You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
#FIFA2018: దర్శకుడు, రాజకీయ నాయకుడు, దంతవైద్యుడున్న జట్టు ఇది
ఫుట్‌బాల్ ప్రపంచ కప్ పోటీల్లో తలపడిన/తలపడుతున్న దేశాల్లో అతిచిన్న దేశం(జనాభా పరంగా) ఐస్‌లాండ్.
ఈ నెల 16న రష్యాలోని మాస్కోలో తాను ఆడిన తొలి ప్రపంచ కప్ మ్యాచ్‌లోనే అనూహ్య ప్రదర్శనతో ఐస్‌లాండ్ జట్టు ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది.
దిగ్గజ ఆటగాడైన లియోనెల్ మెస్సీ నాయకత్వంలోని బలమైన అర్జెంటీనాను నిలువరించి, 1-1 స్కోరుతో మ్యాచ్‌ను డ్రాగా ముగించింది.
అయితే, ఐస్‌లాండ్ జట్టులోని టాప్ ఆటగాళ్ల నేపథ్యాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
డైరెక్టర్: హాన్స్ హాల్‌డర్సన్
మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనాను నిలువరించడంతో హాన్స్, ఐస్‌ల్యాండ్‌లో హీరోగా నిలిచాడు.
అయితే, ఈయన ఆటలో ప్రత్యర్థి జట్టును ఎదుర్కొనేందుకు సహచరులకు డైరెక్షన్ ఇవ్వడమే కాదు, బయట సినిమాల్లో నటీనటులకు దర్శకత్వం వహిస్తాడు.
నార్వేలోని సాగాఫిల్మ్ అనే సినిమా ప్రొడక్షన్ కంపెనీలో దర్శకుడిగా పనిచేసేవాడు. ఫుట్‌బాల్ ఆట కోసం దానికి విరామం ఇచ్చాడు.
ఫుట్‌బాల్ కెరీర్ ముగియగానే మళ్లీ ఉద్యోగంలో చేరతానని ఆ సంస్థ నిర్వాహకులకు మాటిచ్చాడట హాన్స్.
2012లో జరిగిన 'యూరోవిజన్' అంతర్జాతీయ సంగీత పోటీల్లో ఐస్‌ల్యాండ్ పాల్గొంటున్న సందర్భంగా రూపొందించిన ప్రోమో వీడియోకు ఇతడే దర్శకత్వం వహించాడు.
రాజకీయ నాయకుడు: రూరిక్ గిస్లాసన్
రూరిక్ ఫుట్‌బాల్ క్రీడాకారుడే కాదు, రాజకీయ నాయకుడు కూడా.
ఐస్‌లాండ్‌లో 2016, 2017లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో 'ది ఇండిపెండెన్స్ పార్టీ' తరఫున రెండు సార్లు పోటీచేశాడు.
తన స్వస్థలమైన దక్షిణ రేజోవిక్ స్థానంలో భరిలో దిగాడు.
అయితే, ఓటర్లను ఆకర్షించేందుకే ఇండిపెండెన్స్ పార్టీ రూరిక్‌ను తమ అభ్యర్థిగా పోటీలో నిలిపిందన్న విమర్శలు వచ్చాయి.
నాలుగు తరాల వారసుడు: అల్బర్ట్ గుడ్‌ముండ్సన్
ఫుట్‌బాల్‌తో అల్బర్ కుటుంబంలో నాలుగు తరాల వారికి అనుబంధం ఉంది.
అల్బర్ట్ తండ్రి బెనెడిక్‌ట్సన్ మాజీ అంతర్జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారుడు.
అల్బర్ట్ తల్లి కూడా మాజీ క్రీడాకారిణి. ఆమె తండ్రి(అల్బర్ట్‌కు తాత) కూడా రికార్డులు నెలకొల్పిన ఫుట్‌బాల్ ఆటగాడు. 1987 నుంచి 2012 మధ్యలో అత్యధిక గోల్స్ చేసిన ఐస్‌ల్యాండ్ క్రీడాకారుడిగా రికార్డు ఆయన పేరిటే ఉండేది.
ఇకపోతే.. అల్బర్ట్ ముత్తాత కూడా ఫుట్‌బాల్ క్రీడాకారుడే. అతని పేరు కూడా అల్బర్ట్. ఐస్‌లాండ్‌కు చెందిన తొలి ప్రొఫెషనల్ ఆటగాడిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు.
దంతవైద్యుడు: హీమర్ హాల్‌గ్రిమ్సన్
ఒక వృత్తిలో స్థిరపడ్డాక, మరో రంగానికి మారాలంటే కష్టమైన పనే. కానీ, అలా మారి విజయవంతం అయితే వచ్చే కిక్కే వేరు.
అలాగే, ఒకప్పుడు పూర్తిస్థాయి దంతవైద్యుడిగా పనిచేసిన హీమర్ హాల్‌గ్రిమ్సన్ ప్రస్తుతం దేశ ఫుట్‌బాల్ జట్టుకు మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
దాదాపు పదేళ్లపాటు దంతవైద్యుడిగా అనుభవం ఉన్న ఆయన, 1990ల్లో ఐస్‌ల్యాండ్ మహిళల ఫుట్‌బాల్ జట్టుకు మేనేజర్‌గా పనిచేశాడు. అయినా ఖాళీ సమయంలో దంతవైద్యుడిగా పనిచేస్తుండేవాడు.
తర్వాత 2011లో పురుషుల జట్టుకు అసిస్టెంట్ మేనేజర్, 2013లో జాయింట్ మేనేజర్ అయ్యాడు.
2016 నుంచి మేనేజర్‌గా వ్యవహరిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)