అమెరికా : ఇందిరాగాంధీని రిచర్డ్ నిక్సన్ ‘ముసలి మంత్రగత్తె’ అని ఎందుకు కామెంట్ చేశారు?

అమెరికాలో జాత్యహంకార ధోరణులను నిరసిస్తూ గొంతులన్నీ ఏకమవుతున్న వేళ ఆ దేశ మాజీ అధ్యక్షుడు భారతీయ మహిళల రూపం, సెక్స్‌కు సంబంధించి చేసిన అవమానకర వ్యాఖ్యల టేపులు 2020లో బయటకు వచ్చాయి.

అమెరికా మాజీ అధ్యక్షుడు రిచర్డ్ ఎం. నిక్సన్, అప్పటి ఆయన జాతీయ భద్రత సలహాదారు హెన్రీ కిసింజర్ మధ్య జరిగిన మత దురహంకార సంభాషణల రహస్య టేపులు వెల్లడయ్యాయి.

భారతీయ మహిళలు ప్రపంచంలోనే అత్యంత అందవిహీనులని, అసలు వారు పిల్లలను ఎలా కంటారో తనకు అర్థంకావడంలేదని నిక్సన్‌ అన్నారని.. అమెరికాలోని ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌ గేరీ బాస్‌ 'న్యూయార్క్‌ టైమ్స్‌'లో 'ది టెర్రిబుల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ప్రెసిడెన్షియల్‌ రేసిజమ్‌' ఒపీనియన్‌ పోల్‌లో చెప్పారు.

నిక్సన్‌కు భారతీయులపట్ల ద్వేషం, లైంగికపరమైన ఏహ్యభావన కారణంగా అప్పట్లో దక్షిణ ఆసియా దేశాల విషయంలో అమెరికా దారుణమైన విధానాలను అవలంబించిందనీ ఈ టేపుల ద్వారా బయటపడింది.

1960-70ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం, 1971లో అప్పటి తూర్పు పాకిస్తాన్ ప్రాంతంలో జరిగిన వినాశనం, ప్రస్తుత బంగ్లాదేశ ఆవిర్భావం మొదలైన విషయాలన్నీ ఈ టేపుల్లో ఉన్నాయి.

అప్పట్లో రిచర్డ్ నిక్సన్ అధ్యక్షతన అమెరికా, పాకిస్తాన్ మిలటరీకి పూర్తి మద్దతు ఇచ్చింది. ఇండియా, సోవియట్ యూనియన్ సహాయం తీసుకుంది. దీంతో ఇండియా, అమెరికాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగింది.

ఇందిరాగాంధీపై నిక్సన్ అనుచిత వ్యాఖ్యలు

ఇందిరా గాంధీ పాలనలో ఆమెను చాలామంది రకరకాల పేర్లతో పిలిచేవారు. రాంమనోహర్ లోహియా ఆమెను 'మూగ బొమ్మ' అన్నారు. వాజపేయీ ఆమెను 'సాక్షాత్తు దుర్గాదేవి' అన్నారు.

నిక్సన్ ఆమెను 'ముసలి మంత్రగత్తె' అనీ, 'ఓల్డ్ బిచ్' అనీ అన్నారు.

నిక్సన్‌కు ముందు…

1968లో ఇందిరా గాంధీ అమెరికా వెళ్లినప్పుడు అప్పటి అమెరికా అధ్యక్షుడు లిండన్ జాన్సన్‌కు ఆమెను ఏమని సంబోధించాలనే సంశయం వచ్చింది. అప్పటి అమెరికా రాయబారి బీకే నెహ్రూను అడిగితే ఆయన నేరుగా ఇందిరా గాంధీనే ఈ ప్రశ్న అడిగారు.

‘‘నన్ను ప్రధానమంత్రి అనొచ్చు లేదా నా పేరు పెట్టి పిలవొచ్చు’’ అని ఆమె చెప్పమన్నారు.

నా మంత్రివర్గంలో కొందరు నన్ను 'సర్' అని కూడా పిలుస్తారు...ఈ విషయం కూడా వారితో చెప్పండి అని బీకే నెహ్రూకు చెప్పారు ఇందిరా గాంధీ.

లిండన్ జాన్సన్‌కు ఇందిరా గాంధీ అంటే ప్రత్యేకమైన అభిమానం. వారిద్దరి మధ్య మంచి స్నేహం ఉండేదని ప్రముఖ జర్నలిస్ట్ ఇందర్ మల్హోత్రా అన్నారు.

కానీ, జాన్సన్ తరువాత అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన రిచర్డ్ నిక్సన్‌కు ఇందిరా గాంధీకి మొదటి నుంచే పొత్తు కుదరలేదు.

1967లో నిక్సన్‌ను మొట్టమొదటిసారి దిల్లీలో కలిసినప్పుడు మాట్లాడిన ఇరవై నిముషాలకే ఇందిరాగాంధీ విసుగు చెందారు.

సంభాషణ మధ్యలో తన విదేశాంగ కార్యవర్గంవైపు తిరిగి..."ఈ మనిషిని ఇంకా ఎంతకాలం భరించాలో" అని హిందీలో అడిగారు.

బంగ్లాదేశ్ ఏర్పాటు సమయంలో

1971లో తూర్పు పాకిస్తాన్‌లో జరుగుతున్న అమానుష సంఘటనలను ప్రపంచం దృష్టికి తీసుకువెళ్లడం కోసం ఇందిరా గాంధీ అమెరికా వెళ్లినప్పుడు...వైట్ హౌస్ స్వాగత ప్రసంగంలో నిక్సన్ బిహార్ వరద బీభత్సం గురించి విచారం వ్యక్తం చేశారు కానీ తూర్పు పాకిస్తాన్ ఊసైనా ఎత్తలేదు.

నిక్సన్ తరువాత ఇందిర మాట్లాడుతూ మానవులు సృష్టించిన విషాదాలను అమెరికా అధ్యక్షులు విస్మరిస్తున్నారని అన్నారు. అనంతరం, వియత్నాం, చైనాల విషయంలో అమెరికా విధానాలపైకి సంభాషణను మళ్లించారు.

అప్పటి అమెరికా విదేశాంగ మత్రి హెన్రీ కిసింజర్ తన పుస్తకం 'వైట్ హౌస్ ఇయర్స్‌'లో ఈ సంభాషణ గురించి ప్రస్తావిస్తూ... " ఒక ప్రొఫెసర్, చదువుల్లో బలహీనంగా ఉన్న ఒక విద్యార్థి మనోనిబ్బరం పెంచేందుకు ఎలా మాట్లాడతారో నిక్సన్‌తో ఇందిర అలా మాట్లాడారు. నిక్సన్ సభామర్యాదను పాటిస్తూ తన కోపాన్ని దిగమింగుకున్నారు" అని రాశారు.

వీళ్లిద్దరి మధ్య సంభాషణను ''చెవిటివారి మధ్య సంభాషణ (డైలాగ్ ఆఫ ద డెఫ్) గా తన పుస్తకంలో పేర్కొన్నారు. తరువాత ఓవల్ ఆఫీస్‌లో నిక్సన్‌ను కలిసేందుకు ఇందిరా గాంధీ వెళ్లినప్పుడు 45 నిముషాల పాటు ఆమెను వెయిట్ చేయించారు.

ఇందిరా గాంధీ జీవిత చరిత్ర రాసిన కేథరిన్ ఫ్రాంక్ ఈ చర్చల గురించి ప్రస్తావిస్తూ..."ఆ అవమానానికి ప్రతిఫలాన్ని భారత ప్రధాని చాకచక్యంగా అందించారు" అని రాశారు.

నిక్సన్ పాకిస్తాన్ విషయమై చర్చించాలనుకుని వస్తే, ఇందిర ఆ విషయాలేవీ మాట్లాడకుండా అమెరికా విదేశాంగ విధానాలపై పదునైన ప్రశ్నల వర్షం కురిపించారు.

వీరిద్దరి మధ్య చర్చలు విఫలమయ్యాయి. 1971లో భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ ఓటమితో నిక్సన్, ఇందిరా గాంధీల మధ్య సంబంధాలు మరింత చెడిపోయాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)