You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కోవిడ్-19: వ్యాక్సీన్‌తో మన డీఎన్‌ఏ దెబ్బతింటుందా - బీబీసీ రియాలిటీ చెక్
- రచయిత, ఫ్లోరా కార్మైకల్
- హోదా, బీబీసీ రియాలిటీ చెక్
కరోనావైరస్ వ్యాక్సీన్ 90 శాతం ప్రజలను కోవిడ్ 19 నుంచి కాపాడుతుందని క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది. అయితే ఈ వార్త వచ్చిన దగ్గర నుంచీ వ్యాక్సీన్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అనేక యాంటీ- వ్యాక్సీన్ వదంతులు ప్రచారంలోకి వచ్చాయి.
ముఖ్యంగా ఈ వ్యాక్సీన్ ద్వారా మైక్రోచిప్స్‌ను శరీరంలోకి పంపిస్తారని, జన్యుపరమైన మార్పులు చేస్తారని వదంతులు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి.
అలాంటి వార్తల్లో వాస్తవమెంత అనే విషయంపై బీబీసీ పరిశోధన జరిపింది.
శరీరంలోకి మైక్రోచిప్ ఎక్కిస్తారని వార్త
వ్యాక్సీన్ గురించి ప్రకటన వెలువడిన వెంటనే మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులైన బిక్ గేట్స్ వార్తల్లోకొచ్చారు. ట్విట్టర్‌లో ఈ వారం రోజులుగా ఆయన పేరు ట్రెండ్ అవుతోంది.
కోవిడ్-19 మహమ్మారి సమయంలో బిల్ గేట్స్ మీద పలుమార్లు వదంతులు వ్యాపించాయి.
పబ్లిక్ హెల్త్, వ్యాక్సీన్ అభివృద్ధి మొదలైన అంశాల్లో బిల్ గేట్స్ చేస్తున్న సేవల కారణంగా ఆయన మీద పలురకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యంగా, ఈ ఏడాది ప్రారంభం నుంచీ బిల్ గేట్స్‌పై ఒక వదంతి చక్కర్లు కొడుతోంది...ఈ కరోనావైరస్ అంతా అబద్ధమని, ట్రాక్ చెయ్యడానికి వీలుండే అతి చిన్న మైక్రోచిప్స్‌ను మనుషుల శరీరాల్లోకి ఎక్కించడానికి వేసిన ప్లాన్ అనీ, దీని వెనుక బిల్ గేట్స్ హస్తం ఉందనీ ప్రచారమవుతోంది.
ఈ వదంతి మళ్లీ ఈ వారం విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ వాదన వాస్తవమని అంగీకరించడానికి ఎటువంటి ఆధారాలు లేవు. అంతే కాకుండా, అవన్నీ అబద్ధపు ప్రచారాలని బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్, బీబీసీకి తెలిపింది.
ఎలాంటి ఆధారాలూ లేకపోయినప్పటికీ...మే నెలలో 1,640 మందిని శాంపిల్‌గా తీసుకుని యూగోవ్ నిర్వహించిన ఒక పోల్‌లో 28% అమెరికన్లు ‘వ్యాక్సీన్ ద్వారా మనుషుల శరీరాల్లోకి మైక్రోచిప్స్ ఎక్కించాలని బిల్ గేట్స్ ప్లాన్ వేస్తున్నట్లు’ నమ్ముతున్నారని తేలింది. రిపబ్లికన్లలో 44% మంది ఈ పుకారును నమ్ముతున్నారని తేలింది.
డీఎన్ఏలో మార్పులు వస్తాయన్న వాదన
"ఫైజర్/బయోఎన్‌టెక్ వ్యాక్సీన్‌తో జర భద్రం" అంటూ ట్రంప్‌కు అనుకూలంగా వ్యవహరించే వెబ్‌సైట్ ‘న్యూస్‌మాక్స్’ వైట్ హౌస్ కరెస్పాండెంట్ ఎమరాల్డ్ రాబిన్సన్ ట్వీట్ చేశారు. ఆమెకు ట్విట్టర్‌లో 2,64,000 మంది ఫాలోవర్లు ఉన్నారు.
"ఈ వాక్సీన్ మీ డీఎన్ఏను దెబ్బతీస్తుంది. ట్రయల్స్‌లో పాల్గొన్న 75% మందికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. జాగ్రత్త!" అంటూ రాబిన్సన్ ట్వీట్ చేశారు.
వ్యాక్సీన్ డీఎన్ఏను మార్చేస్తుందనే పుకారు ఫేస్‌బుక్‌లో తరచుగా వినిపించేదే!
ఈ విషయమై బీబీసీ.. ముగ్గురు శాస్త్రవేత్తలతో మాట్లాడింది. ముగ్గురూ కూడా కరోనావైరస్ వ్యాక్సీన్ డీఎన్ఏలో ఎలాంటిమార్పులు తీసుకురాదని తేల్చి చెప్పారు.
ఇలాంటి వదంతులు వ్యాప్తి చేసే వారు జన్యుశాస్త్రానికి సంబంధించిన ప్రాథమిక సూత్రాలను తప్పుగా అర్థం చేసుకున్నారేమో అనిపిస్తుంది.
వైరస్ తాలూకా జన్యు పదార్థంలోని ఒక చిన్న భాగాన్ని వ్యాక్సీన్ తయారీలో వాడతారు. దీన్నే ఆర్ఎన్ఏ (RNA) అని అంటారు.
"ఆరెన్ఏ మానవ శరీరంలోకి ఎక్కిస్తే, అది కణాల్లోని డీఎన్ఏపై ఏ రకమైన ప్రభావం చూపదు" అని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జెఫ్రీ ఆల్మండ్ తెలిపారు.
"ఫైజర్ వ్యాక్సీన్ మానవ శరీరంలోని డీఎన్ఏ క్రమాన్ని మార్చదని, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి మాత్రమే తోడ్పడుతుంది"అని ఫైజర్ ప్రతినిధి ఆండ్రూ విడ్జెర్ స్పష్టం చేశారు.
కోవిడ్-19 వ్యాక్సీన్ డీఎన్ఏలో మార్పులు తీసుకొస్తుందన్న వాదనలు వినిపించడం ఇదేం మొదటిసారి కాదు. మే నెలలో ఇలాంటి వాదనను ప్రచారం చేస్తున్న ఒక ప్రముఖ వీడియోపై బీబీసీ శోధన జరిపింది.
అయితే, ప్రస్తుతం అభివృద్ధి పరుస్తున్న వ్యాక్సీన్ రకం ఈ అపార్థాలకు కొంతవరకూ కారణం కావొచ్చు.
మెసెంజర్ ఆర్ఎన్ఏ లేదా ఎంఆర్ఎన్ఏ (mRNA) సాంకేతికతను ఫైజర్/బయోఎన్‌టెక్ వ్యాక్సీన్ తయరీలో ఉపయోగిస్తారు.
ఇదెలా పనిచేస్తుందంటే..కరోనావైరస్ ఉపరితలంపై ఉండే ప్రొటీన్‌లాంటిదే మానవ శరీరంలో కూడా తయారయ్యేలా ప్రేరేపిస్తుంది.
శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ ఈ ప్రొటీన్‌ను గుర్తించి, దానితో పోరాడడానికి అవసరమయ్యే యాంటీబాడీస్‌ను ఉత్పత్తి చేస్తుంది.
అయితే, ఎమరాల్డ్ రాబిన్సన్ తన ట్వీట్‌లో "ఎంఆర్ఎన్ఏ వ్యాక్సీన్ టెక్నాలజీని ఇంతకుముందెప్పుడూ పరీక్షించడంగానీ, ఆమోదించడంగానీ జరగలేదని" రాశారు.
అది నిజమే. ఇంతవరకు ఎప్పుడూ ఎంఆర్ఎన్ఏ సాంకేతిక వాడిన వ్యాక్సీన్ ఆమోదానికి నోచుకోలేదు.
అయితే, గత కొన్ని సంవత్సరాలుగా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సీన్‌ను మానవులకు ఇవ్వడంపై అనేక అధ్యయనాలు జరిగాయి.
"తొలిసారిగా, ఫైజర్/బయోఎన్‌టెక్ వ్యాక్సీన్, లైసెన్స్ పొందడానికి కావలసిన సామర్థ్యాన్ని కనబరిచింది" అని ప్రొఫెసర్ ఆల్మండ్ తెలిపారు.
"ఇది కొత్త టెక్నాలజీ అనే కారణంగా మనం భయపడాల్సిన అవసరం లేదు" అని ఆయన అన్నారు.
మార్కెట్లోకి ప్రవేశపెట్టే ముందు కొత్త వ్యాక్సీన్లను విస్తృతంగా పరీక్షిస్తారు.
మొదటి రెండు దశల క్లినికల్ ట్రయిల్స్‌లో వ్యాక్సీన్‌ను కొద్దిమంది వలంటీర్లపై ప్రయోగించి సురక్షితమో కాదో పరీక్షిస్తారు. ఎంత మోతాదులో టీకా ఇవ్వాలన్నది కూడా ఈ దశల్లోనే నిర్ణయిస్తారు. మూడ దశ ట్రయిల్స్‌లో వేలమంది వలంటీర్లపై ప్రయోగం చేసి వ్యాక్సీన్ సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. వ్యాక్సీన్ ఇచ్చిన బృందాన్ని, డమ్మీ వ్యాక్సీన్ ఇచ్చిన బృందాన్ని కూడా దగ్గరగా పరిశీలిస్తూ సైడ్ ఎఫెక్ట్స్ ఏవైనా ఉన్నాయేమో పరిశీలిస్తారు. లైసెన్స్ పొందిన తరువాత కూడా వ్యాక్సీన్ భద్రతా పర్యవేక్షణ జరుగుతూనే ఉంటుంది.
"ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ విషయంలో డేటా లోటు ఉంది. దీని గురించి తెలుసుకోవాలని చాలామంది ఆతృతపడుతున్నారు. కానీ తగినంత విశ్వసనీయ సమాచారం అందుబాటులో లేదు" అని సోషల్ మీడియాలో వ్యాక్సీన్ గురించి వస్తున్న కల్పితాలు, పుకార్ల గురించి అధ్యయనం చేసిన క్లైర్ వార్డ్‌ల్ తెలిపారు. క్లైర్ వార్డ్‌ల్, ఫస్ట్ డ్రాఫ్ట్ అనే ప్రభుత్వేతర సంస్థలో ఎక్జిక్యుటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు.
"తగినంత విశ్వసనీయ సమాచారం లేకపోవడం వలన, వ్యాక్సీన్లపై పుకార్లు, తప్పుడు ప్రచారాలకు ఆస్కారం లభిస్తోందని" క్లైర్ వార్డ్‌ల్ అభిప్రాయపడ్డారు.
సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్న వాదన
ఈ వ్యాక్సీన్ వలన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని కూడా ఎమరాల్డ్ రాబిన్సన్ తన ట్వీట్‌లో ప్రస్తావించారు.
ట్రయిల్స్‌లో పాల్గొన్న 75% వలంటీర్లకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని కూడా రాశారు.
అయితే, ఫైజర్/బయోఎన్‌టెక్, తాము నిర్వహించని ట్రయిల్స్‌లో అలాంటివేమీ జరగలేదని స్పష్టం చేసింది.
"అనేల రకాల వ్యాక్సీన్లలాగే ఈ వ్యాక్సీన్ కూడా స్వల్పకాలిక దుష్ప్రభావాలని కలిగించొచ్చు. ఇంజక్షన్ ఇచ్చినచోట నొప్పి, జ్వరం, కండరాల నొప్పులు, తలనొప్పి, అలసట రావొచ్చు" అని డా. పెన్నీ వార్డ్ తెలిపారు. డా. వార్డ్, లండన్‌లోని కింగ్స్ కాలేజ్ ఫార్మాస్యుటికల్ విభాగంలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
అయితే, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ సర్వ సాధారణమని, సంవత్సరానికి ఒకసారి తీసుకునే ఫ్లూ వ్యాక్సీన్ వల్ల కూడా ఇవన్నీ కలుగుతాయని ప్రొ. వార్డ్ తెలిపారు. ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ స్వల్పంగా ఉంటాయని రెండు, మూడు రోజుల్లో సర్దుకుంటాయని, పారాసిటమాల్ లేదా ఐబ్రూఫిన్ వేసుకుంటే తగ్గిపోతాయని ఆయన అన్నారు.
రాబిన్సన్‌కు 75% అనే సంఖ్య ఎక్కడినుంచి లభించిందో తెలీదు. ట్రయిల్స్‌లో ఒక గ్రూపుకు వచ్చిన స్వల్పమైన సైడ్ ఎఫెక్ట్స్‌ను పరిగగణించి ఉద్దేశపూర్వకంగా ఈ శాతాన్ని ప్రస్తావించి ఉండొచ్చు.
ఫైజర్ ఇటీవల నిర్వహించిన ట్రయిల్స్‌లో బయటపడిన సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఇంకా పూర్తి సమాచారాన్ని ప్రచురించలేదు. అయితే, తీవ్రమైన దుష్ప్రభావాలేమీ కనిపించలేదని ఫైజర్ స్పష్టం చేసింది.
ట్వీట్టర్‌లో చేసిన కామెంట్ల విషయమై బీబీసీ, ఎమరాల్డ్ రాబిన్సన్‌ను సంప్రదించిందినపుడు ఆవిడ తన కామెంట్ల విషయంలో పట్టుదలగా ఉన్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- ఆధునిక మానవుడి చేతిలో అంతరించిపోయిన జాతి కథ.. ఒళ్లు గగుర్పొడిచే యుద్ధాలలో ఏం జరిగింది
- కరోనావైరస్ నుంచి 90 శాతం రక్షణ కల్పించే తొలి వ్యాక్సీన్ ఇదే
- ‘దూదేకుల’ వివాదం ఏపీ హైకోర్టుకు ఎందుకు చేరింది
- ‘నేను బెంగాలీ.. నా బాయ్ ఫ్రెండ్ నల్ల జాతీయుడు - మా అమ్మ ఏం చేసిందంటే..’
- ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల విభజన ఎలా ఉండబోతోంది... ఎన్ని కొత్త జిల్లాలు రాబోతున్నాయి?
- భారత్-చైనా ఉద్రిక్తతలు: భారత్ ఎందుకు వరుసగా క్షిపణి పరీక్షలు చేపడుతోంది?
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- దీపావళి ప్రత్యేకం: లక్ష్మీదేవి బొమ్మలో ముఖం ఎవరిది?
- కోర్టు ధిక్కరణ అంటే ఏమిటి.. ఈ నేరానికి ఏ శిక్షలు విధిస్తారు?
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)