వాతావరణ మార్పులు: మహాసముద్రాల్లో ఆక్సిజన్ తగ్గిపోతోంది

    • రచయిత, మాట్ మెక్‌గ్రాత్
    • హోదా, పర్యావరణ ప్రతినిధి, మాడ్రిడ్

వాతావరణ మార్పులు, పోషక కాలుష్యం (జలవనరుల్లో పోషకాల మోతాదు మితిమీరి ఆల్గే వంటివి ఎక్కువగా పెరగడం) కారణంగా మహాసముద్రాలలో ఆక్సిజన్ శాతం తగ్గుతుండడంతో ఎన్నో జాతుల జలచరాల ఉనికికి ప్రమాదమేర్పడుతోంది.

దశాబ్దాలుగా పోషకాలు ముంచెత్తడంపైనే మాట్లాడుకుంటున్న దశలో ఇప్పుడు వాతావరణ మార్పుల కారణంగా ఆక్సిజన్ కొరత ఏర్పడిందన్న విషయాన్ని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) చేపట్టిన అధ్యయనం తొలిసారి వెలుగులోకి తెచ్చింది.

మహాసముద్రాల్లోని సుమారు 700 ప్రాంతాల్లో ఆక్సిజన్ కొరత ఉందని ఆ అధ్యయనం వెల్లడించింది. 1960లో 45 మహాసముద్ర ప్రాంతాల్లోనే ఇలాంటి కొరత ఉండేది.

ఈ క్షీణత కారణంగా ట్యూనా, మార్లిన్, సొర చేపలకు ముప్పు ఏర్పడుతోందని ఐయూసీఎన్ అధ్యయనం హెచ్చరించింది.

పొలాలు, పరిశ్రమల నుంచి నత్రజని, ఫాస్ఫరస్ వంటి రసాయనాలు సముద్రాల్లోకి చేరడం ఆక్సిజన్ స్థాయులను ప్రభావితం చేయడమన్నది చాలాకాలంగా ఉన్న విషయమే అయినా ఇప్పటికీ అవే ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా తీరాలకు సమీపంలో సముద్రంలో ఈ సమస్య ఎక్కువగా ఉంది.

ఇటీవల కాలంలో వాతావరణ మార్పుల కారణంగా ఈ సమస్య తీవ్రమైంది.

గ్రీన్‌హౌస్ ఉద్గారాల కారణంగా కార్బన్ డై ఆక్సైడ్ ఎక్కువ మోతాదులో విడుదలవుతుండడం వల్ల కలిగే భూతాపాన్ని కొంతమేర మహాసముద్రాలు గ్రహిస్తున్నాయి. ఫలితంగా సముద్రాల్లోని నీరు వేడెక్కుతోంది. దీనివల్ల ఆ నీరు తక్కువ ఆక్సిజన్‌ను కలిగి ఉంటోంది.

శాస్త్రవేత్తల అంచనా ప్రకారం మహాసముద్రాల్లో 1960, 2010 మధ్య ఆక్సిజన్ 2 శాతం క్షీణించింది. సగటున ఇది తక్కువగా అనిపిస్తున్న ఉష్ణ మండల ప్రాంతాల్లో ఇది 40 శాతం వరకు ఉంది.

చిన్నచిన్న మార్పులు కూడా సముద్ర జీవరాశులపై గణనీయమైన ప్రభావం చూపుతాయి.

నీళ్లలో ఆక్సిజన్ తక్కువగా ఉంటే జెల్లీ ఫిష్ వంటివాటికి ఇబ్బంది లేకపోయినా పెద్ద చేపలకు, వేగంగా ఈదే ట్యూనా వంటివాటికి ఇది ఇబ్బందికరం.

పెద్ద చేపలకు అధిక శక్తి అవసరం. ఇవి ఆక్సిజన్ కోసం సముద్రపు లోతుల నుంచి ఉపరితల జలాల్లోకి రావడం ప్రారంభిస్తే వేటకు బలయ్యే ప్రమాదమూ ఉంటుంది.

''ఆక్సిజన్ తగ్గడం గురించి మనకు తెలిసినప్పటికీ దానికీ వాతావరణ మార్పులకు సంబంధం ఉందని తెలియదు. ఇది నిజంగా ఆందోళనకరం'' అన్నారు ఐయూసీఎన్‌కు చెందిన మిన్నా ఎప్స్.

''గత 50 ఏళ్లలో సముద్ర జలాల్లో ఆక్సిజన్ క్షీణత నాలుగింతలవడమే కాదు కర్బన ఉద్గారాలు తక్కువగా ఉన్న పరిస్థితుల్లోనూ ఆక్సిజన్ క్షీణించడం ఆలోచించాల్సిన విషయం''

ప్రపంచదేశాలు ఉద్గారాల విషయంలో ఇలాగే వ్యవహరిస్తే 2100 నాటికి ప్రపంచంలోని మహాసముద్రాల్లో ఆక్సిజన్ మరో 3 నుంచి 4 శాతం తగ్గిపోతుందని అంచనా.

ఉష్ణమండల ప్రాంత సముద్రాల్లో ఈ సమస్య మరింత పెరుగుతుంది. అక్కడ సముద్ర ఉపరితలం నుంచి తొలి వెయ్యి మీటర్ల వరకు ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. ఉపరిలం నుంచి తొలి వెయ్యి మీటర్ల లోతులోనే సముద్రాల్లో జీవరాశి అధికంగా ఉంటుంది. ఐయూసీఎన్ ఈ నివేదికను కాప్-25 సదస్సులో విడుదల చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)