అఫ్గానిస్తాన్‌: పంజ్‌షీర్‌లో హోరాహోరీ పోరాటం, లోయను స్వాధీనం చేసుకున్నామన్న తాలిబాన్లు

అఫ్గానిస్తాన్‌లోని పంజ్‌షీర్‌ లోయలో తాలిబాన్లు, ప్రతిఘటన ఫైటర్ల మధ్య హోరాహోరీ పోరాటం జరుగుతోంది.

కాల్పులతో లోయ దద్దరిల్లుతోంది. ఈ కాల్పుల్లో ఇరువైపులా వందలాది మంది చనిపోయినట్లు చెబుతున్నారు.

ఇప్పటి వరకు తాలిబాన్ల వశంకాని ఏకైక ప్రాంతం పంజ్‌షీర్ మాత్రమే. దాన్ని స్వాధీనం చేసుకోవడానికి తాలిబాన్లు విఫల యత్నం చేస్తున్నారు. పంజ్‌షీర్ ఫైటర్లు తాలిబాన్లకు గట్టిగా బదులిస్తున్నారు.

పంజ్‌షీర్ నుంచి పారిపోయినట్లు వస్తున్న వార్తలను అఫ్గానిస్తాన్ మాజీ ఉపాధ్యక్షుడు, ప్రతిఘటన నాయకుల్లో ఒకరైన అమ్రుల్లా సాలేహ్ ఖండించారు. పరిస్థితి మాత్రం క్లిష్టంగా ఉందని చెప్పారు.

తాలిబాన్లు తమపై దాడి చేశారని, కాల్పుల్లో ఇరువైపులా మరణాలు సంభవించాయని, అయితే, ఎట్టిపరిస్థితుల్లో లొంగిపోయే ప్రసక్తే లేదని బీబీసీకి పంపిన వీడియోలో అమ్రుల్లా సాలేహ్ చెప్పారు.

పంజ్‌షీర్‌ లోయను స్వాధీనం చేసుకున్నామని తాలిబాన్లు చెప్పినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది.

అయితే, అక్కడున్న ప్రతిఘటన ఫైటర్లు మాత్రం దీన్ని ఖండిస్తున్నారు.

తాలిబాన్లను వెనకడుగు వేసేలా చేశామని పంజ్‌షీర్‌ లోయలో తాలిబాన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న నేషనల్ రిసిస్టెన్స్ ఫ్రంట్ - ఎన్ఆర్ఎఫ్ ఫైటర్ల అధికార ప్రతినిధి అలి నజారీ బీబీసీతో చెప్పారు.

కొన్ని వందల మంది తాలిబాన్లు చిక్కుకున్నారు. వాళ్ల దగ్గర మందు గుండు సామాగ్రి అయిపోతోంది. సరెండర్ కావడానికి వాళ్లు ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారు అని ఆయన తెలిపారు.

అయితే, పంజ్‌షీర్‌పై పట్టు సాధించామని తాలిబాన్లు ప్రకటించుకున్నారు.

"అల్లా దయ వల్ల మొత్తం అఫ్గానిస్తాన్ మా చేతుల్లోకి వచ్చింది. పంజ్‌షీర్‌లో సమస్యలు సృష్టిస్తున్న వాళ్లు ఓడిపోయారు. ఆ ప్రాంతం ఇప్పుడు మా ఆధీనంలో ఉంది" అని తాలిబాన్ కమాండర్ ఒకరు రాయిటర్స్ వార్తా సంస్థకు చెప్పారు.

అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్లను ఎదిరించి నిలిచిన ఒకే ఒక ప్రాంతం పంజ్‌షీర్.

ఆ దేశంలోని అతిచిన్న ప్రావిన్సుల్లో ఇది ఒకటి. ఇక్కడ లక్షా 50వేల నుంచి 2 లక్షల మంది వరకు ఉంటారు.

పంజ్‌షీర్ గురించి మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)