషిగన్ విన్‌ఫాల్ లాటరీ మెషిన్ డ్రాలో వచ్చే 6 నెంబర్లు, టికెట్ కొన్న వ్యక్తి చూజ్ చేసుకున్న 6 నెంబర్లు మ్యాచ్ అయితే తొలి ప్రైజ్ అంటే 2 మిలియన్ డాలర్లు తగులుతాయి. 5 నెంబర్లు గెస్ చేస్తే ఇంకొంచెం తక్కువ ప్రైజ్, 4 నెంబర్లు గెస్ చేస్తే ఇంకొంచెం తక్కువ అలా పోతూ ఉంటుంది.

ఒకవేళ లాటరీ గేమ్‌లో 6 నెంబర్లు ఎవరూ గెస్ చేయలేక పోతే సిస్టమ్ రోల్ డౌన్ అవుతుంది. అంటే 5, 4, 3 ఇలా తరువాత నెంబర్లు గెస్ చేసిన వారికి 2 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ పంచుతారు. అప్పుడు తక్కువ నెంబర్లు గెస్ చేసిన వారికి ఎక్కువ ప్రైజ్ మనీ వచ్చే అవకాశం ఉంటుంది. మాములుగా 4 నెంబర్లు గెస్ చేస్తే 100 డాలర్లు వస్తాయని అనుకుంటే రోల్ డౌన్‌లో అది 1,000 డాలర్లు అవుతుంది. 3 నెంబర్లు గెస్ చేసినప్పుడు 5 డాలర్లు వస్తాయనుకుంటే రోల్ డౌన్‌లో అది 50 డాలర్లు అవుతుంది.

ఈ లాటరీ గేమ్ ప్రాబబిలిటీ అంటే సంభావ్యత మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడే జెర్రీ తన లెక్కల బుర్రను వాడారు. ఒక్కో టికెట్ ధర సుమారు 2 డాలర్లు. అంటే ఎక్కువ టికెట్లు కొంటే ప్రైజ్ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆయన అర్థం చేసుకున్నారు.

'1,100 డాలర్లు ఖర్చు చేస్తే నాకు కచ్చితంగా ప్రైజ్ వస్తుందని అర్థమైంది. ఎందుకంటే కనీసం ఒక్కసారైనా నేను గెస్ చేసిన 4 నెంబర్లు విన్‌ఫాల్ డ్రాతో మ్యాచ్ అవుతాయి. తద్వారా 1,000 డాలర్లు వస్తాయి. ఇక 18 సార్లు 3 నెంబర్లు వస్తాయి కాబట్టి, 50x18 అంటే మరో 900 డాలర్లు తగులుతాయి.

మొత్తానికి నేను ఖర్చు చేసింది 1,100 డాలర్లు. నాకు వచ్చింది 1,900 డాలర్లు. ఇది చాలా సింపుల్ అర్థమేటిక్.' అని జెర్రీ వివరించారు.

ఏడాదికి 80 బిలియన్ డాలర్లు

అమెరికాలో లాటరీ గేమ్స్ కోసం ఏడాదికి సుమారు 80 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తారు. సగటున ఒక్కో వక్తి 250 డాలర్లు ఖర్చు పెడతారు. అయితే జెర్రీ సెల్బీ ఇంతకంటే ఎక్కువ ఖర్చు చేసి, తాను ప్రైజ్ మనీ గెలిచే అవకాశాలను భారీగా పెంచుకున్నారు.

ఆయన తన ఫార్ములాతో ఆ తరువాత 3,600 డాలర్లు ఖర్చు చేసి 6,300 డాలర్లు సంపాదించారు. ఆ తరువాత 8,000 డాలర్లను 16,000 డాలర్లు చేశారు. ఈ లాజిక్క్‌ను ఆయన తన భార్య మార్జ్ సెల్బీకి చెప్పారు.

అక్కడి నుంచి ఇద్దరు కలిసి లాటరీ గేమ్స్ ఆడటం ప్రారంభించారు. ఇందుకోసమే వారు జీఎస్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీస్ అనే కంపెనీని ఏర్పాటు చేశారు. ఒకానొక సమయంలో ఆ కంపెనీ షేర్లను ఒక్కోటి 500 డాలర్లకు అమ్మారు.

వారుండే ఎవెరెట్ట్ పట్టణంలోని రైతుల నుంచి లాయర్ల వరకు చాలా మంది సెల్బీ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. సెల్బీ దంపతులు లాటరీలో గెలిచిన అత్యంత ఎక్కువ మొత్తం 8,53,000 డాలర్లుగా ఆ కంపెనీ ఖాతాల్లో ఉంది.

చివరకు మిషిగన్ విన్‌ఫాల్‌ లాటరీని మూసేశారు. మసాచుసెట్స్ రాష్ట్రంలో క్యాష్ విన్‌ఫాల్ లాటరీ గేమ్ నడుస్తోందని ఒక మిత్రుడు చెప్పగా వారు అక్కడకు వెళ్లారు. అలా సుమారు 6 ఏళ్ల పాటు ఇలాంటి లాటరీ గేమ్స్ ఆడేందుకు అమెరికాలోని ఆరు రాష్ట్రాల్లో సెల్బీ దంపతులు తిరిగారు.

ఏడాదికి సగటున వారు లాటరీ గేమ్స్ కోసం 6 లక్షల డాలర్లు ఖర్చు చేశారు. టికెట్లను సరి చూసుకోవడానికి హోటల్‌ గదిలో రోజుకు 10 గంటల సమయం గడిపిన రోజులు కూడా ఉన్నాయని జెర్రీ సెల్బీ తెలిపారు.

ఇది చట్టబద్ధమేనా?

లాటరీల మీద జెర్రీ, మార్జ్ సెల్బీల దండయాత్రకు 2012లో తెరపడింది. అప్పటికి వారు కోటీ 80 లక్షల టికెట్లు కొన్నారు.

మసాచుసెట్స్‌లోని కొన్ని షాపుల్లో ఉన్న విన్‌ఫాల్ వెండింగ్ మెషిన్లలో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా ది బోస్టన్ గ్లోబ్ అనే పత్రిక పరిశోధించి బయటకు తీసింది. ఇలా విన్‌ఫాల్ లాటరీ గేమ్స్‌తో డబ్బులు సంపాదించింది సెల్బీ దంపతులు మాత్రమే కాదు. మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(మిట్) విద్యార్థులు కూడా ఇలాగే డబ్బు సంపాదించడం ప్రారంభించారు.

దీంతో మసాచుసెట్స్ రాష్ట్ర అధికారులు విచారణ చేపట్టారు. కానీ ఆ లాటరీ గేమ్‌లో ఎటువంటి ఫ్రాడ్ లేదని వారి విచారణలో తేలింది.

'నేను షాక్ అయ్యా. చట్టం పరిమితుల్లోనే ఆ మ్యాథ్స్ జీనియస్ లాటరీలు గెలిచిన తీరు నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయన మిలియన్లు సంపాదించారు.' అని విచారణకు నేతృత్వం వహించిన గ్రేగ్ సల్లివాన్ సీబీఎస్‌తో అన్నారు.

చివరకు క్యాష్ విన్‌ఫాల్ లాటరీ గేమ్స్‌ను రద్దు చేశారు. నేడు అలాంటి గేమ్స్ అమెరికాలో లేవు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)