బంగ్లాదేశ్ మొదటి హిందూ చీఫ్ జస్టిస్ దేశ బహిష్కరణ

    • రచయిత, నితిన్ శ్రీవాస్తవ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బంగ్లాదేశ్ వదిలి వెళ్లాలని అక్కడి ప్రభుత్వం తనపై ఒత్తిడి తెచ్చిందని ఆ దేశ మాజీ చీఫ్ జస్టిస్ ఎస్‌కె సిన్హా ఆరోపించారు.

బీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడిన బంగ్లాదేశ్ తొలి హిందూ చీఫ్ జస్టిస్ ఎస్‌కె సిన్హా 2017లో తన కుటుంబానికి 'ప్రాణహాని' ఉండడంతో ఆ దేశం వీడి వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు.

బంగ్లాదేశ్‌లో జరిగిన గత రెండు ఎన్నికల్లోనూ షేక్ హసీనా నేతృత్వంలోని ఆవామీ లీగ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదే సమయంలో ఎస్‌కె సిన్హా దేశ చీఫ్ జస్టిస్ అయ్యారు.

2017లో బంగ్లాదేశ్ నుంచి ఆస్ట్రేలియా వెళ్లిపోయిన మాజీ చీఫ్ జస్టిస్ సిన్హా ఇటీవల విడుదల చేసిన తన పుస్తకం 'ఎ బ్రోకెన్ డ్రీమ్: రూల్ ఆఫ్ లా, హ్యూమన్ రైట్స్ అండ్ డెమాక్రసీ' లో పలు విషయాలు బయటపెట్టారు.

ఎస్‌కె సిన్హా ప్రస్తుతం ఎక్కడో ఒక అజ్ఞాత ప్రాంతంలో ఉంటున్నారు. అక్కడ నుంచే ఆయన బీబీసీతో మాట్లాడారు. "తగిన సమయంలో భారత్ వచ్చి నిజాలన్నీ బయపెడతాను" అని చెప్పారు.

"నేను బంగ్లాదేశ్‌ న్యాయవ్యవస్థలో పారదర్శకత, ప్రజాస్వామ్యం పరిరక్షణ గురించి మాట్లాడేవాడిని. కానీ ప్రభుత్వం, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు నా వెనకపడ్డాయి. నన్ను నా ఇంట్లోనే అనధికారికంగా గృహనిర్బంధం చేశారు" అని ఆయన తన పుస్తకంలో ఆరోపించారు.

నా ఇల్లు పేల్చేయాలని ప్లాన్ చేశారు

"నాపై దేశం వదిలి వెళ్లాలని ఒత్తిడి తెచ్చారు. చివరికి దేశం నుంచి వెళ్లగొట్టారు" అని ఆయన పుస్తకంలో చెప్పారు.

భారత్‌లోని సిల్హట్ ప్రాంతానికి చెందిన మాజీ చీఫ్ జస్టిస్ తన పూర్వీకుల ఇంట్లో నిఘా పరికరాలు అమర్చారని చెప్పారు. బంగ్లాదేశ్ వార్ ట్రిబ్యునల్ కేసులు విచారణ చేస్తున్నానని మిలిటెంట్ సంస్థలు తన ఇంటిని పేల్చేయాలని ప్లాన్ చేసినట్టు తెలిపారు.

బంగ్లాదేశ్ ఆవామీ లీగ్ ప్రభుత్వం మాత్రం జస్టిస్ సిన్హా తన పుస్తకంలో చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవని కొట్టిపారేసింది.

షేక్ హసీనా ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రి ఒబైదుల్ కాదిర్ "జస్టిస్ సిన్హా దేశం బయట కూర్చుని ఒక కల్పిత కథను రాశారు. అధికారం పోవడం భరించలేకే ఆయన ఇలా చెబుతున్నారు. స్వయంగా బంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్‌గా ఉన్నప్పుడు ఆయన ఈ ఆరోపణలు ఎందుకు చేయలేకపోయారు" అన్నారు.

వేల మైళ్ల దూరంలో ఉన్న జస్టిస్ సిన్హాను నేను అదే ప్రశ్న అడిగినప్పుడు, ఆయన "నన్ను ఏ స్థాయిలో బ్లాక్‌మెయిల్ చేశారో వాటి గురించి ఎవరికీ తెలీదు" అన్నారు.

"నేను వారి ప్రణాళికలకు వ్యతిరేకం అని, దేశంలో నిష్పాక్షికత కోరుకుంటున్నానని ప్రభుత్వం తెలుసుకోగానే నాపై వేధింపులు ప్రారంభమయ్యాయి. నా స్నేహితులు, బంధువులు కొందరిని నిఘా వర్గాలు గృహనిర్బంధంలో ఉంచాయి. నేను వెంటనే దేశం వదిలి వెళ్లాలని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఒత్తిడి తెచ్చాయి. నా భార్యను కూడా బెదిరించాయి. నేను బయటికి రాగానే ఆమె కూడా దేశం వదిలి వెళ్లింది" అని ఆయన చెప్పారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే ఇన్ని సమస్యలు

బీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడిన సిన్హా "దేశ చట్టంలోని 16వ సవరణ ప్రకారం ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత తీసుకురావాలని భావించాను, దేశ కింది స్థాయి న్యాయ వ్యవస్థలో ఉన్న అవినీతిని అంతం చేయాలని అనుకున్నాను. నా ప్రయత్నాలను ప్రధాని, ఆమె మంత్రులు తీవ్రంగా వ్యతిరేకించారు" అని చెప్పారు.

విదేశాల్లో ముద్రితమైన తన పుస్తకంలో "దేశ చీఫ్ జస్టిస్‌గా ఉన్న నన్ను గృహనిర్బంధం చేసినపుడు, మిగతా జడ్జిలు, న్యాయవాదులను కలవడానికి కూడా నన్ను అనుమతించేవారు కాదు. మీడియాకు నేను అనారోగ్యానికి గురయ్యానని చెప్పారు. నేను చికిత్స కోసం విదేశాలకు వెళ్లాల్సి ఉంటుందని షేక్ హసీనా ప్రభుత్వంలోని దాదాపు ప్రతి మంత్రీ చెప్పేవారు" అని సిన్హా రాశారు.

ఈ సంచలన ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య బంగ్లాదేశ్‌లో ఇలా జరగడానికి చాలా కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

బీబీసీ బంగ్లా సర్వీస్ శుభజ్యోతి ఘోష్ వివరాల ప్రకారం "బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా సెక్యులర్ విధానాలకు చీఫ్ జస్టిస్ ఎస్‌కె సిన్హా పోస్టర్ బాయ్‌గా నిలిచారు. దేశంలో ఉన్న మైనారిటీ హిందూ సమాజానికి చెందిన ఆయనకు భారతదేంలోని మణిపూర్ రాష్ట్రంతోనూ బంధం ఉంది" అని చెప్పారు.

"ఒకప్పుడు షేక్ హసీనాకు సన్నిహితులైన ఎస్‌కె సిన్హా పార్లమెంటును, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రారంభించారు. అందుకే ఆయనకు సమస్యలు పెరిగాయి" అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇటు బంగ్లాదేశీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ తన్వీర్ మజహర్ సిద్దిఖీ కూడా bdnews24.com అనే ఒక వార్తా సంస్థతో మాట్లాడారు. ఇప్పటివరకూ సిన్హా పుస్తకాన్ని చూడలేదని, దాన్ని చదివిన తర్వాతే స్పందిస్తానని తెలిపారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)