పాకిస్తాన్: ఎన్నికల ఫలితాలను తిరస్కరించిన ఇమ్రాన్ వ్యతిరేక పార్టీలు

ఒక బృందంగా ఏర్పడిన పాకిస్తాన్ రాజకీయ పార్టీలు గత బుధవారం వెలువడిన ఎన్నికల ఫలితాలను తిరస్కరించాయి. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపించాయి.

ఇమ్రాన్ ఖాన్‌ను వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలన్నీ కలిసి ఇస్లామాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీ పీఎంఎల్-ఎన్ ప్రతినిధి కూడా ఉన్నారు. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఈ సమావేశంలో ఒక నేత డిమాండ్ చేశారు.

ఎన్నికల్లో మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ తహ్రీక్ ఎ ఇన్సాఫ్ పార్టీ(పీటీఐ)కి అందరికంటే ఎక్కువ స్థానాలు లభించాయి. నవాజ్ షరీఫ్ పార్టీ రెండో స్థానంలో నిలిచింది.

పార్లమెంటుకు వెళ్లాలా, లేక బహిష్కరించాలా అనేది తమ పార్టీ ఇంకా ఇంకా నిర్ణయించుకోలేదని సమావేశం తర్వాత షరీఫ్ సోదరుడు షాహ్‌బాజ్ షరీఫ్ చెప్పారు. అంతకు ముందు ప్రతిపక్షంలో కూర్చోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆ పార్టీ ప్రకటించింది.

‘మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఉద్యమం చేస్తాం. దానికోసం నిరసన ప్రదర్శనలు కూడా చేపడతాం’ అని ఎంఎంఏ పార్టీ నేత మౌలానా ఫజ్లుర్ రహమాన్ మీటింగ్ తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో చెప్పారు.

ఎన్నికల తర్వాత ఒక ఉమ్మడి వ్యూహం రూపొందించడానికి 12 కంటే ఎక్కువ ఉన్న పార్టీలు ఈ సమావేశానికి పిలుపునిచ్చాయి.

ఎన్నికల ఫలితాల్లో మూడో స్థానంలో నిలిచిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఈ సమావేశంలో పాల్గొనలేదు.

పాకిస్తాన్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 137 సీట్ల మెజారిటీ అవసరం. ఇమ్రాన్ ఖాన్ పార్టీకి 115 సీట్లు లభించాయి. తగినంత మెజారిటీ లేకపోవడంతో ఇమ్రాన్ ఖాన్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)