You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అమెరికా వీసా: ‘సరదాగా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రమాదంలో పడేయొచ్చు’
అమెరికా వీసా రావాలన్నా, ఇదివరకున్న వీసా రెన్యువల్ కావాలన్నా అది.. మీ ఫేస్‌బుక్, ట్విటర్ అకౌంట్‌లపై ఆధారపడి ఉంది. మీకు వీసా రావాలా వద్దా అన్నది మీ సోషల్ మీడియా అకౌంట్లు నిర్ణయిస్తాయి.
అమెరికా వీసా కోసం అప్లై చేసేవారిలో దాదాపు అందరూ జూన్ నెల నుంచి, వీసా అప్లికేషన్లతోపాటు గత 5 ఏళ్లకు చెందిన తమ సోషల్ నెట్‌వర్క్ సమాచారం కూడా పంపాలని మే 31న అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. అంతటితో కథ ముగిసిందా? ఇంకావుంది!
పాత నిబంధనల ప్రకారం అవసరమైన డాక్యుమెంట్లతోపాటుగా, దరఖాస్తుదారులు గత ఐదేళ్లలో తాము వాడిన ఫోన్ నంబర్లు, ఈ-మెయిల్ అడ్రస్‌లు కూడా ఇవ్వాలి.
2017లో అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం, దరఖాస్తుదారులపై.. భద్రత విషయంలో నియంత్రణ కోసం, గత ఏడాది మొదటిసారిగా ఈ ప్రకటన వెలువడింది.
''అమెరికా పౌరుల రక్షణ కోసం మేం అవలంబిస్తున్న వడపోత విధానాన్ని మరింత కఠినతరం చేసే అవకాశాల కోసం మేం నిరంతరం శ్రమిస్తున్నాం'' అని అమెరికా తెలిపింది.
2018లో ఈ ప్రతిపాదనలు చేసినపుడు, ఈ నిబంధనలు ఏడాదికి 1.47 కోట్లమందిపై ప్రభావం చూపిస్తాయని అధికారులు అంచనా వేశారు.
'ఈవిధమైన తనిఖీ నిష్పాక్షికంగా జరుగుతుందనడానికి ఎలాంటి ఆధారాలూ లేవు. కానీ, ఇంటర్నెట్‌లో సరదాగా చేసిన పోస్ట్ వల్ల తమకు ప్రమాదం వస్తుందేమోనని దరఖాస్తుదారులు ఆలోచనలో పడతారు' అని ది యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ తెలిపింది.
ఈ నిబంధనలు ప్రత్యేకించి ఎవర్ని ఉద్దేశించినవి?
కొత్త నిబంధనల ప్రకారం, అమెరికా వీసా కోసం దరఖాస్తుచేసేవారిలో దాదాపు అందరూ తమ సోషల్ నెట్‌వర్క్ సమాచారాన్ని ఇవ్వాలి.
అప్లికేషన్లలో సోషల్ మీడియా వేదికల జాబితా కనిపిస్తుంది. దరఖాస్తుదారులు ప్రస్తుతం వాడుతున్న లేక గత ఐదేళ్లలో వాడిన అకౌంట్ నేమ్స్‌ను ఆ జాబితాలో నింపాలి. అప్లికేషన్‌లో పొందుపరచని కొన్ని సోషల్ మీడియా నెట్‌వర్క్‌లకు సంబంధించిన సమాచారాన్ని కూడా అభ్యర్థులు స్వచ్ఛందంగా ఇవ్వాలి.
దౌత్య సంబంధ, అధికారిక వీసాలకు ఈ కొత్త నిబంధనలు వర్తించవని అమెరికా తెలిపింది. కానీ, ఉన్నత చదువుల కోసం, ఉద్యోగం కోసం, విహారయాత్రలకు వెళ్లేవారందరూ కొత్త నిబంధనలకు లోబడి, తగిన సమాచారాన్ని ఇవ్వాలి.
గతంలో ర్యాడికల్ గ్రూపుల ప్రభావం ఉన్న లేక కొన్ని ప్రత్యేకమైన దేశాలకు చెందిన ప్రజల నుంచి మాత్రమే ఈ సమాచారాన్ని తీసుకునేవారు.
సోషల్ నెట్‌వర్క్ విషయంలో ఎవరైనా తప్పుడు సమాచారం ఇస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇమ్మిగ్రేషన్ వర్గాలు తెలిపినట్లు 'ద హిల్' అనే అమెరికా పత్రిక పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)