You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇరాన్‌పై ఆంక్షలు: ఈయూ కంపెనీలకు మినహాయింపు ఇవ్వబోమన్న అమెరికా
ఇరాన్‌పై ఆంక్షల విషయంలో ఐరోపా కంపెనీలకు మినహాయింపు ఇవ్వాలన్న ఐరోపా సమాఖ్య(ఈయూ) అభ్యర్థనను అమెరికా తోసిపుచ్చింది.
ఇరాన్‌పై ముందెన్నడూ లేనంత స్థాయిలో ఒత్తిడి తేవాలనుకుంటున్నామని అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మైక్ పాంపేయో, ఆర్థిక శాఖ మంత్రి స్టీవెన్ నూచిన్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ దేశాల మంత్రులకు వారు లేఖలు రాశారు.
ఇరాన్‌పై ఆగస్టు నుంచి అమలు చేయబోయే ఆంక్షల నుంచి ఇరాన్‌లో వ్యాపారం చేసే ఐరోపా కంపెనీలకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఈ మూడు దేశాల మంత్రులు జూన్‌లో రాసిన లేఖలకు పాంపేయో, నూచిన్ ఇటీవల ప్రత్యుత్తరమిచ్చారు. వీరిద్దరి లేఖలు ఆదివారం రాత్రి మీడియాకు 'లీక్' అయ్యాయి.
'ఇరాన్ విధానాల్లో మార్పు రావాల్సిందే'
ఇరాన్ విధానాల్లో స్పష్టమైన, నిర్దిష్టమైన మార్పు వచ్చే వరకు ఆంక్షలు ఉండాలనేదే తమ అభిమతమని పాంపేయో, నూచిన్ లేఖల్లో ఉందని ఎన్‌బీసీ ఛానల్‌తో అమెరికా అధికారులు చెప్పారు.
జాతీయ భద్రత, మానవతా అంశాల ప్రాతిపదికగా మాత్రమే ఆంక్షల నుంచి మినహాయింపు ఇస్తామని అమెరికా తెలిపింది.
2017లో ఇరాన్‌కు ఈయూ చేసిన వస్తుసేవల ఎగుమతుల విలువ 1,290 కోట్ల డాలర్లు. ఇరాన్ నుంచి ఈయూ దేశాలు చేసుకున్న వస్తుసేవల దిగుమతుల విలువ 1010 కోట్ల డాలర్లు.
అప్పుడు ట్రంప్ ఏమన్నారు?
ఇరాన్‌తో 2015 నాటి అణు ఒప్పందం నుంచి వైదొలగుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మేలో ప్రకటించారు.
తమ ఆర్థిక వ్యవస్థ, ట్రేడింగ్, బ్యాంకింగ్, చమురు తదితర రంగాలపై ఉన్న అంతర్జాతీయ ఆంక్షలను ఎత్తేస్తే తమ అణు కార్యకలాపాలను తగ్గించేందుకు అంగీకరిస్తూ, ఇరాన్ 2015 అణు ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఆంక్షలను ఐక్యరాజ్య సమితి, అమెరికా, ఈయూ విధించాయి. ఈ ఒప్పందం కుదరడంలో నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కీలక పాత్ర పోషించారు.
అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, చైనాలతో ఇరాన్ ఈ ఒప్పందం కుదుర్చుకుంది. దీనిని 'జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ (జేసీపీవోఏ)'గా వ్యవహరిస్తారు.
''ఈ ఒప్పందం లోపభూయిష్టమైనది, కాలం చెల్లినది, భయంకరమైనది, ముందెన్నడూ లేనంత ఏకపక్షమైనది'' అని ఒప్పందం నుంచి వైదొలగే సమయంలో ట్రంప్ వ్యాఖ్యానించారు. ''ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలూ తీసుకోకపోతే ఏం జరుగుతుందో మాకు బాగా తెలుసు.. ఉగ్రవాదానికి మద్దతిచ్చే ప్రధాన దేశమైన ఇరాన్, అత్యంత విధ్వంసకర ఆయుధాలైన అణ్వస్త్రాలను కొద్దికాలంలోనే సొంతం చేసుకోగలదు. అందువల్లే ఈ ఒప్పందం నుంచి వైదొలగుతున్నాం'' అని ఆయన చెప్పారు.
ఇరాన్‌లో కార్యకలాపాలను తగ్గించుకొంటున్న ఐరోపా కంపెనీలు
ఒప్పందంలో భాగస్వాములైన జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా ఈ ఒప్పందానికి కట్టుబడి ఉంటామని అప్పట్లో స్పష్టం చేశాయి. ఇరాన్‌పై అమెరికా విధించబోయే ఆంక్షల ప్రభావాన్ని తగ్గించేలా చర్యలు చేపడతామని చెప్పాయి. అయినప్పటికీ ప్యూజో, టోటల్ లాంటి ప్రధాన యూరోపియన్ కంపెనీలు ఇరాన్‌లో తమ కార్యకలాపాలను తగ్గించుకొంటున్నాయి. అమెరికాలో తమ వ్యాపార ప్రయోజనాలను కాపాడుకొనేందుకు ఈ సంస్థలు ఇలా చేస్తున్నాయి.
ఆగస్టు 6న అమల్లోకి ఆంక్షలు
ఇరాన్‌పై అమెరికా తొలి దశ ఆంక్షలు ఆగస్టు 6న అమల్లోకి రానున్నాయి. ఇరాన్ ఆటోమోటివ్ రంగం, బంగారం, ఇతర కీలక లోహాల వాణిజ్యంపై ఈ ఆంక్షలు ఉంటాయి. మలిదశ ఆంక్షలు నవంబరు 4న అమల్లోకి వస్తాయి. ఇరాన్ ఇంధన రంగం, పెట్రోలియం సంబంధిత లావాదేవీలు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇరాన్ లక్ష్యంగా ఈ ఆంక్షలు అమలవుతాయి.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్ అణుకేంద్రం గుట్టు ‘రా’ ఎలా కనిపెట్టింది?
- అభిప్రాయం: 'కేసులతో మీడియా గొంతు నొక్కాలనుకుంటున్నారు'
- వాట్సాప్‌లో వదంతులను ఆపలేమా?
- అణు ఒప్పందం నుంచి తప్పుకున్న అమెరికా: ఇప్పుడేం జరుగుతుంది?
- టికెట్ కలెక్టర్ నుంచి ట్రోఫీ కలెక్టర్ వరకూ ఎంఎస్ ధోనీ జర్నీ
- #YouTubeStars: చెముడు హర్ష.. వైవా హర్షగా ఎలా మారారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)