You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఐఎస్ మద్దతుదారు అంజిమ్ చౌదరి వల్ల ప్రపంచానికి ప్రమాదమా?
ఇస్లామిక్ ఉగ్రవాదానికి అనుకూలంగా ప్రచారం చేసిన అంజిమ్ చౌదరిని శుక్రవారం బ్రిటన్‌లోని జైలు నుంచి విడుదల చేశారు.
అయితే, ఆయన విడుదలకు కొన్ని షరతులు విధించారు. వాటిని ఉల్లంఘిస్తే ఆయనను మళ్లీ జైలుకు తరలిస్తారు.
51 ఏళ్ల ఆంజిమ్ చౌదరి, ఉగ్రవాద సంస్థ అయిన ఇస్లామిక్ స్టేట్‌కు అనుకూలంగా ప్రచారం చేశారని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా, ఒక ఛాందసవాద బృందానికి చెందిన జిహాదిస్టులకు నేతృత్వం వహించారని ఆయనపై ఆరోపణలు చేశారు.
వీటన్నిటి ఆధారంగా చౌదరికి 2016లో ఐదున్నర ఏళ్ల జైలుశిక్ష విధించారు.
జైలు అధికారులు విధించిన షరతుల ప్రకారం, ఆయన లండన్ విడిచి వెళ్లడానికి వీల్లేదు. ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోకూడదు. పోలీసులు అనుమతించిన వారిని తప్ప వేరెవరినీ కలుసుకోవడానికి వీల్లేదు.
ఆయన మతపరమైన బోధనలు కూడా చేయరాదు. కేవలం కొన్ని మసీదులను మాత్రమే సందర్శించవచ్చు.
చౌదరిని ఇప్పుడు ఎందుకు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా భావిస్తున్నారు?
మామూలు విద్యార్థి స్థాయి నుంచి..
అంజిమ్ చౌదరి విద్యార్థిగా ఉన్నపుడు ఆయనను స్నేహితులు ఆయనను ఆండీ అని పిలిచేవారు. ఆయన స్నేహితుడు ఒకరు, ''కాలేజీ రోజుల్లో అంజిమ్ ఒక సాధారణ విద్యార్థి. తన గర్ల్ ఫ్రెండ్స్ వద్ద అతను చాలా ఫేమస్. అప్పట్లో అతను సిగరెట్లు, మద్యం తాగేవాడు'' అని తెలిపారు.
కానీ, ఏ కారణాల వల్ల చౌదరి ఇస్లామిక్ ఛాందసవాదం వైపు మొగ్గారు?
చౌదరి ఒక యూనివర్సిటీ విద్యార్థి నుంచి ఒక మతబోధకుడిగా మారడంపై బీబీసీ ప్రతినిధి డామినిక్ కసినీ, ''యూనివర్సిటీలో చదివేటప్పుడే చౌదరి మతపరమైన గ్రంథాలను ఎక్కువగా చదవడం ప్రారంభించారు. అదే సమయంలో ఆయనకు సిరియాలో ఉగ్రవాద భావాలను ప్రచారం చేసే ఉమర్ బాక్రీ మొహమ్మద్‌తో పరిచయమైంది. ఆ రోజుల్లో బాక్రీ తన బృందంలోకి యువకులను చేర్చుకునే పనిలో ఉన్నాడు'' అని తెలిపారు.
''వారంతా మధ్యప్రాచ్యంలో ఇస్లామిక్ స్టేట్‌ను నెలకొల్పాల్సిన అవసరం ఉందని భావించేవారు. ఇస్లాంను ప్రపంచవ్యాప్తంగా, మరీ ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో విస్తరింపజేయడానికి విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. అయితే 9/11 సంఘటన అనంతరం పరిస్థితులు మారిపోయాయి'' అని వివరించారు.
చేతిలో లౌడ్ స్పీకర్..
సుమారు 20 ఏళ్ల క్రితం, అంజిమ్ చౌదరి బ్రిటన్‌లోని మసీదులలో చాలా ప్రసిద్ధి. ఎక్కడికి వెళ్లినా ఆయన చేతిలో ఒక లౌడ్ స్పీకర్ ఉండేది. ఆయన ప్రసంగాలు చాలా ముక్కుసూటిగా ఉండేవి.
ఆయన నేతృత్వం వహించిన అల్ ముహజిరో నెట్‌వర్క్‌ను బ్రిటన్‌లో ఉగ్రవాద వ్యతిరేక చట్టాల కింద నిషేధించారు. తన ప్రసంగాలతో ఆయన ముస్లింలు, బ్రిటన్‌లోని ఇతర ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడతారని ఆయనపై ఆరోపణలున్నాయి.
ఆయనకు మొదటి నుంచి వార్తల్లో ఉండడం చాలా ఇష్టం. మీడియా ప్రశ్నలకు ఆయన ఎన్నడూ తడుముకునేవారు. వాటికి నవ్వుతూ సమాధానం ఇచ్చేవారు.
గతంలో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అంజిమ్ చౌదరి, ''నేను ఇంటిలో ఉన్నా, వీధుల్లో ఉన్నా ఇస్లాం కోసమే పని చేస్తాను. ఇంటర్నెట్ ద్వారా ఇస్లాంను వ్యాప్తి చేస్తాను. నేను జైలుకు వెళ్లినా ఇస్లాం ప్రచారాన్ని మాత్రం ఆపను. నాకు మంచేదో, చెడేదో తెలుసు. నేను బ్రిటన్ దౌత్యనీతిని ప్రపంచానికి వెల్లడిస్తాను'' అన్నారు.
బ్రిటన్ ప్రభుత్వానికి తలనొప్పి
ఆయన తనకు ఆయుధాలు ఉపయోగించడం రాదనేవారు. కానీ తన మాటల ద్వారా యువత ఎంతకైనా తెగించేలా చేయగలరు.
ఆయన మాటల ప్రభావంతోనే మైఖేల్ అడెబొలాజో అనే శిష్యుడు 2013లో ఒక సైనికుణ్ని చంపేశాడు.
బ్రిటన్ పోలీసులకు చౌదరిని పట్టుకోవడానికి చాలా కాలమే పట్టింది. ఎన్నో ఏళ్లు శ్రమించాకే ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరించగలిగారు.
చౌదరి అనుచరులు బ్రిటన్ లోపల, బయట ఉగ్రవాద దాడులు చేయడానికి ప్రయత్నించారని బ్రిటన్ పోలీసులు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. అందువల్ల అంజిమ్ చౌదరి బ్రిటన్ యాంటీ టెర్రరిజం టీమ్‌కు పెద్ద తలనొప్పిగా భావిస్తున్నారు.
ఎంత ప్రమాదకరం?
అంజిమ్ చౌదరికి ఇప్పుడు 51 ఏళ్లు. ఆయనను ఇప్పుడు జైలు నుంచి విడుదల చేసింది ఆయన వల్ల ప్రమాదం లేదని కాదు. జైలులో ఉన్న సమయంలో సత్ప్రవర్తన కారణంగానే ఆయనను విడుదల చేశారు.
ఆయన విడుదలకు దాదాపు 25 షరతులు విధించారు.
ఆ షరతులు విధించాక కూడా ఆయన ప్రమాదకరమా?
దీనిపై కసినీ, ''చౌదరి ఇప్పటికే ఉగ్రవాద భావజాలాన్ని తన అనుచరులు, మద్దతుదారుల్లో ప్రవేశపెట్టారు. ఆ భావజాలం ఎంత ప్రమాదకరమైంది అన్నది తెలుసుకోవడం గూఢచారులు, పరిశోధనా సంస్థలకు సవాలే'' అన్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)