ఫేస్‌బుక్: ‘భద్రతాలోపం.. హ్యాకింగ్ బారిన 5 కోట్ల మంది యూజర్ల ఖాతాలు’

    • రచయిత, డేవ్ లీనార్త్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఒక భద్రతా లోపం వల్ల సుమారు 5 కోట్ల మంది యూజర్ల ఖాతాలు హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉందని ఫేస్‌బుక్ చెప్పింది.

ఫేస్‌బుక్‌లోని ఒక ఫీచర్‌లో ఉన్న ఈ సాంకేతిక లోపంతో హ్యాకర్లు యూజర్ అకౌంట్లను హ్యాక్ చేయవచ్చని కంపెనీ విడుదల చేసిన ఒక ప్రకటన తెలిపింది.

ఈ ఫీచర్‌ను 'వ్యూ యాజ్' అంటారు. దీని ద్వారా మిగతా వారికి తన ప్రొఫైల్ ఎలా కనిపిస్తుందో యూజర్ చూడగలడు.

భద్రతా ఉల్లంఘన గురించి మంగళవారం తెలిసిందని ఫేస్‌బుక్ చెప్పింది. దాని గురించి పోలీసులకు కూడా సమాచారం ఇచ్చామని తెలిపింది.

లోపాన్ని చక్కదిద్దుతున్నాం

ఈ లోపాన్ని చక్కదిద్దుతున్నామని కంపెనీ సెక్యూరిటీ చీఫ్ గాయ్ రోజెన్ తెలిపారు.

"మేం ఇప్పుడే మా పరిశీలన ప్రారంభించాం. అకౌంట్లు దుర్వినియోగం చేశారా?, సమాచారం దొంగిలించారా? అనేది ఇంకా తెలుసుకోవాలి. ఈ సైబర్ దాడి వెనక ఎవరున్నారో?, అది ఎక్కడి నుంచి జరిగింది అనేది ఇంకా తెలియలేదు" అని ఆయన చెప్పారు.

"ప్రజల గోప్యత, భద్రత మాకు చాలా ముఖ్యం. ఇలా జరిగినందుకు మేం క్షమాపణ కోరుతున్నాం" అని రోజెన్ తెలిపారు.

'వ్యూ యాజ్' కొంప ముంచింది

యూజర్లు లాగవుట్ అయ్యి మళ్లీ లాగిన్ కావాలని, పాస్‌వర్డ్స్ మార్చాల్సిన అవసరం లేదని ఫేస్‌బుక్ చెప్పింది.

5 కోట్ల అకౌంట్లపై దీని ప్రభావం పడినట్టు ఫేస్‌బుక్ స్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్, చీఫ్ ఆపరేటింగ్ అధికారి షెరిల్ శాండ్‌బర్క్ ధ్రువీకరించినట్టు కంపెనీ తెలిపింది.

ఫేస్‌బుక్ 'వ్యూ యాజ్' అనేది ఒక ప్రైవసీ ఫీచర్. దీని ద్వారా యూజర్ మిగతా వారికి తన ప్రొఫైల్ ఎలా కనిపిస్తుందో, తన ఫేస్‌బుక్ ఫ్రెండ్స్, వారి స్నేహితులకు బయట ఏయే వివరాలు కనిపిస్తున్నాయో చెక్ చేసుకోవచ్చు.

"దాడిచేసిన వారికి ఈ ఫీచర్‌లో చాలా లోపాలు దొరికాయి. వాటి ద్వారా వాళ్లు ఫేస్‌బుక్ యాక్సెస్ టోకెన్ దొంగిలించవచ్చు. దానితో వాళ్లు ఇతరుల అకౌంట్‌ను తమ చేతుల్లోకి తీసుకోవచ్చు" అని రోజెన్ చెప్పారు.

రోజెన్ ఇంకా "యాక్సెస్ టోకెన్ డిజిటల్ తాళం చెవి లాంటిది. దాని ద్వారా యూజర్ ఫేస్‌బుక్‌లో లాగిన్ అయ్యుంటారు. ప్రతిసారీ యాప్ ఉపయోగించడం వల్ల వారికి పాస్‌వర్డ్ ఉపయోగించాల్సిన అవసరం ఉండదు" అని తెలిపారు.

హ్యాకర్లకు లక్ష్యంగా మారిన డేటా

యూజర్ల డేటాను రక్షించగలమని అమెరికా, ఇతర దేశాలను ఫేస్‌బుక్ ఒప్పిస్తున్న సమయంలో ఈ భద్రతా లోపం బయటపడింది.

శుక్రవారం జరిగిన ఒక సమావేశంలో యూజర్ల డేటా భద్రతను సంస్థ తీవ్రంగా పరిగణిస్తోందని వ్యవస్థాపకుడు జుకర్ బర్గ్ సిబ్బందికి సూచించారు. కొంతమంది హ్యాకర్ల వల్ల తరచూ దాడులు జరుగుతున్నాయని తెలిపారు.

అత్యధిక డేటా ఉన్న ఫేస్‌బుక్ ఇలాంటి సైబర్ దాడులకు ఎప్పుడూ సన్నద్ధంగా ఉండాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

"డేటా ఎక్కడ భారీగా ఉంటుందో హ్యాకర్లు అక్కడికే వెళ్తారని. అందుకే ఫేస్‌బుక్ వారికి లక్ష్యంగా మారింది. ఒక్క ఫీచర్‌తో హ్యాకర్లు కోట్ల మంది యూజర్ల డేటా తస్కరించడం అనేది ఆందోళన కలిగిస్తోంది" అని ఫారెస్టెర్ విశ్లేషకులు జెఫ్ పొలార్డ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)