మరోసారి దాడి చేసేందుకు భారత్ ప్లాన్ చేస్తోందన్న పాక్, ఖండించిన భారత్

ఈ నెల 16- 20 తేదీల మధ్య తమ దేశంపై దాడి చేసేందుకు భారత్‌ ప్లాన్ చేస్తోందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమూద్‌ ఖురేషీ ఆరోపించారు.

భారత్ రచిస్తున్న పథకం గురించి తమకు నిఘా సమాచారం అందిందని ఖురేషీ చెప్పారు.

అయితే, పాకిస్తాన్ ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది.

పాక్ విదేశాంగ మంత్రి వ్యాఖ్యలు బాధ్యతారహితమైనవని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ అన్నారు.

"భారత్‌లో దాడులకు పాల్పడేందుకు పాక్‌కు చెందిన ఉగ్రవాదులను ప్రేరేపించేలా పాకిస్తాన్ జిమ్మిక్కులు చేస్తోంది" అని రవీశ్ విమర్శించారు.

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో మిలిటెంట్లు జరిపిన దాడి అనంతరం, పాకిస్తాన్‌లోని బాలాకోట్‌ ప్రాంతంలో భారత్ వైమానిక దాడులు చేసింది.

పన్నెండు యుద్ధ విమానాలు వెళ్లి జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై బాంబులు వేసి ధ్వంసం చేశాయని భారత్ తెలిపింది.

ఆ తర్వాత సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

ఇప్పుడు మళ్లీ ఏప్రిల్ 16 నుంచి 20 మధ్యలో తమ దేశంపై దాడులు చేసేందుకు భారత్ సిద్ధమవుతోందంటూ ఆరోపణలు చేసిన పాకిస్తాన్ విదేశాంగ మంత్రి, తేదీలను అంత కచ్చితంగా చెప్పడానికి సంబంధించిన ఆధారాలను మాత్రం వెల్లడించలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)