You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
40 ఏళ్ల కిందట తప్పిపోయిన నేపాలీ... ఊహించని విధంగా భారత్‌లో ఎలా దొరికారు?
అది ఫిబ్రవరి 1979. నేపాల్‌లోని ఈలమ్ జిల్లా ఎకాతపా గ్రామానికి చెందిన దీపక్ జోషి అనే యువకుడు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తిరిగి ఇంటికి రాలేదు.
అదృశ్యమైన దీపక్ జోషి కోల్‌కతాలోని దమ్‌దమ్ సెంట్రల్ జైలులో ఉన్నట్లు 40ఏళ్ల తర్వాత కుటుంబ సభ్యులకు తెలిసింది. దీపక్ తమ్ముడు నేపాల్ నుంచి కోల్‌కతా వచ్చి తన అన్నను కలుసుకున్నారు.
సొంత ఊళ్లో చిన్నచిన్న పనులు చేసుకుని జీవించే దీపక్ జోషికి జ్యోతిష్యం అంటే ఇష్టం. అయితే ధాన్యం అమ్ముకుని వస్తానని వెళ్లిన అతను తిరిగి ఇంటికి చేరుకోలేదు.
''మా అన్న కోసం నేపాల్ అంతా వెతికాం. ఎక్కడా కనిపించ లేదు. చనిపోయాడని అనుకున్నాం'' అని బీబీసీతో టెలీఫోన్‌లో మాట్లాడిన దీపక్ జోషి తమ్ముడు ప్రకాశ్ చంద్ర తిమసినా అన్నారు.
''అతను తప్పిపోయిన సమయంలో డార్జిలింగ్‌లో గూర్ఖాలాండ్ ఉద్యమం జరుగుతోంది. ఆ గొడవల్లో చనిపోయి ఉంటాడని అనుకున్నాం. కానీ చాలా ఏళ్ల తర్వాత దీపక్ గురించి సమాచారం వచ్చింది'' అన్నారు ప్రకాశ్ చంద్ర.
దీపక్ జోషి పశ్చిమ బెంగాల్‌లోని వివిధ జైళ్లలో విచారణ ఖైదీగా జీవితం గడిపారు. 40ఏళ్లు గడిచినా ఆయనపై విచారణ జరగ లేదు.
దీపక్ కేసును కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివిజన్ బెంచ్ బుధవారం విచారించింది. ఈ కేసులో తదుపరి విచారణ మార్చి 15న జరగనుంది. దీపక్‌ను నేపాల్ తిరిగి పంపుతారా లేదా అన్నది కోర్టు నిర్ణయించనుంది.
బయటి ప్రపంచానికి ఎలా తెలిసింది?
దీపక్ జోషీ 40 ఏళ్లుగా జైలులో ఉండగా, గత కొన్ని నెలల నుంచి అతని జీవితంలో నాటకీయ పరిణామాలు మొదలయ్యాయి. గత ఏడాది రాధేశ్యాం దాస్ అనే ఖైదీ ఆయనకు పరిచయమయ్యారు.
మావోయిస్టులతో సంబంధాల ఆరోపణలపై పదేళ్ల కిందట అరెస్టయిన రాధేశ్యాందాస్‌ను నందిగ్రామ్ జైలు నుంచి గత ఏడాది కోల్‌కతాలో దీపక్ జోషి ఉంటున్న దమ్‌దమ్ జైలుకి మార్చారు.
2016లో కూడా ఆయన కొన్నాళ్లు దమ్‌దమ్ జైలులో ఉన్నారు.
''గత ఏడాది ఫిబ్రవరిలో నన్ను దమ్‌దమ్ జైలుకు తీసుకువచ్చినప్పుడు నేను మళ్లీ దీపక్ జోషీని కలిశాను. జైలులో ఉంటూ మానసిక సమస్యలతో బాధపడుతున్న వారిని నేను కలుస్తుంటాను.
దీపక్ జోషీ కూడా అలాగే పరిచయమయ్యారు. ఆయన 40 ఏళ్లుగా జైలులో ఉంటున్నారు. కానీ ఆయన కేసు విచారణ మాత్రం జరగడం లేదు.'' అన్నారు రాధేశ్యామ్ దాస్.
బెయిల్‌పై విడుదలైన తర్వాత పశ్చిమ బెంగాల్ అమెచ్యూర్ రేడియో క్లబ్‌ను రాధేశ్యామ్ దాస్ సంప్రదించారు. ఈ సంస్థ హామ్ రేడియోలను ఆపరేట్ చేస్తుంది.
''ఒక వ్యక్తి 40ఏళ్లుగా జైలులో ఉన్నాడని రాధేశ్యామ్ దాస్ ద్వారా తెలుసుకుని షాకయ్యాను. మొదట నమ్మలేక పోయాను. జైలును సందర్శించినప్పుడు దీపక్ జోషి అనే వ్యక్తి 1981 నుంచి జైలులో ఉంటున్నాడని, అతని కేసు ఇంకా విచారణకు రాలేదని తెలిసింది'' అని రేడియో క్లబ్ సెక్రటరీ అంబరీశ్ నాగ్ విశ్వాస్ అన్నారు.
అమెచ్యూర్ రేడియో క్లబ్ మెంబర్లు తాము దీపక్ జోషీని కలుసుకోవాలని దరఖాస్తు చేశారు. అయితే కుటుంబ సభ్యులు కానందున అధికారులు అనుమతించ లేదు.
దీంతో హైకోర్టు న్యాయవాదిగా హీరక్ సిన్హా ఆయన్ను కలవడానికి అనుమతి సంపాదించారు.
''దీపక్ మానసిక ఆరోగ్యం బాగాలేదని అతని విచారణ పత్రాలు పేర్కొంటున్నాయి. కానీ అతనితో మాట్లాడిన తర్వాత నాకు అతని మానసిక స్థితి మీద ఎలాంటి సందేహం రాలేదు. అతను షాక్‌కు గురయ్యాడన్నది మాత్రం వాస్తవం.
నాకు నేపాలీ భాష బాగా తెలియదు. అతను పెన్ను పేపర్ తీసుకుని దేవనాగరి లిపిలో కొన్ని అసంపూర్ణ వాక్యాలు రాశారు. అతని పేరు, ఊరు, తల్లిదండ్రులు, పాఠశాల వివరాలు అందులో ఉన్నాయి''అని హీరక్ వెల్లడించారు.
ఎందుకు అరెస్టయ్యారు ?
1981లో డార్జిలింగ్‌లో ఓ హత్యాయత్నం కేసులో జోషి అరెస్టయినట్లు అతని కోర్టు పేపర్లలో ఉంది. ''నేపాల్ నుంచి వచ్చిన అతను డార్జిలింగ్‌లోని ఓ టీ తోటలో పనిచేశాడు. ఉద్యోగం కోసం మరొకరిని సంప్రదించగా, ఆయన ఒక వ్యక్తిని చంపితే ఉద్యోగం ఇస్తానని చెప్పారు.
తాను ఆ వ్యక్తి చెప్పిన వ్యక్తిపై దాడి చేసి గాయపరిచానని దీపక్ నాకు చెప్పారు. ఆ కేసులో పట్టుబడి అప్పటి నుంచి జైలులో విచారణ ఖైదీగా ఉన్నారు'' అని హీరక్ సిన్హా వెల్లడించారు.
అరెస్టు చేసిన తరువాత కూడా అతన్ని ఏ కోర్టులోనూ హాజరుపరచలేదు. కొన్నాళ్లు బహరంపూర్ జైలు, మరికొన్నాళ్లు అలీపూర్ జైలు, ఇంకొన్నాళ్లు మెంటల్ హాస్పిటల్‌లో దీపక్‌ను ఉంచారు.
అలా నాలుగు దశాబ్దాలు గడిచిపోయాయి.
దీపక్ జోషి మానసిక ఆరోగ్యంపై విచారణకు కోర్టు పదేపదే ఆదేశించింది. కానీ ఆ నివేదికను ఎప్పుడూ కోర్టులో సమర్పించలేదు. దీపక్ అడ్రస్ తెలుసుకోవడానికి హామ్ రేడియో ఆపరేటర్ సంస్థ కోల్‌కతాలోని నేపాల్ కాన్సులేట్‌ను సంప్రదించింది.
దొరికిన దీపక్ జోషి కుటుంబం అడ్రస్
"2015లో భూకంపం వచ్చినప్పుడు నేను నేపాల్ వెళ్లాను. అక్కడి స్థానిక హ్యామ్ రేడియో ఆపరేటర్లు పరిచయం అయ్యారు. వారిలో నేపాల్ సుప్రీంకోర్టు న్యాయవాది సతీశ్ ఒకరు. ఆయనతో మాట్లాడి విషయం చెప్పాను. దీపక్ ఇచ్చిన వివరాల ఆధారంగా వారు వెతికారు.'' అని హామ్ రేడియో ఆపరేటర్ అంబరీశ్ నాగ్ విశ్వాస్ తెలిపారు.
ఈలమ్ జిల్లాలోని చులాచులి గ్రామంలో ఉన్న ఒక పాఠశాలలో జోషి చదువుకునేవారని గుర్తించారు. ఆ గ్రామానికి వెళ్లగా భూకంపంలో ఆ పాఠశాల కూలిపోయినట్లు తెలిసింది.
''స్థానికులను అడిగినప్పుడు దీపక్ జోషి చనిపోయారని చెప్పారు. అయితే అతని సోదరుల్లో ఒకరు అదే పాఠశాలలో పని చేసేవారని, కానీ అది కూలిపోవడంతో వేరే స్కూల్‌కు మారారని వెల్లడించారు.
అక్కడికి వెళ్లి ప్రకాశ్ చంద్ర తిమసినాను కలిశాం. దీపక్ బతికే ఉన్నాడని చెప్పడంలో వారు షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత దీపక్ తల్లి దగ్గరకు వెళ్లాం. ఆ ప్రాంతం కొండల మధ్య వెళ్లలేని స్థితిలో ఉంది'' అని హీరక్ సిన్హా వెల్లడించారు.
ఈ విషయమంతా కలకత్తా హైకోర్టు తెలిసింది. దీనిపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు కావడంతో విచారణ జరిపి ఈ కేసులో సహకరించాలని నేపాల్ కాన్సులేట్ జనరల్‌ను ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు.
ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం కూడా పేద ఖైదీలకు అందించే న్యాయ సహాయం(లీగల్ ఎయిడ్)ను అందించింది.
"ఒక వ్యక్తి కేసు 40ఏళ్లుగా విచారణకు రాలేదు. అసలు ఇది ఎలా సాధ్యం"అని దీపక్ తరఫున వాదిస్తున్న ప్రభుత్వ న్యాయవాది జయంత్ నారాయణ్ ఛటర్జీ అన్నారు. ''ఇది కచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనే'' అన్నారాయన.
కోర్టు తీర్పుపై ఆసక్తి
దీపక్ జోషి సోదరుడు ప్రకాశ్ చంద్ర తన అన్నను కలిసిన తర్వాత నేపాల్ వచ్చారు.''కోల్‌కతాకు బయలు దేరుతుండగా దీపక్ ఫొటో తీసుకురమ్మని మా అమ్మ చెప్పింది.
కానీ జైలు అధికారులు మమ్మల్ని ఫొటో తీసుకోనివ్వ లేదు. 40 సంవత్సరాల తరువాత మా అన్నను చూసిన తర్వాత నా అనుభవాన్ని మాటల్లో వర్ణించలేను'' అన్నారు ప్రకాశ్
''మా అన్న తిరిగి వస్తాడు కదా ? నాలుగు దశాబ్దాల కిందట వదిలి వెళ్లిపోయిన మా ఊరిని, మా అమ్మను, మా కుటుంబాన్ని తిరిగి చూస్తాడు కదా?'' అని ఫోన్ పెట్టేయబోయే ముందు దీపక్ సోదరుడు ప్రకాశ్ అడిగారు.
ఇవి కూడా చదవండి:
- కొండ బారిడి: తుపాకులు గర్జించిన నేలలో ఇప్పుడు సేంద్రియ వ్యవసాయ విప్లవం
- కరోనా వైరస్ వ్యాక్సీన్ కోసం నమోదు: కోవిన్ యాప్, వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ఇలా.. ఏఏ ధ్రువపత్రాలు కావాలంటే
- హాథ్రస్: కూతురిని వేధించారని కేసు పెట్టినందుకు తండ్రిని కాల్చి చంపేశారు
- కరోనావైరస్: ఇండియాలో మళ్లీ పాజిటివ్ కేసులు పెరుగుతుండడానికి కారణమేమిటి.. మరో వేవ్ మొదలైందా
- ఇథియోపియా టిగ్రే సంక్షోభం: బీబీసీ విలేకరిని నిర్బంధించిన సైన్యం
- కృత్రిమ గర్భధారణ ఖర్చులు భరించలేక ఫేస్బుక్లో వీర్యదాతలను ఆశ్రయిస్తున్నారు... ఆరోగ్యం ఏమవుతుంది?
- భారతదేశంలోని ‘అస్థిపంజరాల సరస్సు’.. అంతు చిక్కని రహస్యాల నిలయం
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
- ఇది భాగస్వామిని మోసం చేయడమా? కాదా?
- ‘చచ్చిపోయిన’ రష్యా జర్నలిస్టు బతికొచ్చారు
- ఇంత తక్కువ సమయంలో అంత సంపద ఎలా వచ్చింది?
- దళితులు, ముస్లింల సమస్యలు ఏంటి- చర్చిద్దాం రండి!