కరోనావైరస్: ఉమ్ము పరీక్షలతో కోవిడ్-19 మహమ్మారిని అంతం చేయవచ్చా?

వారం వారం ఉమ్ము పరీక్షలు చేయటం ద్వారా కరోనావైరస్ మహమ్మారి అంతమై సాధారణ పరిస్థితులు తిరిగి నెలకొంటాయా? బీబీసీ వైద్య రంగ ప్రతినిధి ఫెర్గుస్ వాల్ష్ కథనం.

కరోనావైరస్ మహమ్మారిని అంతం చేసి సాధారణ పరిస్థితులు తిరిగి రావటానికి ఏదైనా మార్గం ఉంటే ఎలా ఉంటుంది? కోవిడ్-19 భయం లేకుండా సామాజిక దూరం బాధలు లేకుండా ఉండే దారి ఉంటే ఎలా ఉంటుంది? ఇప్పుడున్న ఆంక్షలన్నీ వైరస్ వ్యాప్తిని సాధ్యమైనంత వరకూ తగ్గించటం కోసమే అనుకోండి. అయితే.. కరోనా మీద పోరాటానికి మనకు కావలసిందేమిటంటే.. మనచుట్టూ అది సోకిన వారిని వేగంగా, సమర్థవంతంగా గుర్తించగల మార్గం.

కరోనావైరస్ సోకినట్లు నిర్ధారణ అయిన ప్రతి నలుగురిలో అలా నిర్ధారించిన మొదటి రోజున దాదాపు ముగ్గురిలో వైరస్ లక్షణాలు కనిపించకపోవటం మొదటి సమస్య.

ఇటువంటి వారు తమకు వైరస్ సోకిందనే విషయం తెలియనందువల్ల దానిని వ్యాప్తి చేసే ప్రమాదం ఎక్కువ ఉందని తేలుతోంది.

అసలు కరోనా పరీక్షే రెండో సమస్య. ప్రస్తుత ప్రమాణం ప్రకారం.. గొంతు లోపలి భాగం నుంచి, ముక్కు లోపలి భాగం నుంచి నమూనాలు సేకరించి పరీక్షిస్తున్నారు. దూది ముక్కను గొంతులోకి, ముక్కులోకి పంపించటం నాకైతే కొంత అసౌకర్యంగా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఈ ప్రక్రియ రెండు సెకన్లలో పూర్తవుతుంది. కానీ జాతీయ ఆరోగ్య వ్యవస్థ సిబ్బంది ప్రతిపాదించినట్లు.. ప్రతి వారం ఈ విధంగా పరీక్ష చేయించుకోవటానికి నేను సిద్ధంగా ఉంటానా అనేది అనుమానమే.

సమయం అనేది మూడో సమస్య. కోవిడ్ పరీక్ష కోసం సేకరించిన నమూనాను – పాలిమెరాస్ చైన్ రియాక్షన్ (పీసీఆర్) టెస్ట్‌ కోసం ఒక ల్యాబ్‌కు పంపించాల్సి ఉంటుంది. అందుకోసం కొన్ని గంటల సమయం పడుతుంది. ఇలా డ్రైవిన్ టెస్ట్ సెంటర్లకు వచ్చి పరీక్షలు చేయించుకునే ప్రతి 10 మందిలో తొమ్మిది మందికి 24 గంటల్లో ఫలితాలు అందుతాయి. కానీ కొంచెం వేచివుంటే ఫలితం వచ్చేస్తుంది అనే స్థాయికి ఇంకా రాలేదు.

అంటే.. అత్యంత వేగవంతమైన, సులభమైన, భరోసానిచ్చే కోవిడ్ పరీక్ష మనకు ఇప్పుడు అవసరం.

వేగంగా ఫలితాలనిచ్చే కొన్ని స్వాబ్ టెస్టులను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. అవి ఫలిస్తే భారీ ముందడుగు అవుతుంది.

కానీ.. ఉమ్మును పరీక్షించి నిర్ధారించగలిగితే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది.

మీకు కరోనావైరస్ ఉందో లేదో తెలుసుకోవటానికి ఒక నాళికలో ఉమ్మితే సరిపోతుంది అనే విషయాన్ని ఊహించండి.

అది అంత సులభం కాదనేది నిజమేననుకోండి. ఉమ్ము నమూనాను కూడా లేబొరేటరీకి పంపించాలి. కానీ ఫలితం స్వాబ్ టెస్ట్ కన్నా చాలా వేగంగా రావచ్చు.

సౌతాంప్టన్‌లో ప్రస్తుతం ఉమ్ము టెస్టులను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. నాలుగు వారాల పాటు కొనసాగే ఈ ప్రయోగంలో జేన్ లీస్, ఆమె కుటుంబం కూడా పాల్గొంటున్నారు.

జేన్‌తో పాటు ఆమె ముగ్గురు టీనేజ్ పిల్లలు శామ్, మెగ్, బిల్లీలు కిచెన్ టేబుల్ చుట్టూ కూర్చుని.. స్పూన్ మీద ఉమ్మి దానిని టెస్ట్ ట్యూబ్‌లోకి పంపించారు. అప్పుడు నేను అక్కడే ఉన్నాను.

‘‘స్వాబ్ టెస్ట్ కోసం గొంతులోకి దూది పంపించటం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆరోగ్యం అంతగా బాగోలేనపుడైతే ఈ ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. ఉమ్ము పరీక్ష చాలా సులభంగా ఉంటుంది’’ అని జేన్ పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్టులో 10,000 మందికి పైగా కీలక సిబ్బంది, వారి కుటుంబాలు పాలుపంచుకుంటున్నాయి.

ఈ ప్రయోగాత్మక పరీక్షలను సమన్వయం చేస్తున్న యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ ప్రొఫెసర్ కీత్ గాడ్‌ఫ్రే.. ‘‘శరీరంలో వైరస్ దాడిచేసే మొదటి ప్రాంతం ఉమ్ము గ్రంథులు. వైరస్ మనుషుల శ్వాస నాళాలలోకి చేరటానికి ముందు ఉమ్ముకు సోకుతున్నట్లు కనిపిస్తోంది’’ అని చెప్పారు.

ఇన్‌ఫెక్షన్ సోకిన తొలి దశలోనే గుర్తించటానికి ఈ ఉమ్మును పరీక్షించటం మార్గం కావచ్చునని అభిప్రాయపడ్డారు.

అయితే ఈ ప్రయోగం విజయవంతం అవటమనేది.. కరోనావైరస్‌ను గుర్తించటంలో ఉమ్ము పరీక్ష ఎంత ఖచ్చితతత్వంతో ఉంటుందనే అంశంపై ఆధారపడి ఉంటుంది.

ఉమ్ము నమూనాలను సర్రీలోని యనిమల్ అండ్ ప్లాంట్ హెల్త్ ఏజెన్సీ ప్రభుత్వ లేబరీటరీల్లో పరీక్షిస్తున్నారు. అక్కడ ఉమ్ము నమూనాకు ఒక ద్రావణం కలిపి వేడిచేస్తారు. తద్వారా వైరస్ జన్యు పదార్థం విడుదలవుతుంది. ఈ పద్ధతిని ఆర్‌టీ-ల్యాంప్ అంటారు. ఇది పూర్తవటానికి సుమారు 20 నిమిషాల సమయం పడుతుంది. అదే పీసీఆర్ పద్ధతిలో అనేక గంటల సమయం పడుతుంది.

ఈ పైలట్ పరీక్షలు విజయవంతం అయితే.. రెండున్నర లక్షల మంది జనాభా ఉన్న సౌతాంప్టన్ నగరంలో ప్రజలందరికీ ప్రతి వారం ఈ పరీక్షలు నిర్వహించవచ్చు.

‘‘సమాజాన్ని, ఆర్థికవ్యవస్థను తిరిగి తెరవాలనుకుంటే.. జనంలో వైరస్ వ్యాప్తి ఎలా ఉందో తెలుసుకోవటానికి ఇది మార్గం కావచ్చు’’ అని ప్రొఫెసర్ గాడ్‌ఫ్రే పేర్కొన్నారు.

అయితే.. లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ ప్రొఫెసర్ జూలియన్ పెటో సారథ్యంలోని శాస్త్రవేత్తల బృందం.. బ్రిటన్‌లోని ప్రజలందరికీ ప్రతి వారం ఉమ్ము పరీక్షలు నిర్వహించాలని సూచిస్తోంది.

సామూహిక నిఘా చేపడితే కోవిడ్-19 మహమ్మారిని అంతమొందించవచ్చునని, సాధారణ జీవితాన్ని పునరుద్ధరించవచ్చునని వారు వాదిస్తున్నారు.

ప్రస్తుతం రోజుకు మూడు లక్షల పరీక్షలు నిర్వహించగలమని ప్రభుత్వం చెప్తోంది. దేశ ప్రజలందరికీ ప్రతి వారం పరీక్షలు చేపట్టాలంటే ప్రతి రోజూ కోటి మందికి పరీక్షలు చేయాల్సి ఉంటుంది.

ఇది ఇలా పనిచేస్తుంది: మీరు ఉమ్మును పరీక్ష కోసం లేబరేటరీకి పంపిస్తారు. దాని ఫలితం 24 గంటల్లో వస్తుంది. ఒకవేళ పాజిటివ్ అయినట్లయితే మీరు, మీ కుటుంబం సొంతంగా ఐసొలేషన్‌లో ఉండాల్సి ఉంటుంది. రెస్టారెంట్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ప్రవేశించటానికి.. తాజా కోవిడ్ పరీక్ష నెగెటివ్ వచ్చినట్లు ఆధారం చూపాలని కోరవచ్చు.

మొత్తంమీద.. కోవిడ్ సోకినవారిని తక్షణమే గుర్తిస్తే మహమ్మారి వ్యాపించకుండా అడ్డుకోవచ్చుననేది ఆశ.

అయితే ఇది చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్నదే. నెలకు 100 కోట్ల పౌండ్లు ఖర్చుకావచ్చు. కానీ ఆర్థికవ్యవస్థ మీద కరోనావైరస్ చూపుతున్న ప్రభావంలో ఇది ఏమూలకూ రాదు. ప్రస్తుత సంక్షోభం కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 30,000 కోట్ల పౌండ్ల కన్నా ఎక్కువ నష్టం వాటిల్లుతుందని బడ్జెట్ విభాగం చెప్తోంది.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)