You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వు హుయాన్: రోజుకు గుప్పెడు అన్నం, పిడికెడు మిరపకాయలు... అయిదేళ్లపాటు అదే ఆహారం తిన్న చైనా విద్యార్థిని మృతి
ఏళ్ల తరబడి రోజుకు కేవలం 20 రూపాయలు ఖర్చు పెట్టి అన్నం, మిరపకాయలే ఆహారంగా జీవించిన ఒక చైనా విద్యార్థిని.. తీవ్ర పోషకాహార లోపంతో చనిపోయిందని చైనా మీడియా వెల్లడించింది.
వు హుయాన్ అనే ఆ విద్యార్థిని.. అనారోగ్యంతో ఉన్న తన తమ్ముడికి సాయం చేయటం కోసం.. తను సరిగా తినకపోవటంతో కేవలం 20 కిలోల బరువు మాత్రమే ఉండేది. ఆమె ఫొటోలు గత ఏడాది వెలుగులోకి రావటంతో చైనా ప్రజలు దిగ్భ్రాంతికి లోనయ్యారు.
శ్వాస సమస్యలు తలెత్తటంతో ఆమెను 2019 అక్టోబరులో ఆస్పత్రిలో చేర్చారు.
ఆమె కోలుకోవటం కోసం పెద్ద ఎత్తున విరాళాలు వచ్చాయి. కానీ ఫలితం లేకపోయింది. వు హుయాన్ సోమవారం నాడు చనిపోయినట్లు ఆమె సోదరుడు విలేకరులకు చెప్పాడు.
వు హుయాన్.. తన తండ్రి, నానమ్మలు చికిత్స కోసం డబ్బులు లేక చనిపోవటంతో తాను మీడియాను సాయం కోసం అర్థించానని 'చాంగ్‌క్వింగ్ మోర్నింగ్ పోస్ట్'తో చెప్పారు.
''పేదరికం వల్ల చావు కోసం ఎదురుచూసే ఆ దుస్థితి నేను అనుభవించకూడదని అనుకున్నాను'' అని పేర్కొన్నారు.
చనిపోయేటప్పటికి ఆమె వయసు కేవలం 24 సంవత్సరాలని ఆమె తమ్ముడు 'బీజింగ్ యూత్ డెయిలీ'కి తెలిపారు.
యూనివర్సిటీలో మూడో సంవత్సరం చదవుతున్న వు హుయాన్.. ఐదేళ్ల పాటు అతి తక్కువ ఆహారంతోనే జీవించటం వల్ల గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యులు గత ఏడాది వివరించారు.
హుయాన్ కథ ఏమిటి?
వు హుయాన్, ఆమె తమ్ముడు మనుగడ సాగించటానికి చాలా ఏళ్ల పాటు ఎన్నో కష్టాలు పడ్డారు. ఆమెకు నాలుగేళ్ల వయసులో వారి తల్లి చనిపోయింది. ఆమె స్కూల్‌లో చదువుతుండగానే వారి తండ్రి కూడా చనిపోయాడు.
అప్పుడు వారిద్దరినీ వారి నానమ్మ చూసుకునేది. ఆ తర్వాత వారి బంధువులైన ఒక దంపతులు కొంత కాలం నెలకు 300 యువాన్లు (సుమారు 3,000 రూపాయలు) మాత్రం వీరికి ఇవ్వగలిగేవారు.
అయితే.. ఆమె తమ్ముడికి మానసిక ఆరోగ్య సమస్యలు ఉండటంతో అతడికి వైద్యం కోసమే ఆ డబ్బులో చాలా వరకూ ఖర్చయ్యేది.
దీంతో వు హుయాన్‌కు సగటున రోజుకు రూ. 20 మాత్రమే తన ఆహారం కోసం ఖర్చు పెట్టుకోవటానికి వీలయ్యేది. ఆమె ఐదేళ్ల పాటు అన్నం, మిరపకాయలు తింటూ జీవించింది. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చినపుడు ఆమె నాలుగు అడుగుల ఐదు అంగుళాల ఎత్తు, 20 కిలోల బరువు మాత్రమే ఉంది.
తీవ్ర పోషకాహార లోపం వల్ల ఆమె కనుబొమ్మలు, సగం జుట్టు ఊడిపోయాయని డాక్టర్లు చెప్పారు.
కారణం ఏమిటి?
ఈ అక్కాతమ్ముళ్లు చైనాలోని అత్యంత పేద రాష్ట్రాల్లో ఒకటైన గ్విజోలో నివసించేవారు. వీరి ఉదంతం.. చైనాలో పేదరికం గురించి ప్రపంచానికి తెలియజేసింది.
చైనా ఆర్థికవ్యవస్థ గత కొన్ని దశాబ్దాలుగా వేగంగా అభివృద్ధి చెందుతున్నా కూడా.. పేదరికం అంతరించిపోలేదు. 2017లో దేశంలో 3.046 కోట్ల మంది గ్రామీణ ప్రజలు జాతీయ దారిద్ర్యరేఖ అయిన రోజుకు రూ. 135 కన్నా తక్కువ ఆదాయంతో నివసిస్తున్నారని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ చెప్తోంది.
అసమానతలు కూడా పెరిగాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) 2018 నివేదిక ప్రకారం.. చైనా ఇప్పుడు ''ప్రపంచంలో అత్యంత అసమానతలు ఉన్న దేశాల్లో ఒకటి''.
వు హుయాన్ ఉదంతం.. అధికార వ్యవస్థల మీద ఆగ్రహం పెల్లుబికేలా చేసింది. ఈ అక్కాతమ్ముళ్లకు ఎందుకు సాయం చేయలేకపోయారని సోషల్ మీడియాలో అనేక మంది ప్రశ్నించారు.
ఆ యువతి తన తమ్ముడికి సాయం చేయటానికి, తను చదువు కొనసాగించటానికి చేసిన కృషి పట్ల చాలా మంది అబ్బురపడ్డారు.
క్రౌడ్‌ఫండింగ్ వేదికల ద్వారా విరాళాలతో పాటు.. ఆమె ఉపాధ్యాయులు, సహ విద్యార్థులు 40,000 యువాన్లు (సుమారు రూ. 4.11 లక్షలు) విరాళం ఇచ్చారు. ఆమె గ్రామ ప్రజలు ఆమెకు సాయం చేయటానికి 30,000 (సుమారు రూ. 3 లక్షలు) యువాన్లు సమీకరించారు.
యు హుయాన్ మరణానికి ముందు.. ఆమె ప్రభుత్వం నుంచి కనీస రాయితీ (నెలకు 300 నుంచి 700 యువాన్ల మధ్య ఉంటుందని అంచనా) పొందుతోందని, ఆస్పత్రిలో ఉండగా 20,000 యువాన్ల (సుమారు రూ. 2 లక్షలు) అత్యవసర సహాయ నిధి అందించామని అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు.
చైనా.. 2020 నాటికి పేదరికాన్ని నిర్మూలిస్తామని ప్రతిన బూనింది. ఈ నెల ఆరంభంలో.. జియాంగ్సు రాష్ట్రంలోని 8 కోట్ల మంది జనాభాలో కేవలం 17 మంది మాత్రమే పేదరికంలో జీవిస్తున్నారని ఆ రాష్ట్ర అధికారులు ప్రకటించారు. ఈ గణాంకాలను కొందరు ఆన్‌లైన్‌లో ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి:
- అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినం: భారత్‌లో పరిస్థితి ఏంటి?
- భారతీయులు తమ నిరసనల్లో రాజ్యాంగాన్ని ఎందుకు పఠిస్తున్నారు?
- వీగర్ ముస్లింలను కట్టుదిట్టమైన జైళ్ళలో బంధించి 'బ్రెయిన్‌వాష్' చేస్తున్న చైనా
- సముద్రజీవులను, భారీ తిమింగలాలను సైతం చంపేస్తున్న ‘ఘోస్ట్ గేర్’
- ఆస్ట్రేలియాలో వేల సంఖ్యలో ఒంటెలను చంపేస్తున్నారు... ఎందుకు?
- ఆర్మీ కూలీ తల నరికి తీసుకెళ్లిన పాకిస్తాన్?
- గాలి నుంచి ఆహారం తయారు చేస్తున్న ఫిన్లాండ్ శాస్త్రవేత్తలు.. ఇదెలా సాధ్యం?
- #SatyaNadella: 'విచారకరం - బాధాకరం' - CAAపై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్పందన
- హైడ్రోజన్‌తో నడిచే డ్రోన్లు.. ‘ఢీకొట్టినా పేలిపోవు’ అంటున్న హెచ్2గో పవర్
- బ్రిటన్ రాజవంశం: ప్రిన్స్ హ్యారీ, మేగన్‌ల ఆస్తుల విలువ ఎంత? వారికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
- ఆస్ట్రేలియా కార్చిచ్చు: 'నేల తల్లి బాగుండాలంటే పొదలు కాలిపోవాల్సిందే' అంటున్న ఆదివాసీలు
- ‘47 ఏళ్ల ఈ వ్యక్తి జేఎన్‌యూ విద్యార్థి.. 32 ఏళ్లుగా అక్కడే ఉంటున్నారు’ నిజమేనా? - BBC Fact Check
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)