పాకిస్తాన్: ‘ఇంట్లో ఉంటే బురఖా వేస్తారు.. ఇంటి నుంచి బయటకు వస్తే..’

వీడియో క్యాప్షన్, అత్యంత దీన స్థితి నుంచి ప్రముఖ పెయింటర్‌గా ఎదిగిన ఒంటరి మహిళ కథ..

రోజీనా నాజ్ ఇద్దరు పిల్లల ఒంటరి తల్లి. ఇరవయ్యేళ్ల కింద.. ఓ పాతసామాన్ల గుట్ట మీద ఉన్న ఒక పాడైపోయిన బస్సు రోజీనాకు, ఆమె బిడ్డలకు ఇల్లయింది. ఇప్పుడామె ఓ పేరున్న ఆర్టిస్ట్. ఉస్తాద్ రోజీ ఖాన్ అని పిలుస్తున్నారామెను. కరాచీ శివార్లలో ట్రక్కులు, బస్సులకు పెయింట్ చేస్తుంటారు. పాకిస్తాన్‌లో ప్రధానంగా పురుషులే చేసే ఈ పనిలో రోజీనా ఎలా రాణించారు? కరాచీ నుంచి షుమాయిలా ఖాన్ అందిస్తున్న కథనం.

నా పేరు రోజీనా ఖాన్. జనం నన్ను రోజీ ఉస్తాద్ అంటారు. నేను వాహనాలకు పెయింటింగ్ చేస్తుంటా. పూలు, ఆకులు బొమ్మలు వేయటం, మ్యాపులు, మోనోగ్రాములు గీయటం, బోర్డు బ్యానర్లు రాయటం... ఇవన్నీ ఇందులో భాగం.

ఓ పెయింట్ షాపు ఉండేది. నేను దాని ముందు నుంచి వెళ్లేదాన్ని. ఓ రోజు పని నేర్చుకుంటానని షాపు యజమానిని అడిగాను. నువ్వు మహిళవు, ఇక్కడేం పని నేర్చుకుంటావ్.. అన్నారాయన. ఇది మగాళ్ల పని అన్నారు. మగైనా, ఆడైనా పని పనే కదా అన్నాను నేను. అయితే, 'నీకు ఆసక్తి ఉంటే, చేసి చూడు. నేను వద్దనను' అన్నారాయన.

అక్కడ ఓ వాటర్ ట్యాంక్ ఉంది. ఆయన నా చేతికి ఎమ్రీ పేపర్ ఇచ్చారు. దాన్ని రుద్ది శుభ్రం చెయ్యాలన్నారు. నేను ఆ పని చేస్తుంటే చాలా మంది నా వెనుక గుమిగూడారు. నేనిక్కడ పనిచేయటం మొదలుపెట్టినపుడు మహిళల దుస్తులే ధరించేదాన్ని.

ఒక్కోసారి రోజుకు ఐదు వందల రూపాయలు సంపాదిస్తా. ఒక్కోసారి రెండొందలే వస్తాయి. ఆదాయం స్థిరంగా ఉండదు. ఒక్కోసారి పనే ఉండదు. బతుకుబండి అయితే నడుస్తోంది. దేవుడే నడిపిస్తున్నాడు.

ఈ మార్కెట్‌లో మహిళల దుస్తుల్లో పనిచేయటం బాగా అనిపించలేదు. వాళ్లలాగే ఉండాలనుకున్నా. వాళ్లలాగా ఉంటేనే ఈ పని చేయగలను, లేదంటే చేయలేను.

ఎక్కువగా మగాళ్లతోనే కలిసి ఉంటాను. ఇంత కాలం వారితో కలిసి ఉన్నందువల్ల నేను కూడా మగాడిలాగే మారిపోయినట్లు అనిపిస్తుంది. ఇప్పుడు ఆడవాళ్లతో కలిసి కూర్చోవటం కష్టంగా అనిపిస్తుంది.

ఫ్యాక్టరీలో పని కోసం ఇంట్లోంచి అడుగు బయట పెట్టినపుడు నేను ఎప్పుడూ ధైర్యంగానే ఉంటాను. ఎందుకంటే వేరే మగాళ్లు కూడా ఉంటారు. ఇంట్లో ఉండే వారి కోసమే పరదా పద్ధతి. మహిళ ఇంట్లో ఉన్నంతవరకూ ముఖానికి తెర వేస్తారు. ఇంట్లోంచి బయటపడ్డ తర్వాత గుండెకు తెర ఉండాలి. తెర ఉండాల్సిందే హృదయానికే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)