యుద్ధంలో చిక్కుకున్న యుక్రెయిన్‌ ప్రజలకు ఉబర్ టెక్నాలజీతో ఆహారం, నీరు పంపిణీ

వీడియో క్యాప్షన్, ఉబర్ సాంకేతిక సాయంతో యుద్ధంలో చిక్కుకున్న ప్రజలకు సేవలందిస్తున్న UN వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్

యుక్రెయిన్ యుద్ధం కారణంగా లక్షలాది మంది ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. వారికి నిత్యావసరాలు కూడా అందడం లేదు.

ఈ మానవీయ సంక్షోభానికి పరిష్కారం కోసం.. ప్రజలకు ఆహారం, నీటి అందించేందుకు యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్‌తో జత కట్టింది ఉబర్.

ఈ పంపిణీ సక్రమంగా జరిగేందుకు ఓ కొత్త సాఫ్ట్‌వేర్‌ను కూడా రూపొందించింది ఉబర్. దీనిని డినిప్రోలో ప్రయోగించింది.

బీబీసీ టెక్ ఎడిటర్ జోయ్ క్లెయిమెన్ అందిస్తున్న కథనం.

యుక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాలకు ఆహారం, నీరు దొరకడం చాలా కష్టమవుతోంది.

కానీ యుద్ధ క్షేత్రంలో పెద్ద సైజు డెలివరీ వాహనాలను శత్రువు లక్ష్యంగా చేసుకోవచ్చు.

అందుకే.. అత్యవసరాల పంపిణీకి చిన్న వాహనాలను ఉపయోగించాలని నిర్ణయించింది యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్‌.

ఉబర్ డ్రైవర్లను, సాఫ్టవేర్‌ను ఉపయోగించి తన సొంత డెలివరీ నెట్‌వర్క్‌ను నిర్మించుకుంటోంది.

పేరు పొందిన బ్రాండ్లు, సూపర్ మార్కెట్లు తమ డెలివరీ వ్యవస్థను ఉపయోగించాలనుకుంటే ఉబర్ ఛార్జ్ చేస్తుంది. కానీ మానవీయ దృక్పథంతో ఉబర్ మొదటిసారిగా ఈ వ్యవస్థను ఉచితంగా అందజేసింది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్‌ కోసం దీనిని రూపొందించారు.

ఆహారం కోసం ప్రజలు నెలల తరబడి వేచి ఉండాల్సిన పని లేదు. వారికి త్వరగా ఆహారం అందాలి. ఆహారం లేకుండా వారాల తరబడి ప్రజలు ఉండలేరు. కాబట్టి ఉబర్ టెక్నాలజీని, పంపిణీ వ్యవస్థను, రవాణా పద్ధతులను ఉపయోగించుకోవడం అంటే ఇదొక సక్సెస్ స్టోరీ అని చెప్పుకోవచ్చు.

గత రెండేళ్లుగా ఉబర్ కొన్ని చిక్కుల్ని ఎదుర్కొంది. కోవిడ్ వల్ల తలెత్తిన సంక్షోభం ఒకటైతే, దాని డ్రైవర్ పాలసీలపై తలెత్తిన వివాదం మరొకటి.

నిరుటితో పోలిస్తే దాని షేర్ల విలువ దాదాపు సగానికి పడిపోయింది.

కానీ పంపీణీలో విస్తరణను చూస్తుంటే అది గాడిలో పడుతున్నట్టు అనిపిస్తోంది.

యుక్రెయిన్‌లో 30 లక్షల మందికి జూన్ నెలాఖరుకల్లా ఆహారం, నగదు అందించడమే లక్ష్యం పెట్టుకుంది వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్‌.

ఉబర్ లాంటి నెట్‌వర్క్ మిగిలిన నగరాలకు విస్తరిస్తే ప్రజలకు అవసరమైన సహాయం అందించడంలో అది కీలక పాత్ర పోషించగలుగుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)