కరోనావైరస్‌ను పోలిన అరుదైన వ్యాధి బారిన పడుతున్న చిన్నారులు... కవాసకి షాక్ సిండ్రోమ్ లాంటిదేనంటున్న డాక్టర్లు

అమెరికా, బ్రిటన్ దేశాల్లో వందలాది మంది చిన్నారులు కరోనావైరస్‌ లక్షణాలు పోలిన ఒక అరుదైన వ్యాధి బారిన పడుతున్నారు.

ఈ వ్యాధి బారిన పడిన పిల్లల్లో టాక్సిక్ షాక్‌కి గురైన లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బ్రిటన్‌లో 100 మందికి పైగా పిల్లలు ఈ వ్యాధి బారిన పడ్డారు. కొంత మందిని ఇంటెన్సివ్ కేర్‌లో పెట్టాల్సిన అవసరం కూడా ఏర్పడింది. యూరప్‌లోని కొన్ని దేశాల్లో కూడా పిల్లల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.

లండన్‌లో ఈ వ్యాధి గురించి నేషనల్ హెల్త్ సర్వీస్ డాక్టర్లని అప్రమత్తం చేసిన కొద్ది రోజులోనే 8 కేసులు వెలుగు చూశాయి. అందులో 14 సంవత్సరాల బాలుడు ఒకరు మరణించారు.

ఈ వ్యాధికి గురైన పిల్లలందరిలో అధిక శరీర ఉష్ణోగ్రత (జ్వరం), ఎర్రబడిన కళ్ళు, దద్దుర్లు, వాపు, నొప్పులు లాంటి లక్షణాలు కనిపించాయని ఎవెలినా లండన్ చిల్డ్రన్స్ హాస్పిటల్ డాక్టర్లు చెప్పారు.

ఈ వ్యాధికి గురైన పిల్లల్లో శ్వాసకోశ ఇబ్బందులు కనిపించనప్పటికీ ఏడుగురిని వెంటిలేటర్ మీద పెట్టవలసి వచ్చింది.

ఇది కవాసకి డిసీజ్ షాక్ సిండ్రోమ్ అనే ఒక అరుదైన వ్యాధి లాంటిదని డాక్టర్లు పేర్కొంటున్నారు. ఇది ముఖ్యంగా ఐదేళ్ల లోపు పిల్లలకి వస్తుంది. ఈ వ్యాధి సోకిన వారిలో దద్దుర్లు, గొంతు వాపు, పెదవులు పొడిబారడం లాంటి లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు.

అయితే, ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్న వ్యాధి 16 ఏళ్ల లోపు పిల్లలకి కూడా వస్తోంది. చాలా కొద్ది మందిలో వ్యాధి లక్షణాలు తీవ్రంగా కనిపిస్తున్నాయి.

కరోనావైరస్ లాంటి మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ప్రబలిన సమయంలో ఈ వ్యాధి బయటపడటంతో దీనికి, కోవిడ్-19కి సంబంధం ఉండి ఉండవచ్చని లండన్ ఇంపీరియల్ కాలేజీలో పీడియాట్రిక్ ఇన్‌పెక్షియస్ డిసీజెస్, ఇమ్మ్యూనాలజి లెక్చరర్‌‌గా పని చేస్తున్న డాక్టర్ లిజ్ విట్టేకర్ చెప్పారు.

ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత శరీరంలో యాంటిబాడీస్ పెరగడం వలన వచ్చే వ్యాధిగా ఇది కనిపిస్తోందని ఆమె అన్నారు.

ఈ లక్షణాలు సోకిన పిల్లలు వైద్యం తీసుకున్నాక ఆరోగ్యం మెరుగైనట్లు కనిపిస్తోందని, కొంత మంది పిల్లలు చికిత్స తర్వాత ఇంటికి కూడా తిరిగి వెళ్లారని, రాయల్ కాలేజీ ఆఫ్ పీడియాట్రిక్స్ అండ్ చైల్డ్ హెల్త్ ప్రొఫెసర్ రస్సెల్ వైనర్ చెప్పారు.

ఈ వ్యాధికి భయపడి పిల్లలని ఇంటిలోనే బంధించి ఉంచనవసరం లేదని అన్నారు.

ఈ వ్యాధి లక్షణాలని అర్ధం చేసుకుంటే కొంత మంది పిల్లలు మాత్రమే తీవ్రంగా దీని బారిన ఎందుకు పడుతున్నారో అర్ధమవుతుందని అన్నారు.

కరోనావైరస్ బారిన పడిన వారిలో 1 నుంచి 2 శాతం మంది పిల్లలు ఉంటున్నారు.

అధిక శాతం పిల్లల్లో కరోనావైరస్ లక్షణాలు కనిపించినప్పటికీ , యాంటిబాడీస్ మాత్రం కనిపిస్తున్నాయని ఇంపీరియల్ కాలేజీలో పిల్లల వైద్య నిపుణుడు మైకేల్ లెవిన్ చెప్పారు.

గత రెండు మూడు వారాల్లోనే బయట పడిన ఈ వ్యాధి గురించి మరింత తెలుసుకోవాల్సి ఉందని అన్నారు.

ఈ వైరస్ సోకిన తర్వాత ఆరు వారాల వరకు ఈ వ్యాధి ప్రభావం పిల్లలపై ఉంటుందని తెలిపారు.

ప్రపంచంలో మిగిలిన చోట్ల పరిస్థితి ఏమిటి?

యూఎస్, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్‌ల్లో కూడా ఈ వ్యాధి లక్షణాలతో ఉన్న కేసులు బయట పడ్డాయి.

యూఎస్‌లో కనీసం 15 రాష్ట్రాల్లో పిల్లలు ఈ అరుదైన వ్యాధి బారిన పడ్డారని న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యుమో చెప్పారు.

ఈ లక్షణాలతో ఉన్న వారిని పరిశీలించిన 82 మందిలో 53 మంది పిల్లల్లో ఈ యాంటిబాడీస్ ఉండటం కానీ, కోవిడ్-19 లక్షణాలు కనిపించడం కానీ జరిగింది.

ఈ వ్యాధి గురించి పూర్తి వివరాలని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఈ వారంలో విడుదల చేస్తుంది.

ఉత్తర ఇటలీలో చేసిన ఒక వైద్య పరిశోధనలో ఇప్పటికే 10 మంది పిల్లలు ఈ వ్యాధి బారిన పడినట్లు తెలిసింది. అయితే వీరంతా చికిత్స అనంతరం కోలుకున్నారు.

వీరిపై జరిపిన యాంటీబాడీస్ పరీక్షలో 8 మందికి అంతకు ముందే కరోనా వైరస్ సోకగా, మరో ఇద్దరికి వైరస్ లక్షణాలు లేవు. అయితే, ఈ లక్షణాలు బయటపడటానికి కొన్ని వారాలు పట్టడంతో వెంటనే ఏమి నిర్ధారించలేమని డాక్టర్లు చెబుతున్నారు.

ఇది కేవలం పిల్లలపై మాత్రమే ప్రభావం చూపిస్తుందని చెప్పడానికి లేదని యూకేలోని వైద్య నిపుణులు చెబుతున్నారు.

పీడియాట్రిక్ ఇన్ఫ్లమేటరీ మల్టీ సిస్టం సిండ్రోమ్ (పిమ్స్ - టీఎస్) గా పిలిచే ఈ వ్యాధి గురించి యూఎస్, యూరప్‌లోని నిపుణులతో కలిసి వారు పరిశోధిస్తున్నారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)