You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్: బాబా రామ్‌దేవ్ ‘కరోనిల్’ కోవిడ్ నుంచి రక్షిస్తుందా? - బీబీసీ పరిశోధన
- రచయిత, కరిష్మా పటేల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
లండన్‌లో కొన్ని షాపుల్లో నకిలీ కోవిడ్-19 'ఇమ్యూనిటీ బూస్టర్స్'(రోగనిరోధ శక్తి పెంచే మందులు) అమ్ముతున్నట్లు బీబీసీ పరిశోధనలో బయటపడింది.
లండన్‌లోని కొన్ని దుకాణాల్లో భారత్‌కు చెందిన ఆయుర్వేద ఔషధం 'కరోనిల్' అమ్ముతున్నట్లు బీబీసీ గుర్తించింది.
శ్వాసనాళానికి సంబంధించిన ఇన్ఫెక్షన్ల నుంచి ఈ పిల్స్ కాపాడుతాయని పతంజలి ఆయుర్వేద సంస్థ చెబుతోంది.
బీబీసీ చేయించిన పరీక్షల్లో ఈ పిల్స్ కరోనా నుంచి ఎలాంటి రక్షణ అందించవని తేలింది.
బర్మింగ్‌హాం యూనివర్సిటీ ప్రయోగశాలలో బీబీసీ కోసం ఈ పిల్స్ మీద ప్రయోగాలు చేశారు. వీటిలో ఉన్న మొక్కలకు సంబంధించిన కొన్ని పదార్థాలు కరోనావైరస్ నుంచి కాపాడలేవని తేలింది.
"కరోనా విషయానికి సంబంధించి, రోగనిరోధక శక్తిని పెంచడం అనడంలో అసలు అర్థమే లేదు. వైరస్‌కు మన రోగనిరోధక శక్తి ఎలా స్పందిస్తుంది అనే దానిపై చాలా సూక్ష్మ భేదాలున్నాయి. రోగనిరోధక శక్తిని పెరగడం వల్ల, ఏదైనా సాయం ఉంటుందా అనేది తెలీదు. రోగనిరోధక శక్తికి కరొనిల్ ఏం చేయడానికి ప్రయత్నిస్తుంది అనేదానిలో కూడా స్పష్టత లేదు" అని వైరాలజిస్ట్ డాక్టర్ మైత్రేయి శివకుమార్ అన్నారు.
కోవిడ్-19 నుంచి రోగ నిరోధక శక్తిని అందిస్తాయనే ఔషధాల ప్రకటనలను బ్రిటన్ నిషేధించింది.
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులకు ఆదరణ ఉన్న భారత్‌లో ఈ ఔషధాన్ని అనుమతించారు.
వెంబ్లీలోని ఒక దుకాణం.. కరోనిల్ కోవిడ్-19 నుంచి రోగనిరోధ శక్తిని పెంచుతుందని షాపు బయట, తన వెబ్‌సైటులో ప్రకటనలు పెట్టింది.
లండన్‌లోని మరో నాలుగు దుకాణాల్లో కూడా ఈ పిల్స్ అమ్ముతున్నట్లు బీబీసీ గుర్తించింది. కరోనిల్ పిల్స్ తీసుకుంటే కోవిడ్-19 నయం అవుతుందని చెబుతున్నాయి.
బీబీసీతో మాట్లాడిన ఒక కస్టమర్ తనకు 78 ఏళ్లు కాబట్టి వాటిని తీసుకున్నట్లు చెప్పారు.
"షాపింగ్ కోసం బయటికి వెళ్తే, వేరే ఎవరినుంచైనా నాకు కరోనా రావచ్చు. అందుకే, నన్ను నేను కాపాడుకోడానికి ఈ పిల్స్ కొనుక్కున్నా" అన్నారు.
కోవిడ్‌ను నయం చేస్తుందనే వాదన
ఏదైనా ఒక పదార్థం రోగనిరోధ శక్తిని పెంచుతుంది అని చెప్పే అధికారిక వాదనలు బ్రిటన్‌లో ఏవీ లేవని అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ అథారిటీ(ఏఎస్ఏ) చెప్పింది.
మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ(ఎంహెచ్ఆర్ఏ) లైసెన్స్ లేకుండా ఒక ఉత్పత్తి కరోనా లక్షణాలను నివారిస్తుందని, నయం చేస్తుందని, తగ్గిస్తుందని చెప్పకూడదు.
ఈ ఏజెన్సీ కరోనిల్ వినియోగానికి ఎలాంటి అనుమతులూ ఇవ్వలేదు. బ్రిటన్ మార్కెట్లో అనధికారిక ఔషధ ఉత్పత్తులను అందుబాటులో ఉంచినా, అమ్మినా తగిన చర్యలు తీసుకుంటారు.
కరోనిల్ కోవిడ్-19 రోగులకు నయం చేసిందని పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకుడు బాబా రాందేవ్ జూన్‌లో చెప్పారు.
"మా ఔషధాన్ని మూడు రోజులు వాడిన కరోనా రోగుల్లో 69 శాతం మందికి, ఏడు రోజులు వాడిన వారిలో 100 శాతం మందికి నెగెటివ్ వచ్చింది" అన్నారు.
పతంజలి సంస్థ కరోనిల్‌ను రోగనిరోధక శక్తి పెంచే ఔషధంగా అమ్మవచ్చని, కానీ దానిని నయం చేస్తుందని చెప్పకూడదని భారత ప్రభుత్వం సూచించింది.
దీంతో, పతంజలి ఆయుర్వేద సంస్థ కరోనిల్ కోవిడ్-19ను నయం చేస్తుందనే తమ వాదనను ఇప్పుడు వెనక్కు తీసుకుంది.
"ఇలాంటి తప్పుడు సమాచారం వల్ల ప్రజలకు ఆరోగ్యపరంగా, ఆర్థికంగా హాని కలగవచ్చని" వాస్తవాలను తనిఖీ చేసే ఫుల్ ఫాక్ట్ సంస్థ చెప్పింది.
ఇవి కూడా చదవండి:
- చాలా ఏళ్లుగా చిప్స్ మాత్రమే తింటున్నాడు.. చివరికి కంటి చూపు కోల్పోయాడు
- ‘మనిషి లాంటి’ చేప: ఇది కేన్సర్‌కి పరిష్కారం చూపుతుందా?
- కరోనావైరస్: రొయ్యల సాగుదారుల చిక్కులేంటి.. లాక్ డౌన్‌తో నష్టం ఎంత?
- అమెరికా అధ్యక్షుడు ఏం తింటారు? వాటి అర్థం ఏంటి?
- వేరుసెనగ పప్పు తింటే చనిపోతారా?
- ఉప్పు తిన్న సముద్రానికే మనం ముప్పు తెస్తున్నాం
- డాక్టర్లు బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ చేస్తుంటే... ఆ అమ్మాయి పియానో వాయించింది
- కరోనా వ్యాక్సీన్ భారతదేశంలో మొదట ఎవరికి ఇస్తారు... దీని కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?
- ఆడపిల్లలు వయసు రాకముందే రజస్వల కావడానికి కారణాలేమిటి? సమస్యలేమిటి? పరిష్కారాలేమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)