You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
దేశమంతా ఇంటర్నెట్ ఆపేశారు.. కోర్టుకెళ్తే ఒక్కరికే ఇచ్చారు
అక్కడ సైనిక పాలకుల ఆదేశాల మేరకు టెలికాం సంస్థ దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ఒక న్యాయవాది ఈ చర్యను సవాలు చేస్తూ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు టెలికాం సంస్థ ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించింది. కానీ ఆ న్యాయవాది ఒక్కరికే.
ఉత్తర ఆఫ్రికాలోని సూడాన్‌లో జరిగిందీ ఘటన. ఆ టెలికాం ఆపరేటర్ 'జెయిన్ సుడాన్'.
ఆదివారం కోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు మూడు వారాల తర్వాత న్యాయవాది అబ్దుల్ అదీమ్ హసన్‌కు ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించారు. ప్రస్తుతం ఈ సదుపాయం తనకు ఒక్కడికే కల్పించారని, ఎందుకంటే తాను కేసును వ్యక్తిగత హోదాలో దాఖలు చేశానని ఆయన తెలిపారు.
ప్రస్తుతం దేశంలో ఇంటర్నెట్ పొందుతున్న సాధారణ పౌరుడిని తాను ఒక్కడినేనని న్యాయవాది చెప్పారు. దేశంలో మరింత మంది ప్రజలకు ఈ సదుపాయాన్ని పునరుద్ధరించాలని న్యాయస్థానాన్ని కోరతానని తెలిపారు. వారంతంలోగా పది లక్షల మంది ప్రజలు ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు.
ఇటీవల సైనిక పాలనకు వ్యతిరేకంగా సూడాన్ రాజధాని ఖార్తూమ్‌లో ఆందోళన చేపట్టిన నిరసనకారులను భద్రతా దళాలు హింసాత్మకంగా చెదరగొట్టాయి.
తర్వాత సైనిక పాలకులు ఇంటర్నెట్‌ను నిలిపివేశారు.
సూడాన్‌కు దాదాపు 30 ఏళ్లపాటు అధ్యక్షుడిగా ఉన్న ఒమర్ అల్-బషీర్, ఏప్రిల్ 11న సైనిక తిరుగుబాటుతో పదవిని కోల్పోయారు.
బషీర్‌కు వ్యతిరేకంగా నెలలపాటు ప్రజల ఆందోళనలు, ఉద్రిక్తతల నేపథ్యంలో సైన్యం తిరుగుబాటు చేసింది. ఏప్రిల్ 11 నుంచి సైనిక పాలన కొనసాగుతోంది.
తమకు ఇంటర్నెట్ ఆపేసేందుకు రాతపూర్వక ఉత్తర్వులను టెలికాం సంస్థ చూపలేకపోయిందని న్యాయవాది హసన్ బీబీసీతో చెప్పారు.
దేశంలో అందరూ బాధ్యత నుంచి తప్పించుకొనేందుకు యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
నిరసనకారులను అణచివేయడం ఆపేయాలని సూడాన్ పాలకులకు ఐక్యరాజ్యసమితి సోమవారం పిలుపునిచ్చింది.
ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించాలని సూడాన్ సైనిక పాలకులను ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ మిషెల్ బాష్‌లెట్ జెనీవాలో ఐరాస మానవ హక్కుల మండలిలో చేసిన ప్రారంభోపన్యాసంలో కోరారు.
ప్రస్తుతం సైనిక పాలనను వ్యతిరేకిస్తూ, పౌర పాలనను డిమాండ్ చేస్తూ సూడాన్‌లో ఆందోళనలు జరుగుతున్నాయి.
అత్యధిక ఆఫ్రికా, పాశ్చాత్య దేశాలు నిరసనకారులకు మద్దతు ప్రకటించాయి.
ఇవి కూడా చదవండి:
- ఆలయంలో ఉత్సవాలకు ఏనుగులు.. అడ్డు చెబుతున్న జంతు సంరక్షకులు
- అంతులేని ప్రశ్న: రోజుకు ఎన్ని జంతువులు పుడుతున్నాయి?
- ట్రావెల్ ఫొటో పోటీలు 2019: చూపుతిప్పుకోనివ్వని ఫొటోలు... విజేతలు వీరే
- ‘తాలిబన్ల ఆదాయం ఏటా రూ.లక్ష కోట్లు’.. నిజమేనా?
- అసద్ పైచేయికి రసాయన ఆయుధాలే కారణమా?
- కల్నల్ గడాఫీ: ఒకప్పటి అమెరికా పవర్ఫుల్ మహిళ వెంటపడిన నియంత
- గాడిద లాగే టాబ్లెట్ కంప్యూటర్‌తో ప్రజలకు డిజిటల్ అక్షరాస్యత
- కబీర్ సింగ్ సినిమాకు ఈలలు, చప్పట్లు దేనికి...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)