టీ20 ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియా.. న్యూజీలాండ్‌ను ఓడించి తొలిసారి పొట్టి కప్ గెలిచిన ఐదుసార్లు వన్డే ప్రపంచకప్ విజేత

  • ఐదుసార్లు వన్డే ప్రపంచకప్ విజేత అయిన ఆస్ట్రేలియా తొలిసారి టీ20 ప్రపంచకప్ గెలిచింది.
  • న్యూజీలాండ్ జట్టు వరుసగా మూడు ఐసీసీ ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఓడిపోయింది. 2015 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఆస్ట్రేలియా మీద, 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఇంగ్లండ్‌పైన ఓడిపోయిన న్యూజీలాండ్ ఇప్పుడు టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై ఓడిపోయింది. ఈ మూడుసార్లు ఆ జట్టు మొదట బ్యాటింగ్ చేయడం గమనార్హం.
  • మిచెల్ మార్ష్‌కు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఇదే అత్యధిక స్కోరు. ఈ మ్యాచ్‌లో మార్ష్ 50 బంతుల్లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 77 పరుగులు చేశాడు. మార్ష్‌కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
  • ఈ సిరీస్‌లో 289 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది.
  • టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఒక టీమ్ తరపున రెండు అర్ధ సెంచరీలు నమోదు కావటం కూడా ఇదే తొలిసారి. ఆస్ట్రేలియా బ్యాటర్లు డేవిడ్ వార్నర్ (38 బంతుల్లో 53 పరుగులు), మిచెల్ మార్ష్ (50 బంతుల్లో 77 పరుగులు) చేశారు.
  • ఈ మ్యాచ్‌లో 85 పరుగులు చేసిన కేన్ విలియమ్సన్ ప్రపంచకప్ ఫైనల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. మార్లోన్ శామ్యూల్స్ (85 నాటౌట్)కూడా గతంలో ఫైనల్ మ్యాచ్‌లో ఇదే స్కోరు సాధించాడు.
  • కేన్ విలియమ్సన్ (48 బంతుల్లో పది ఫోర్లు, మూడు సిక్సర్లతో 85 పరుగులు) టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సాధించిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు.

చాంపియన్ ఆస్ట్రేలియా, ఫైనల్లో 8 వికెట్ల తేడాతో న్యూజీలాండ్‌పై గెలుపు

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ టైటిల్‌ ఆస్ట్రేలియా వశమైంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో న్యూజీలాండ్‌పై గెలుపొంది తొలిసారి టీ20 వరల్డ్ కప్‌ను అందుకుంది.

173 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 18.5 ఓవర్లలో 2 వికెట్లకు కోల్పోయి ఛేదించింది.

ఆస్ట్రేలియా తరఫున డేవిడ్ వార్నర్ (38 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), మిచెల్ మార్ష్ (50 బంతుల్లో 77; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీలు చేయగా, చివర్లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ (18 బంతుల్లో 28 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు

మార్ష్, మ్యాక్స్‌వెల్ అజేయంగా మూడో వికెట్‌కు 39 బంతుల్లో 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

బౌల్ట్‌కు 2 వికెట్లు దక్కాయి.

అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 172 పరుగులు చేసింది.

కెప్టెన్ కేన్ విలియమ్సన్ (48 బంతుల్లో 85; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడుగా ఆడాడు.

ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హాజెల్ వుడ్ 3 వికెట్లు తీయగా, ఆడమ్ జంపాకు ఒక వికెట్ దక్కింది.

విజయ సమీకరణం 30 బంతుల్లో 37 పరుగులు

చివరి 30 బంతుల్లో విజయానికి 37 పరుగులు చేయాల్సి ఉండగా, 16వ ఓవర్లో మ్యాక్స్‌వెల్ 4,6తో 13 పరుగులు రాబట్టాడు.

17వ ఓవర్లో బౌలింగ్ చేసిన బౌల్ట్ 10 పరుగులు ఇచ్చాడు. ఈ ఓవర్ రెండో బంతిని మార్ష్ బౌండరీకి తరలించాడు.

చివరి బంతికి మార్ష్ అవుటయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్నాడు. బౌల్ట్ వేసిన బంతిని నేరుగా ఆడిన మార్ష్ బౌలర్‌కే క్యాచ్ ఇచ్చాడు. కానీ బౌల్ట్ దాన్ని నేర్పుగా ఒడిసి పట్టలేకపోయాడు. బౌల్ట్ చేతికి తగిలిన బంతి కిందపడిపోయింది.

ఇక చివరి 18 బంతుల్లో 14 పరుగులు చేయాల్సి ఉండగా, 18వ ఓవర్ బౌలింగ్ చేసిన మిల్నే కేవలం మూడే పరుగులిచ్చి ఆస్ట్రేలియా విజయాన్ని కాస్త ఆలస్యం చేశాడు.

కానీ 19 ఓవర్లో మార్ష్, మ్యాక్స్‌వెల్ చెరో బౌండరీ సహాయంతో విజయానికి కావాల్సిన 11 పరుగులు సాధించి లాంఛనాన్ని పూర్తి చేశారు.

ఐదో బంతిని రివర్స్ స్వీప్ చేసిన మ్యాక్స్‌వెల్ బౌండరీతో ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించాడు.

వార్నర్ అవుట్, 15 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్: 136/2

11వ ఓవర్లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ రెండు సిక్సర్లు బాదారు. నీషమ్ వేసిన ఈ ఓవర్ తొలి బంతిని మార్ష్ ఫైన్ లెగ్ దిశగా సిక్సర్ కొట్టగా, నాలుగో బంతికి వార్నర్ డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ బాది 34 బంతుల్లోనే అర్ధసెంచరీ అందుకున్నాడు. దీంతో ఈ ఓవర్లో 15 పరుగులు లభించాయి.

అంతర్జాతీయ టీ20ల్లో డేవిడ్ వార్నర్‌కు ఇది 22వ అర్ధసెంచరీ.

12వ ఓవర్లో శాంట్నర్ ఒక బౌండరీ ఇచ్చాడు. ఈ ఓవర్లో ఆస్ట్రేలియా 9 పరుగులు చేయగలిగింది.

13వ ఓవర్లో బౌలింగ్ చేసిన బౌల్ట్ అద్భుతంగా డేవిడ్ వార్నర్‌ (38 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్సర్లు)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో రెండో వికెట్‌కు 59 బంతుల్లో 92 భాగస్వామ్యం ముగిసింది.

ఈ ఓవర్లో 3 పరుగులే ఇచ్చిన బౌల్ట్ ఆస్ట్రేలియా జోరుకు కళ్లెం వేశాడు.

కానీ తర్వాతి ఓవర్లో ఇశ్ సోధి 16 పరుగులు ఇచ్చాడు. అతని ఓవర్లో మార్ష్ ఒక సిక్సర్, ఒక బౌండరీ బాదాడు. పైగా 3 వైడ్లు వేయడంతో అదనంగా మరో 3 పరుగులు లభించాయి. ఈ ఓవర్లో అతను మొత్తం 9 బంతులు వేశాడు.

15వ ఓవర్లో మాక్స్‌వెల్ వరుసగా రెండు ఫోర్లు బాదాడు. మిల్నే ఈ ఓవర్లు 11 పరుగులు సమర్పించుకున్నాడు.

క్రీజులో మిచెల్ మార్ష్ (61 బ్యాటింగ్), మ్యాక్స్‌వెల్ (10 బ్యాటింగ్) ఉన్నారు. ఆస్ట్రేలియా విజయానికి 30 బంతుల్లో 37 పరుగులు చేయాల్సి ఉంది.

ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ 34 బంతుల్లో అర్థ సెంచరీ చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు, మూడు సిక్స్‌లు ఉన్నాయి. సిక్స్‌తోనే వార్నర్ అర్థ సెంచరీ చేయడం గమనార్హం.

10 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్: 82/1

తన తొలి ఓవర్‌లో అధికంగా పరుగులిచ్చిన మిల్నే, ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో అద్భుతంగా పుంజుకున్నాడు. కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు.

ఇశ్ సోధీ వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో సింగిల్స్ సహాయంతో 7 పరుగులు చేశారు.

ఎనిమిదో ఓవర్ రెండో బంతిని మిచెల్ మార్ష్ స్క్వేర్ లెగ్ దిశగా సిక్సర్ బాదాడు. మిగతా బంతుల్లో సింగిల్స్‌కే పరిమితం కావడంతో 10 పరుగులు చేయగలిగింది.

తొమ్మిదో ఓవర్‌లో వార్నర్ బ్యాట్ ఝళిపించాడు. రెండో బంతిని లాంగాన్ దిశగా ఫోర్ బాదిన అతను చివరి రెండు బంతుల్లో వరుసగా 4, 6తో చెలరేగాడు. దీంతో ఈ ఓవర్లో 17 పరుగులు లభించాయి.

పదో ఓవర్ బౌలింగ్ చేసిన శాంట్నర్ 5 పరుగులే ఇచ్చాడు. ఈ ఓవర్లో ఒక్క బౌండరీ కూడా నమోదు కాలేదు. దీంతో 10 ఓవర్లకు ఆస్ట్రేలియా 82/1తో నిలిచింది. క్రీజులో డేవిడ్ వార్నర్ (45 బ్యాటింగ్), మిచెల్ మార్ష్ (30 బ్యాటింగ్) ఉన్నారు.

5 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్: 40/1

173 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలో దిగిన ఆస్ట్రేలియా ఆరంభంలోనే కెప్టెన్ ఫించ్ (7 బంతుల్లో 5; 1 ఫోర్) వికెట్ కోల్పోయింది.

ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్ బౌలింగ్ చేసిన బౌల్ట్ కేవలం ఒక పరుగు మాత్రమే ఇచ్చాడు.

సౌతీ వేసిన రెండో ఓవర్లో వార్నర్ వరుసగా రెండు బౌండరీలు బాదడంతో 10 పరుగులు లభించాయి.

మూడో ఓవర్‌లో మళ్లీ బంతినందుకున్న బౌల్ట్ వికెట్ తీయడంతో పాటు కేవలం 4 పరుగులే ఇచ్చాడు. మూడో బంతికి మిచెల్ క్యాచ్ పట్టడంతో ఆరోన్ ఫించ్ అవుటయ్యాడు.

అయితే తర్వాతి ఓవర్‌లో ఆస్ట్రేలియా పుంజుకుంది. మిల్నే వేసిన ఈ ఓవర్‌లో తొలి బంతిని సిక్సర్‌గా బాదిన మిచెల్ మార్ష్ తర్వాతి రెండు బంతుల్ని బౌండరీకి తరలించాడు. తర్వాత మూడు సింగిల్స్ రావడంతో ఈ ఓవర్‌లో ఆస్ట్రేలియా 15 పరుగులు రాబట్టింది.

ఐదో ఓవర్‌లో సౌతీ ఒక సిక్సర్ ఇవ్వడంతో 10 పరుగులు వచ్చాయి. క్రీజులో డేవిడ్ వార్నర్ (18 బ్యాటింగ్), మిచెల్ మార్ష్ (17 బ్యాటింగ్) ఉన్నారు.

న్యూజీలాండ్: 172/4

స్టార్క్ వేసిన 16వ ఓవర్లో విలియమ్సన్ విజృంభించాడు. అతని ఓవర్‌లో ఏకంగా 22 పరుగులు పిండుకున్నాడు. తొలి రెండు బంతుల్లో రెండు ఫోర్లు బాదిన కేన్... మూడో బంతికి డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ దిశగా సిక్సర్‌తో ఆకట్టుకున్నాడు. మళ్లీ చివరి రెండు బంతుల్లో మరో రెండు బౌండరీలతో కదం తొక్కాడు.

ఇంటర్నేషనల్ టీ20ల్లో స్టార్క్‌కు ఇదే అత్యంత చెత్త ఓవర్. వ్యక్తిగత స్కోరు 21 పరుగుల వద్ద (21 బంతుల్లో) కేన్ విలియమ్సన్ క్యాచ్‌ను హేజెల్‌వుడ్ వదిలేశాడు. ఆ తర్వాత కేన్ 26 బంతుల్లోనే 64 పరుగులు సాధించాడు.

ఈ మ్యాచ్‌లో స్టార్క్ బౌలింగ్‌లో విలియమ్సన్ 7 ఫోర్లు, 1 సిక్స్ బాదాడు. 12 బంతులు ఎదుర్కొని 39 పరుగులు సాధించాడు.

స్టార్క్ భారీగా పరుగులు సమర్పించుకోగా, 17వ ఓవర్ వేసిన కమిన్స్ పొదుపుగా బౌలింగ్ చేశాడు. అతని బౌలింగ్‌లో ఒక్క బౌండరీ కూడా రాలేదు. కేవలం 8 పరుగులు మాత్రమే లభించాయి.

18వ ఓవర్ బౌలింగ్‌కు వచ్చిన హేజెల్‌వుడ్ 2 వికెట్లతో న్యూజీలాండ్‌ను కట్టడి చేశాడు. రెండో బంతికి ఫిలిప్స్ (17 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్), నాలుగో బంతికి కేన్ విలియమ్సన్ (48 బంతుల్లో 85; 10 ఫోర్లు, 3 సిక్సర్లు)లను పెవిలియన్ పంపాడు. దీంతో ఈ ఓవర్లో 5 పరుగులే వచ్చాయి.

85 పరుగులు చేసిన విలియమ్సన్ ప్రపంచకప్ ఫైనల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. మార్లోన్ శామ్యూల్స్ (85 నాటౌట్)కూడా గతంలో ఫైనల్ మ్యాచ్‌లో ఇదే స్కోరు సాధించాడు.

విలియమ్సన్, ఫిలిప్స్ మూడో వికెట్‌కు 37 బంతుల్లోనే 68 పరుగులు జోడించారు.

క్రీజులోకి టీమ్ సీఫెర్ట్, జేమ్స్ నీషమ్ వచ్చారు. 19వ ఓవర్లో నీషమ్ ఒక సిక్సర్ బాదాడు. తర్వాత ఇద్దరు సింగిల్స్, డబుల్స్‌తో కలిపి 13 పరుగులు రాబట్టారు.

ఇక చివరి ఓవర్లో 10 పరుగులే రావడంతో న్యూజీలాండ్ 172/4 స్కోరు సాధించింది. స్టార్క్ వేసిన ఈ ఓవర్‌లో కేవలం ఒక బౌండరీ మాత్రమే లభించింది. నీషమ్ (13 నాటౌట్), సీఫెర్ట్ (8 నాటౌట్) రాణించారు.

టీ20 ప్రపంచకప్‌ ఫైనల్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా కేన్ విలియమ్సన్ రికార్డు సృష్టించాడు.

టీ20 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజీలాండ్ చేసిన 172 పరుగులే అత్యధిక స్కోరు.

తొలి 10 ఓవర్లలో 57 పరుగులు చేసిన కివీస్ చివరి 10 ఓవర్లలో 115 పరుగులు సాధించింది.

15 ఓవర్లకు న్యూజీలాండ్ స్కోర్: 114/2

స్టార్క్ వేసిన 11వ ఓవర్లో విలియమ్సన్ వరుసగా 3 బౌండరీలు బాదాడు. ఇందులో ఒకటి నోబాల్ కావడంతో ఈ ఓవర్లో మరో బంతి అదనంగా లభించింది. దీంతో మొత్తం 19 పరుగులు లభించాయి.

అయితే 12వ ఓవర్ తొలి బంతికే మార్టిన్ గప్టిల్ (35 బంతుల్లో 28; 3 ఫోర్లు) అవుటయ్యాడు. జంపా బౌలింగ్‌లో డీప్ మిడ్ వికెట్‌లో స్టొయినిస్ క్యాచ్ పట్టడంతో రెండో వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

సింగిల్స్ సహాయంతో ఈ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి.

13వ ఓవర్లో విలియమ్సన్ మరింత చెలరేగిపోయాడు. ఈ ఓవర్లో మ్యాక్స్‌వెల్ బౌలింగ్ చేయగా మూడో బంతికి డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ బాదాడు. తర్వాతి బంతికి కూడా మరో సిక్సర్ బాదిన విలియమ్సన్ 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో అర్ధసెంచరీ చేశాడు. ఈ ఓవర్‌లో 16 పరుగులు వచ్చాయి.

14వ ఓవర్లో కమిన్స్ కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇదే ఓవర్లో న్యూజీలాండ్ స్కోరు 100 పరుగులు దాటింది.

15వ ఓవర్‌ను ఫిలిప్స్ సిక్సర్‌తో ప్రారంభించాడు. తర్వాత జంపా కాస్త కట్టడి చేసినప్పటికీ ఐదో బంతికి కవర్స్ దిశగా బౌండరీ బాదడంతో 12 పరుగులు వచ్చాయి.

క్రీజులో గ్లెన్ ఫిలిప్స్ (15 బ్యాటింగ్), విలియమ్సన్ (55 బ్యాటింగ్) ఉన్నారు.

10 ఓవర్లకు న్యూజీలాండ్ స్కోర్: 57/1

డరైల్ వికెట్ కోల్పోవడంతో ఆత్మరక్షణలో పడిన న్యూజీలాండ్‌ను హేజెల్‌వుడ్ మరింత కట్టడి చేశాడు.

అతను వేసిన ఆరో ఓవర్‌లో 5 డాట్ బాల్స్ రావడంతో పాటు కేవలం 2 పరుగులు వచ్చాయి.

ఏడో ఓవర్‌లో సింగిల్స్ సహాయంతో 5 పరుగులు రాగా, తర్వాతి ఓవర్‌లో జంపా కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

తొమ్మిదో ఓవర్లో రెండు వరుస బౌండరీలు బాదిన విలియమ్సన్ జోరు పెంచాడు. దీంతో 11 పరుగులు లభించాయి.

జంపా వేసిన పదో ఓవర్లో 6 సింగిల్స్ రావడంతో జట్టు స్కోరు 10 ఓవర్లకు 57/1గా నిలిచింది. క్రీజులో విలియమ్సన్ (18 బ్యాటింగ్), మార్టిన్ గప్టిల్ (18 బ్యాటింగ్) ఉన్నారు.

5 ఓవర్లకు న్యూజీలాండ్ స్కోరు: 30/1

తొలి ఐదు ఓవర్లలోపే న్యూజీలాండ్ తొలి వికెట్‌ను కోల్పోయింది. సెమీఫైనల్ హీరో డరైల్ మిచెల్ (8 బంతుల్లో 11; 1 సిక్స్)ను అవుట్ చేసి ఆస్ట్రేలియా శుభారంభం చేసింది.

హేజెల్ వుడ్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ ఐదో బంతికి వికెట్ కీపర్ వేడ్‌కు క్యాచ్ ఇచ్చి మిచెల్ అవుటయ్యాడు.

అంతకుముందే వ్యక్తిగత స్కోరు 10 పరుగుల వద్ద మార్టిన్ గప్టిల్ అవుటయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్నాడు.

ఆస్ట్రేలియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. దీంతో 5 ఓవర్లలోపే 14 డాట్ బాల్స్ నమోదయ్యాయి.

మిచెల్ తర్వాత క్రీజులోకి వచ్చిన విలియమ్సన్ క్రీజులో కుదురుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. దుబాయ్ వేదికగా జరిగే ఫైనల్ పోరులో ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి.

ఈ మేరకు ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలుపొందింది. కెప్టెన్ ఫించ్ బౌలింగ్ వైపు మొగ్గు చూపగా, న్యూజీలాండ్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు దాదాపు టాస్ గెలిచిన జట్టునే విజయం వరించింది. ఈ మ్యాచ్‌లో ఏం జరగనుందో చూడాలి.

సెమీస్‌లో బరిలో దిగిన జట్టుతోనే ఆస్ట్రేలియా ఫైనల్‌కు సిద్ధమైంది. న్యూజీలాండ్ జట్టులో ఒక మార్పు చోటు చేసుకుంది.

గాయపడిన డేవాన్ కాన్వే స్థానంలో సీఫెర్ట్‌ను తీసుకున్నట్లు కెప్టెన్ కేన్ విలియమ్సన్ వెల్లడించాడు.

ఒకవేళ తాను టాస్ గెలిచినా, బౌలింగ్‌కే మొగ్గు చూపేవాడినని కేన్ స్పష్టం చేశాడు. ''మంచు ప్రభావం గురించి చెప్పలేను. కానీ వీలైనంత మేరకు బ్యాట్‌తో రాణించి, ప్రత్యర్థికి మంచి లక్ష్యాన్ని నిర్దేశించాలనుకుంటున్నాం'' అని వ్యాఖ్యానించాడు.

ఇప్పటివరకు ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ జట్లు టీ20 ప్రపంచకప్‌ను గెలుపొందలేదు. ఇరు జట్లు ఈ మ్యాచ్‌లో గెలుపొంది తొలి టైటిల్‌ను గెలుచుకోవాలని ఆశపడుతున్నాయి.

ఆస్ట్రేలియా గెలిస్తే తట్టుకోలేం

ఆస్ట్రేలియా జట్టు ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ను 5 సార్లు, చాంపియన్స్ ట్రోఫీని రెండు సార్లు గెల్చుకుంది. కానీ టీ20 ప్రపంచకప్‌ను వారు ఇప్పటివరకు గెలవలేకపోయారు. 2010లో ఇంగ్లండ్ టైటిల్‌ను నెగ్గగా, ఆసీస్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

భారత్‌లాగే ఇంగ్లండ్ కూడా ఈసారి టైటిల్ ఫేవరెట్‌గానే బరిలో దిగింది. కానీ ఫైనల్‌కు చేరుకోలేకపోయింది.

ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే యాషెస్ సిరీస్‌ ప్రారంభానికి ఇంకా సరిగ్గా 24 రోజులే మిగిలి ఉంది. ఆదివారం టీ20 ప్రపంచకప్ ఫైనల్ ముగియగానే... యాషెస్ సిరీస్‌లో పాల్గొనే ఆసీస్, ఇంగ్లండ్ ఆటగాళ్లంతా ఒకే విమానంలో సోమవారం ఆస్ట్రేలియా బయల్దేరతారు.

యాషెస్ సిరీస్ ఆడనున్న ఇంగ్లండ్ బౌలర్ మార్క్‌వుడ్, బీబీసీ గుడ్ పేస్ అనే రేడియో కార్యక్రమంలో మాట్లాడుతూ ఆస్ట్రేలియా గెలవడాన్ని తట్టుకోలేనని అన్నారు.

''నేను ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ గెలవాలని అనుకోవట్లేదు'' అని మార్క్‌వుడ్ అన్నాడు.

''వారి కళ్లలోకి చూస్తూ 'బాగా ఆడారు' అని చెప్పవచ్చు. కానీ వారితో యాషెస్ సిరీస్ ఆడటం కోసం అక్కడికి వెళ్లబోతున్నప్పడు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉండాలి. మేం అక్కడికి చేరుకోకముందే వారు టైటిల్‌ను మా ముందే పట్టుకొని తిరుగుతుంటే ఎలా ఉంటుంది'' అని మార్క్‌వుడ్ అన్నాడు.

వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ డేవాన్ కాన్వే లేకుండానే కివీస్ ఫైనల్ బరిలో దిగనుంది. ఇంగ్లండ్‌పై విజయం సాధించిన అనంతరం గెలుపు సంబరాల్లో భాగంగా కాన్వే తన బ్యాట్‌కు పంచ్ ఇచ్చి చేతిని గాయపర్చుకున్నాడు.

ఆయన స్థానంలో టిమ్ సీఫెర్ట్ జట్టులోకి రానున్నట్లు కోచ్ గ్యారీ స్టీడ్ సూచించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)