పాకిస్తాన్‌: మోడలింగ్ చేస్తున్న అక్క.. ‘పరువు కోసం’ కాల్చి చంపిన తమ్ముడు

    • రచయిత, షుమైలా ఖాన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి, ఇస్లామాబాద్ నుంచి

పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్సు ఓక్రాలో యువ ఫ్యాషన్ మోడల్ అయిన సిద్రా ఖాలిద్‌ను ఆమె తమ్ముడు హంజా ఖాలిద్ హత్య చేశారు. ‘పరువు కోసం’ తన సోదరి సిద్రాను హత్య చేసినట్లు హంజాపై ఆరోపణలు వచ్చాయి.

ఓక్రాలోని రెనాలా సిటీ ఎస్‌హెచ్‌ఓ ఇన్‌స్పెక్టర్ జావేద్ ఖాన్ ఈ కేసు వివరాలను చెప్పారు. ''సిద్రా ఖాలిద్‌కు మోడలింగ్ అంటే ఆసక్తి. ఆమె ఫైసలాబాద్‌లో మోడలింగ్ చేశారు. రంజాన్ మాసంలో ఓక్రాలోని తన ఇంటికి వచ్చారు. ఈద్ తర్వాత మళ్లీ మోడలింగ్ పని కోసం వెళ్లబోతున్న సమయంలో తన కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మోడలింగ్‌ను వదిలిపెట్టాలని ఆమెపై కుటుంబసభ్యుల నుంచి చాలా ఒత్తిడి ఉండేది. హత్య జరగడానికి కూడా ఇదే కారణం. సిద్రా ఖాలిద్ తల్లి ఫిర్యాదు మేరకు ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశాం'' అని ఆయన వెల్లడించారు.

22 ఏళ్ల సిద్రా ఖాలిద్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. సిద్రా తల్లిదండ్రులకు మొత్తం ఐదుగురు సంతానం. అందులో నలుగురు అమ్మాయిలు కాగా ఒకరు అబ్బాయి. నలుగురు అక్కల తర్వాత జన్మించిన 20 ఏళ్ల హంజా ఈ హత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

''మోడలింగ్ వదిలిపెట్టి, ఇంటిపట్టునే ఉండాలంటూ సిద్రాను కుటుంబసభ్యులు ఎప్పటినుంచో అడుగుతున్నారు. కానీ, ఆమెకు మోడలింగ్‌ను వదలడం ఇష్టం లేదు. ఇదే ఆమె తమ్ముడు హంజాతో వాగ్వాదానికి కారణమైంది'' అని జావెద్ ఖాన్ చెప్పారు.

ఈ గొడవ జరుగుతున్నప్పుడు వారి తండ్రి కూడా అక్కడే ఉన్నారు. ఆయన కూడా సిద్రా వెళ్లకుండా ఆపేందుకు ప్రయత్నించారు. కానీ వారి మాటను సిద్రా నిరాకరించడంతో, తండ్రి పిస్టల్‌ను తీసుకొని హంజా కాల్చారు. బుల్లెట్, సిద్రా ఎడమ కన్ను పైభాగంలో తగలడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి హత్యకు ఉపయోగించిన ఆయుధంతో పాటు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు హంజా ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఈ పరువు హత్యలో ఇతర కుటుంబ సభ్యుల ప్రమేయం కూడా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.

పాకిస్తాన్‌లో ‘పరువు హత్య’లు

పరువు పేరుతో పాకిస్తాన్‌లో ప్రతీ ఏడాది వెయ్యి మంది మహిళలు హత్యకు గురవుతున్నారని 2021 నివేదికలో హ్యుమన్ రైట్స్ వాచ్ అంచనా వేసింది. అయితే, పాకిస్తాన్‌లో గత ఏడాది 478 ‘పరువు హత్యలు’ నమోదు అయ్యాయని ఇటీవల ప్రచురించిన వార్షిక నివేదికలో పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ పేర్కొంది. ప్రతీ కేసు పోలీసుల వద్దకు వచ్చే అవకాశం లేనందున ఈ హత్యల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని మహిళా హక్కుల కోసం పనిచేసే సంస్థలు చెబుతున్నాయి.

2021లో పాక్‌లో జరిగిన మహిళల హత్యలను దృష్టిలో ఉంచుకుని ఎమర్జెన్సీ విధించాలని మహిళా హక్కుల కార్యకర్త నూర్ డిమాండ్ చేస్తున్నట్లు పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ తన నివేదికలో పేర్కొంది. ఇస్లామాబాద్‌కు చెందిన నూర్ మకద్దమ్ హత్యను ఈ నివేదికలో ప్రస్తావించారు.

కందీల్ బలోచ్ హత్య తర్వాత వాదోపవాదాలు

పాకిస్తాన్‌లో పరువు హత్యల పేరుతో మహిళల హత్యలు పెరిగిపోయాయి. దేశవ్యాప్తంగా ఈ అంశంపై చర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ హత్య కేసుల్లో మృతుల కుటుంబ సభ్యులు ప్రమేయం ఉంటుంది. అంటే భర్త, తండ్రి, కొడుకు, సోదరుడు, బంధువు, మామ వీటిలో భాగం అవుతున్నారు. వారి ఇష్టానుసారం పెళ్లి చేసుకోవడం దగ్గర నుంచి మొబైల్ ఫోన్లు ఉపయోగించడం, సోషల్ మీడియాలో తమ ఫోటోలు పెట్టడం లాంటి అంశాలు ఈ హత్యలకు కారణం అవుతున్నాయి.

పాకిస్తాన్‌లో నేటికీ సినిమాలు, టీవీల్లో పనిచేయడం, మోడలింగ్ చేయడం వంటి పనులు అమ్మాయిలకు తగినవి కాదని భావిస్తున్నారు.

సిద్రా ఖాలిద్ తరహాలోనే 2016లో మోడల్ కందీల్ బలోచ్‌ను ఆమె సోదరుడు వసీం ఖాన్ గొంతు కోసి హత్య చేశారు. సోషల్ మీడియాలో కందీల్ బలోచ్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. కందీల్ బలోచ్ హత్య తర్వాత పాకిస్తాన్ పార్లమెంట్ కొత్త చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం, పరువు హత్యల కేసుల్లో మృతుల కుటుంబ సభ్యులు క్షమించినప్పటికీ నిందితులు శిక్ష నుంచి తప్పించుకోలేరని చట్టం పేర్కొంది.

ఈ కొత్త చట్టం ఇస్లామిక్ చట్టాలకు విరుద్ధమని పాక్‌లోని కొందరు మతపెద్దలు అభివర్ణించారు. అయినప్పటికీ దీన్ని పాకిస్తాన్ ఉభయ సభలు ఆమోదించాయి. పాకిస్తాన్ పౌర సమాజం ఈ చట్టాన్ని హర్షించింది.

కందీల్ బలోచ్ హత్య కేసులో ఆమె సోదరుడు వసీం ఖాన్‌కు మూడేళ్ల క్రితం జీవిత ఖైదు విధించారు. కానీ, ఈ ఏడాది ఫిబ్రవరిలో లాహోర్ హైకోర్టు ఆయనను విడుదల చేసింది.

సాక్షులు వాంగ్మూలాలను ఉపసంహరించుకోవడం, సంబంధిత పక్షాల మధ్య పరస్పర ఒప్పందం కారణంగా ఆయన విడుదలయ్యారు. కందీల్ బలోచ్‌కు న్యాయం కోసం పోరాడుతోన్న సామాజిక కార్యకర్తలు, లాహోర్ హైకోర్టు నిర్ణయంతో చాలా నిరాశ చెందారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)